Begin typing your search above and press return to search.

ఆ సీట్లు అన్ని సీనియ‌ర్ల‌కేన‌ట‌

By:  Tupaki Desk   |   16 Feb 2018 5:01 AM GMT
ఆ సీట్లు అన్ని సీనియ‌ర్ల‌కేన‌ట‌
X
తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే చాలు.. తెలంగాణ ప్ర‌జ‌లు త‌మ చేతికి అధికారాన్ని ఇచ్చేస్తార‌న్న లెక్క‌లు వేసుకున్న కాంగ్రెస్ పార్టీ దుర్మార్గ లెక్క‌లు తెలియంది కావు. అయితే.. కాంగ్రెస్ లెక్క‌ల్ని చిత్తు చేస్తూ తెలంగాణ ప్ర‌జ‌లు తెలివిగా షాకిచ్చిన వైనం తెలిసిందే. విభ‌జ‌న ప్లాన్ వ‌ర్క్ వుట్ కావ‌టం త‌ర్వాత‌.. కాంగ్రెస్ ఆస్తిత్వానికే ప్ర‌శ్న‌గా మార్చ‌టం అధినాయ‌క‌త్వానికి ఏ మాత్రం మింగుడు ప‌డ‌నిదిగా మారింది. విభ‌జ‌న త‌ర్వాత జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల షాక్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఇంకా కోలుకోలేద‌ని చెప్పాలి.

ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న వేళ‌.. తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు త‌మ పోరును మ‌రింత పెంచారు. అదే స‌మ‌యంలో అంత‌ర్గ‌త క‌ల‌హాల్లోనూ అదే జోరుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. లోప‌ల లుక‌లుక‌లున్నా..పైకి క‌వ‌ర్ చేస్తూ క‌లిసి క‌ట్టుగా పోరాడుతున్న‌ట్లుగా క‌ల‌ర్ ఇస్తున్నారు. ఈసారి తెలంగాణ‌లో అధికారంలోకి రాకున్నా.. సీట్ల సంఖ్య‌లో మెరుగుద‌ల లేకుంటే మొద‌టికే మోసం వ‌స్తుంద‌న్న ఉద్దేశంలో పార్టీ అధినాయ‌క‌త్వం ఉంది.

ఇందులో భాగంగా ఎన్నిక‌ల‌కు సంబంధించిన ప‌క్కా ప్లాన్ సిద్ధం చేసిన‌ట్లుగా చెబుతున్నారు. కాంగ్రెస్ లో ఉన్న సీనియ‌ర్ నేత‌లు ప‌లువురు ఈసారి ఎన్నిక‌ల్లో త‌మ వార‌సుల్ని రంగంలోకి దించాల‌ని భావిస్తున్నారు. ఇందుకోసం చేయాల్సిన ఏర్పాట్లు దాదాపుగా పూర్తి చేసుకున్నారు. పార్టీ నుంచి టికెట్లు తెప్పించుకునేందుకు చేయాల్సిన ప్ర‌య‌త్నాల‌న్నీ బ్యాక్ ఎండ్ లో జోరుగా సాగుతున్నాయి. ఇలాంటి వేళ‌.. తెలంగాణకు సంబంధించి ఆస‌క్తిక‌ర నిర్ణ‌యాన్ని పార్టీ అధినాయ‌క‌త్వం తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది.

ఎన్నిక‌ల బ‌రిలో సీనియ‌ర్ల‌ను ఎంపీ టికెట్ల‌కు కేటాయించి.. వారి వార‌సుల‌కు అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రిలో దించాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు చెబుతున్నారు. వార‌సుల్ని ఎన్నిక‌ల గోదాలోకి దించాల‌ని భావిస్తున్న నేత‌ల్ని లోక్ స‌భ టికెట్లు ఇచ్చేయ‌టం ద్వారా సీఎం రేసు విష‌యంలో అన‌వ‌స‌ర రాద్ధాంతానికి చెక్ పెట్టాల‌ని భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు.

ఇప్ప‌టికే త‌మ వార‌సులకు టికెట్లు ఇప్పించుకోవ‌టానికి ఢిల్లీ అధినాయ‌క‌త్వం వ‌ద్ద‌కు రాయ‌బారాల‌కు వెళుతున్న నేత‌ల‌కు.. టికెట్ల విష‌యంలో స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న క‌ల్పిస్తున్న‌ట్లు చెబుతున్నారు.

