Begin typing your search above and press return to search.

ప‌ద‌వుల రేసులో ఫ‌స్ట్‌.. పోటీకి మాత్రం లాస్ట్‌!

By:  Tupaki Desk   |   27 Feb 2019 5:30 PM GMT
ప‌ద‌వుల రేసులో ఫ‌స్ట్‌.. పోటీకి మాత్రం లాస్ట్‌!
X
కాలం మారి రాజ‌కీయ పార్టీల‌న్నింటిలోనూ అంత‌ర్గ‌త ప్ర‌జాస్వామ్యం అన్న‌ది క‌నిపించ‌దు. కానీ.. ఇప్ప‌టికి కాంగ్రెస్ పార్టీలో మాత్రం మూడు పువ్వులు.. ఆరు కాయ‌లు అన్న‌ట్లుంది. తెలంగాణ అసెంబ్లీకి జ‌రిగిన ముంద‌స్తు ఎన్నిక‌ల వేళ‌లో.. పార్టీ మాంచి ఊపు మీద ఉంద‌న్న‌మీడియా వార్త‌ల‌తో టీ కాంగ్రెస్ నేత‌ల్లో క‌నిపించిన జోష్ అంతా ఇంతా కాదు. పార్టీ కోసం ఎంత క‌ష్ట‌ప‌డ్డాం.. ఎంత శ్ర‌మించామ‌న్న విష‌యాల్ని ప‌క్క‌న పెట్టి.. పార్టీ గెలిచినంత‌నే త‌మ‌కే ముఖ్య‌మంత్రి సీటు ఇవ్వాల‌ని కొంద‌రు.. మంత్రి ప‌ద‌వి ప‌క్కాగా త‌మ‌కే చెందాల‌ని మ‌రికొంద‌రు ఢిల్లీకి వెళ్లి మ‌రి క‌ర్చీప్ లు వేసుకురావ‌టం తెలిసిందే.

అయితే.. తెలంగాణ‌లో కాంగ్రెస్‌ కు క‌నిపిస్తున్న బ‌ల‌మంతా బ‌లుపు కాదు కేవ‌లం వాపు అన్న విష‌యాన్ని కేసీఆర్ నెత్తి నోరు కొట్టుకున్నా ఎవ‌రూ ప‌ట్టించుకున్న‌ది లేదు. కానీ.. ఎన్నిక‌ల ఫ‌లితాలు విడుద‌లైన త‌ర్వాత కాంగ్రెస్ నేత‌ల క‌ళ్ల‌కు క‌ట్టిన నిషా ఒక్క‌సారిగా వ‌దిలిపోయింది. కాంగ్రెస్ పార్టీకి ప‌వ‌ర్ అప్ప‌గించేందుకు ప్ర‌జ‌లు సిద్ధంగా లేర‌న్న విష‌యాన్ని స్ప‌ష్టం చేయ‌టంతో పాటు.. కేసీఆర్ మేజిక్ ముందు త‌మ ప్ర‌చార ఆర్భాటం.. హ‌డావుడి ఏమీ ప‌ని చేయ‌వ‌న్న విష‌యం అర్థ‌మైంది.

దీంతో.. తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు మైండ్ సెట్ మొత్తంగా మారింది. కేసీఆర్ ను కాద‌ని తెలంగాణ‌లో ఇప్ప‌ట్లో ఏమీ చేయ‌లేమ‌న్న విష‌యం అర్థ‌మైన సీనియ‌ర్ నేత‌లు త్వ‌ర‌లో జ‌రిగే లోక్ స‌భ ఎన్నిక‌ల విష‌యంలో వెనుకంజ వేస్తున్నారు. జాతీయ స్థాయిలో మోడీ హ‌వా మీద న‌మ్మ‌కం ఉండ‌టం కొంత అయితే.. తెలంగాణ‌లో కేసీఆర్ ను కాద‌ని మ‌రీ త‌మ‌కు ఓటు వేసే అవ‌కాశం లేద‌న్న నిరాశ కాంగ్రెస్ నేత‌ల్లో వినిపిస్తోంది.

దీంతో.. ఎవ‌రికి వారు పోటీ బ‌రిలోకి దిగేందుకు స‌సేమిరా అంటున్నారు. మ‌రికొంద‌రు అయితే తెలివిగా త‌మ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల పేర్ల‌ను తెర మీద‌కు తెచ్చి.. సీనియ‌ర్లు ఆ మాత్రం బ‌రిలోకి దిగ‌క‌పోతే ఎలా? అన్న కొత్త వాదులాట షురూ అయ్యింది. ఇందుకు తాజాగా జ‌రిగిన కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల క‌మిటీ స‌మావేశాన్ని ఉదాహ‌ర‌ణ‌గా చెప్పాలి.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ‌లో త‌మ‌కే సీట్లు ఇవ్వాల‌ని.. ఎవ‌రైనా ముందుకు వ‌చ్చినా పోట్లాడుతున్నా.. మీకెందుకు ఇవ్వాల‌న్న వాద‌న వినిపించేవారు. ఇప్పుడేమో అందుకు భిన్నంగా తాము పోటీకి దిగుతామ‌న్న మాటను కూడా చెప్ప‌ని వారు.. త‌మ‌కు బ‌దులుగా త‌మ ప్ర‌త్య‌ర్థుల్ని బ‌రిలోకి దిగాల‌న్న ఉచిత స‌ల‌హాల్ని తాజాగా ఇస్తున్నారు. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా నుంచి పోటీ చేసే అభ్య‌ర్థుల పేర్ల‌లో జైపాల్ రెడ్డి పేరు లేక‌పోవ‌టాన్ని ప్ర‌స్తావించిన మాజీ మంత్రి డీకే అరుణ ఫైర్ అయ్యారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. ఇదే జైపాల్ రెడ్డి అప్ప‌ట్లో అరుణ మాట కాదంటూ పోటీకి సై అన్నారు. ఇప్పుడేమో ఆయ‌న ఆస‌క్తి చూపించ‌టం లేదు. అదే స‌మ‌యంలో డీకే అరుణ మాత్రం.. ప‌ద‌వుల‌కైతే ముందు ఉంటారు కానీ పోటీ చేయ‌టానికి ఏమైంది? సీనియ‌ర్లు అనే వారు పోటీకి దూరంగా ఉంటే ఎలా అంటూ ఆమె ప్ర‌శ్నిస్తున్నారు. ఇదే రీతిలో ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఇలాంటి సీనే క‌నిపిస్తుండ‌టం చూస్తే.. నాడు ప‌ద‌వుల కోసం క‌ర్ఛీప్ లువేస్తూ ఫుల్ బిజీగా ఉన్న కాంగ్రెస్ నేత‌లంతా.. నేడు పోటీకి దూరంగా. ఉండాల‌ని భావించ‌టం చూస్తే.. తెలంగాణ‌లో అధికార ప‌క్షం ప‌ట్టు ఎంత ఉంద‌న్న విష‌యం ఇట్టే అర్థ‌మ‌వుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.