Begin typing your search above and press return to search.

విప‌క్ష నేత‌ల‌పై కొత్త డౌట్లు వ‌చ్చేస్తున్నాయి

By:  Tupaki Desk   |   2 July 2017 10:04 AM GMT
విప‌క్ష నేత‌ల‌పై కొత్త డౌట్లు వ‌చ్చేస్తున్నాయి
X
తెలంగాణలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ పార్టీ గురించి రాజ‌కీయ అవ‌గాహ‌న‌ ఉన్న‌వారిని అడిగితే ఏం చెప్తారు? ప‌్ర‌త్యేక రాష్ట్ర సుదీర్ఘ కల‌ను అధికారం అండ‌గా నెర‌వేర్చిన కాంగ్రెస్ పార్టీ....2014 ఎన్నిక‌ల్లో అధికారాన్ని మాత్రం కైవ‌సం చేసుకోలేక‌పోయింది. ఆ త‌ర్వాత జరిగిన అన్ని ఎన్నిక‌ల్లో ప‌రాభ‌వం పాల‌యిన‌ప్ప‌టికీ ఇటీవ‌ల కాస్త దూకుడు పెంచుతోంది. త‌న ముద్ర‌ను వేసుకుంటూ ముందుకు సాగుతోంది` అని విశ్లేషిస్తారు క‌దా. కానీ ఆ పార్టీలోని అతి స్వాతంత్ర్యం కార‌ణంగా ఇప్పుడు కొత్త పంచాయ‌తీలు మొద‌ల‌య్యాయ‌ని వినిపిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకత్వంలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలు హస్తినకు చేరాయని స‌మాచారం. హైదరాబాద్‌ నుంచి కలిసి ఢిల్లీకెళ్లినా నేతలంతా అధిష్టానం పెద్దలను మాత్రం విడివిడిగా కలిసి తమ సమస్యలను ఏకరువు పెట్టారు. పీసీసీ - సీఎల్పీ నేతల మధ్య నెలకొన్న మనస్పర్థలను నాయకులు అధిష్టానం ముందు చెప్పుకోవడమే కాకుండా ఫిర్యాదులు చేసుకున్నారని స‌మాచారం.

రాష్ట్రపతి అభ్యర్థి మీరాకుమార్‌ ను అభినందించడానికి ఇటీవల ఢిల్లీకెళ్లిన పీసీసీ - సీఎల్పీ నాయకులు పనిలో పనిగా రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలను, పార్టీలో నెలకొన్న గ్రూపు తగాదాలను అధిష్టానం పెద్దల చెవిలో పడేశారు. అధిష్టానానికి పార్టీ పరిస్థితి చెప్పడంతోపాటు తమ పాత్రను పాజిటివ్‌ గా చెప్పుకోవడం, తమతో విభేదించే వారి గురించి నెగెటివ్‌ గా చెప్పి అధిష్టానం మెప్పు పొందేందుకు అసాంతం ప్రయత్నించినట్టు తెలిసింది.పార్టీ పరంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పదును పెంచడంలో పీసీసీ విఫలమైందని సీఎల్పీ చెబితే, ప్రజాసమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలబెట్టడంలో సీఎల్పీకి వ్యూహం లేకుండా పోయిందని పీసీసీ చెప్పుకున్నట్టు సమాచారం. మియాపూర్‌ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లపై పార్టీ నామ్‌కే వాస్తే కార్యక్రమాలు నిర్వహించి చేతులు దులుపుకుందన్న భావన ప్రజల్లో ఉందని సీనియర్‌ నేత ఒకరు చెప్పారు.

ఇదిలా ఉండగా కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అభ్యర్థి ఉత్తమ్‌ కుమార్‌రె డ్డి అంటూ కొంత మంది నేతలు చేస్తున్న ప్రచారాన్ని సీఎల్పీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ముందుగానే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే అనవాయితీ కాంగ్రెస్‌ పార్టీలో లేనప్పటికీ ఇటువంటి ప్రచారం జరగడంతో ఈ విభేదాలు మరింత తారాస్థాయికి చేరాయి. ఈ విషయం తెలిసినా టీపీసీసీ నాయకత్వం ఖండించకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో కొంత క్లారిటీ ఇవ్వాలని అధిష్టానానికి పలువురు నేతలు మొరపెట్టుకున్నట్టు తెలిసింది. రెండు వైపులా వాదనలు విన్న తర్వాత విభేదాలు పక్కన పెట్టి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మొట్టికాయలు వేసినట్టు విశ్వసనీయ సమాచారం. త‌మ పార్టీ నేత‌ల సొంత కుంప‌ట్లు చూస్తుంటే అధికారానికి చేరువ అవ‌డం అయ్యేప‌నేనా అంటూ కాంగ్రెస్ నేత‌ల్లో కూడా నిర్వేదం వ‌స్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/