Begin typing your search above and press return to search.

టీ కాంగ్రెస్ కు ‘సరైనోడు’ కావాలట..

By:  Tupaki Desk   |   17 April 2016 6:57 AM GMT
టీ కాంగ్రెస్ కు ‘సరైనోడు’ కావాలట..
X
తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌ కు ప్రత్యేక గుర్తింపు ఉన్నా కూడా ఆ క్రెడిట్ పార్టీకి కొంచెం కూడా ఉపయోగపడలేదు. అంతేకాదు క్రమేణా తెలంగాణ నుంచి కనుమరుగయ్యే స్థితికి చేరుకుంటోంది. పార్టీ నుండి ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు - ముఖ్యనేతలు టిఆర్ ఎస్ లోకి జంప్ అవుతున్నారు. అధికార టిఆర్ ఎస్ కు ప్రత్యామ్నాయంగా బలమయిన రాజకీయ పార్టీగా తీర్చిదిద్దాల్సిన నేతలు తమకెందుకులే అంటూ చేతులు కట్టుకుని కూర్చున్నారు. పొన్నాల లక్ష్మయ్య స్థానంలో నూతన పిసిసి అధ్యక్షులుగా కెప్టెన్ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి బాధ్యతలు తీసుకున్పప్పటికి పార్టీ పరిస్థితిలో మాత్రం మార్పు రాలేదు. ఆయన నాయకత్వంలో జరిగిన ప్రతి ఎన్నికలలోను పార్టీ దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఉత్తమ్ కూడా పార్టీ పరిస్థితి ఏ మాత్రం బాగా లేదని ఈ పరిస్థితులలో బాధ్యతలు నిర్వహించడం తన వల్ల కాదంటూ చేతులెత్తేశారనే ప్రచారం జరిగింది.

టి కాంగ్రెస్ నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవ హరిస్తుండడంతో 2019 ఎన్నికల నాటికి కూడా కాంగ్రెస్ కోలుకునే పరిస్థితులు లేవని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల నడుమ టి కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించారు. అయితే... ఈ కార్యవర్గంపై పార్టీ శ్రేణులు పెదవి విరుస్తున్నాయి. 75 మందితో జంబో కార్యవర్గాన్ని ప్రకటించడం వల్ల ప్రయోజనం లేదని... సరైనోడు ఒక్కడుంటే చాలని అంటున్నారు. అయితే... ఇంతకీ ఆ సరైనోడు ఎవరంటే మాత్రం ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు.

జంబో కార్యవర్గంలో సుమారు 99 శాతం మంది పాతకాపులకే పట్టంకట్టారు. వారిలో 75 శాతం మంది ఇప్పటికే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అలాంటప్పుడు వారి వల్ల వచ్చే లాభమేంటో తెలియని పరిస్థితి.

టిఆర్ ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిని అన్ని ఎన్నికలలోను టిఆర్ ఎస్ ఘన విజయం సాదించింది. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి - జానారెడ్డిలు పార్టీ నాయకత్వా న్ని ఏకతాటిపై నడపడంలో విఫలమవుతున్నారు. పార్టీ నిర్వహించే ఆందోళనలు - రాస్తారోకోలు వంటి కార్యక్రమాలకు ఆర్థిక అవసరాలు కరవు కావడంతో ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయి. ఇలాంటి సమయంలో కెసిఆర్ ఎదుర్కొని నిలబడగలిగే నాయకుని కోసం కాంగ్రెస్ శ్రేణులు ఎదురుచూస్తున్నా యి. తెలంగాణ ఇచ్చిన పార్టీగా, రాష్ట్రంలో ఖచ్చితమయిన ఓటు బ్యాంకు కలిగి ఉన్న కాంగ్రెస్‌ ను నడిపించే నాయకు డు కరువు అయ్యాడని నేతలు అంటున్నారు. సోనియా గాంధీపై తెలంగాణ ప్రజలలో సానుభూతి ఉన్నప్పటికి దానిని ఓట్ల రూపంలో మలచడంలో టిపిసిసి నాయకత్వం తీవ్ర వైఫల్యం చెందుతుంది. కాంగ్రెస్ పార్టీకి వృద్ద నాయకత్వం స్థానంలో యువ నాయకులు రావాల్సిన అవసరం ఉందని పార్టీ శ్రేణుల వాదన. సరైనోడు వస్తే కానీ కాంగ్రెస్ బతకడం కష్టమని అంటున్నారు. ఇంతకీ ఆ సరైనోడు ఎవరో మరి? ఎప్పుడొస్తాడో మరి?