Begin typing your search above and press return to search.

కారు వైపు...కాంగ్రెస్ నేతల చూపు...

By:  Tupaki Desk   |   26 July 2018 5:30 PM GMT
కారు వైపు...కాంగ్రెస్ నేతల చూపు...
X
తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి నానాటికి దిగజారుతోంది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీకి ఒక విధంగా గడ్డు కాలమనే చెప్పాలి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమంత బాగోలేదు. ఇక్కడి నాయకులు కారు ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే గ్రేటర్ కాంగ్రెస్‌ కు చెందిన దానం నాగేందర్ తెలంగాణ రాష్ట్ర సమితి తీర్ధం పుచ్చుకున్నారు. ఆయన తర్వాత పాత నగరానికి చెందిన మాజీ మంత్రి - సీనియర్ నాయకుడు ముఖేష్ గౌడ్ కూడా తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరేందుకు రంగం చేసుకుంటున్నారు. ఆయన్ని బుజ్జగించేందుకు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చేసిన ప్రయత్నాలు ఏవీ పని చేయడం లేదు. స్వయంగా తెలంగాణ పిసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా ముఖేష్ కుమార్ గౌడ్ ఇంటికి వెళ్లి ఆయన్ని పార్టీ మారే ఆలోచన విరమించుకోవాలని సూచించారు. అప్పుడు కాస్త మెత్తబడిన ముకేష్ గౌడ్ ఆ తర్వాత మాత్రం తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులతో "టచ్" ఉన్నట్లు సమాచారం.

ఆయనతో పాటు ఆయన కుమారుడు విక్రమ్ గౌడ్ తో పాటు పాత బస్తీకి చెందిన పలువురు నాయకులు - వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరే అవకాశాలున్నాయి. ఇక సమైక్య రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా పని చేసిన దామోదర రాజ నరసింహ కూడా కారు ఎక్కేందుకు తన ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన కాంగ్రెస్ అధిష్టానం ఆయన వద్దకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బోసు రాజును దూతగా పంపింది. అయితే ఆయన చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదని సమాచారం. తెలంగాణ కాంగ్రెస్ లో నానాటికి నల్లగొండ - మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన వారి ఆధిపత్యం పెరుగుతోందని, వారి మాటలే చెల్లుబాటు అవుతున్నాయని రాజ నరసింహ అన్నట్లు సమాచారం. ఎన్నికల ముందు తాను తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరితే పెద్దగా ఉపయోగం ఉండదని, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని అనుకుంటున్నట్లు సమాచారం.

ఇక ఆంధ్రప్రదేశ్‌ లో పాత కాపులను పార్టీలోకి తీసుకురావాలని కాంగ్రెస్ అధిష్టానం చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు. ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి పాత గూడు కాంగ్రెస్‌ లో చేరారు. ఆయన చేరిక తర్వాత కాంగ్రెస్ పాత నాయకులందరిని పార్టీలోకి తీసుకురావాలని చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు. తనతో పాటు పాత వారందరిని తిరిగి పార్టీలోకి తీసుకువస్తానని కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానానికి హామీ ఇచ్చారు, అయితే ఆంధ్రప్రదేశ్‌ లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కేంద్రంలో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా ఇచ్చిన తర్వాత పార్టీలోకి వస్తామని - అంతవరకూ తమ జోలికి రావద్దని ఒకరిద్దరు నాయకులు కిరణ్ కుమార్ రెడ్దికి స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. దీంతో కిరణ్ కుమార్ రెడ్డి చేరిక వల్ల పార్టీకి అదనంగా వచ్చే ప్రయోజనం ఏమీ లేదని రాహుల్ గాంధీకి ఆంధ్రప్రదేశ్ నాయకులు చెప్పినట్లు సమాచారం. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంభట్లు అన్నట్లుగా మారింది.