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో రానున్న ఎన్నిక‌లు కాంగ్రెస్‌ కు కీల‌క‌మైన‌వి. ఈ నేప‌థ్యంలో అన‌వ‌స‌ర‌మైన మొహ‌మాటాల‌కు పోతే మొద‌టికే మోసం రావ‌టం ఖాయం. ఈ నేప‌థ్యంలో టికెట్ల‌కు సంబంధించి అన‌వ‌స‌ర అసంతృప్తులు తెర మీద‌కు రాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్లు చెబుతున్నారు. ఏ రాజ‌కీయ నాయ‌కుడైనా..ఎంత‌టి మొన‌గాడైనా కుటుంబానికి రెండు టికెట్ల‌కు మించి ఇచ్చేది లేద‌న్న మాట‌ను స్ప‌ష్టం చేస్తున్న‌ట్లు చెబుతున్నారు. ఇప్ప‌టికే పెద్ద ఎత్తున టికెట్లు ఆశిస్తున్న కుటుంబాలుగా సీనియ‌ర్ నేత‌లు కోమ‌టిరెడ్డి.. పొన్నాల‌..జానా.. స‌బిత‌.. డీకే.. స‌ర్వే.. గీతా.. రాజ‌న‌ర్సింహా త‌దిత‌రులు ఉన్న‌ట్లుగా చెబుతున్నారు.

ఇలాంటి వారి విష‌యంలో సీనియ‌ర్ల‌కు ఎంపీ టికెట్‌.. వారి వార‌సుల‌కు అసెంబ్లీ టికెట్ ఇవ్వ‌నున్న‌ట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించి ఇప్ప‌టికే ప‌లువురు నేత‌లు ఓకే చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. ఇటీవ‌ల కాలంలో ప‌లువురు నేత‌ల నోటి నుంచి వ‌స్తున్న ప్ర‌క‌ట‌న‌లు కూడా ఈ ఫార్ములాకు త‌గిన‌ట్లుగా ఉండ‌టం గ‌మ‌నార్హం. సీనియ‌ర్ నేత కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి తాను న‌ల్గొండ‌ ఎంపీ స్థానానికి పోటీ చేయ‌నున్న‌ట్లు చెబుతుండ‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు. ఇదంతా త‌న సోద‌రుడు రాజ్ గోపాల్ రెడ్డికి లైన్ క్లియ‌ర్ చేసేందుకేన‌ని చెబుతున్నారు. జానా సైతం ఇలాంటి ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. త‌న కుమారుడు ర‌ఘువీర్ ను అసెంబ్లీ బ‌రిలో దించి.. తాను ఎంపీగా పోటీ చేయాల‌ని భావిస్తున్నారు. ఇక‌.. స‌బితా విష‌యానికి వ‌స్తే గ‌త ఎన్నిక‌ల్లోనే త‌న కుమారుడు కోసం అసెంబ్లీ స్థానాన్ని వ‌దులుకున్నారు. ఈసారి తాను ఎంపీ స్థానానికి పోటీ చేసి.. కుమారుడ్ని అసెంబ్లీ బ‌రిలో దింపాల‌ని భావిస్తున్నారు.

ఇక‌.. పొన్నాల ఫ్యామిలీ విష‌యానికి వ‌స్తే.. ఆయ‌న ఎంపీగా బ‌రిలోకి దిగాల‌ని.. కోడ‌ల్ని జ‌న‌గామ నుంచి పోటీ చేయించాల‌ని భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు. ఇక‌.. జైపాల్ రెడ్డి విష‌యానికి వ‌స్తే ఆయ‌న్ను ఈసారి సీడ‌బ్ల్యూసీలోకి తీసుకుంటార‌ని చెబుతున్నారు. అదే స‌మ‌యంలో ఆయ‌న్ను సీఎం రేసులో దించే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. అయితే.. జైపాల్ కు మాత్రం సీఎం ప‌ద‌వి కంటే ఎంపీగా బ‌రిలోకి దిగ‌టానికే ఆస‌క్తి చూపిస్తున్న‌ట్లు తెలుస్తోంది.