Begin typing your search above and press return to search.

ఇందుకే క‌దా కేసీఆర్ కాంగ్రెస్‌ ను ఆడుకునేది

By:  Tupaki Desk   |   27 March 2018 11:43 AM GMT
ఇందుకే క‌దా కేసీఆర్ కాంగ్రెస్‌ ను ఆడుకునేది
X
స‌హ‌జంగా శ‌త్రువు బ‌ల‌వంతుడు అయిన‌ప్పుడు పోరాటం ఎలా ఉండాలి? ఏ అవ‌కాశం అందివ‌చ్చినా ఏ మాత్రం సంశ‌యించ‌కుండా దూసుకుపోవాలి. ప్ర‌త్య‌ర్థిని ముప్పుతిప్ప‌లు పెట్టేలా ఉండాలి. కానీ తెలంగాణ‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ పార్టీ ఆ పని చేయ‌లేక‌పోతోంది పైగా కేసీఆర్‌ కు అవ‌కాశాల‌ను సైతం అందిస్తోంద‌ని అంటున్నారు. గవర్నర్ ప్రసంగం సమయంలో శాసనసభలో అనుచితంగా ప్రవర్తించి పదవులు పొగొట్టుకున్న కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి - సంపత్ కుమార్ పార్టీ నాయకత్వంపైన నిప్పులు చెరుగుతున్నారు. పార్టీ కోసం పదవులు త్యాగం చేస్తే పట్టించుకునే వారే కరవయ్యారని నేతలిద్దరు రగిలిపోతున్నారు. అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకోకుండా వివాదాన్ని మూలనపడేయడంపైన నాయకులు ధ్వజమెత్తుతున్నారు. పీసీసీ - సిఎల్పీ తీరుపైన అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి - సంపత్ కుమార్ ఢిల్లీలో మకాం వేశారని విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం.

రాష్ట్ర శాసనసభ చరిత్రలో ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు కావడం చాలా అరుదైన విషయం. ఏ రాజకీయ పార్టీ అయినా ఈ విషయాన్ని తమకనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నిస్తుంది. కాంగ్రెస్ మాత్రం కోమటిరెడ్డి - సంపత్ లను పక్కన పెట్టింది. మరో ఏడాది పదవి కాలం ఉండగానే శాసనసభ్యత్వాన్ని కోల్పోయిన వీరిద్దరికి అండగా నిలవాల్సిన పార్టీ మౌన ముద్ర దాల్చింది. గాంధీభవన్ లో నలభై ఎనిమిది గంటల దీక్ష ముగిసిన తర్వాత కోమటిరెడ్డి - సంపత్ వ్యవహారం చల్లబడింది. కోర్టు చూసుకుంటుందిలే అన్నట్లుగా కాంగ్రెస్ నాయకత్వం పట్టించుకోలేదు. దీంతో ఈ అంశానికి ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. తమను అన్యాయంగా పదవుల నుంచి తొలగించారన్న వీరి వాదనకు బలం లేకుండా పోయింది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులను కదిలించాల్సిన నాయకత్వం ఎలాంటి పిలుపు ఇవ్వలేదు. ఉద్యమ కార్యాచరణ లేకపోవడంతో కార్యకర్తలు - నాయకులు ఈ అంశాన్ని వదిలిపెట్టారు.

మ‌రోవైపు ఇక అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు ఎవరి దారి వారు చూసుకున్నారు. తమను అన్యాయంగా సభ నుంచి బయటకు పంపించారన్న వాదనను బలంగా వినిపించే ప్రయత్నం కూడా వీరు చేయలేదు. మీడియా ముందు గగ్గోలు పెట్టడం మినహా మరో కార్యక్రమం చేపట్టకపోవడంతో ఎమ్మెల్యేల సస్పెన్షన్ వ్యవహారం అటకెక్కింది. అసెంబ్లీ నుంచి విపక్ష శాసనసభ్యులను సస్పెండ్ చేస్తే సాధారణంగా అక్కడే ఆందోళనలు చేయడం చూస్తుంటాం.కాని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం మారు మాట్లాడకుండా శాసనసభ నుంచి వెళ్లిపోయారు. మళ్ళీ అటు వైపు తిరిగి చూడలేదు. ఫలితంగా అధికార పార్టీ సాఫీగా సమావేశాలను నిర్వహించుకుంటోంది. కాగా, బస్సు యాత్ర హడావుడిలో పీసీసీ ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి బహిష్కరణ వ్యవహారాన్ని పట్టించుకోవడం లేదు. యాత్రలోనే మాట్లాడదామన్న ఆలోచనలో ఆయన ఉన్నారు. మిగిలిన ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది సీనియర్లు కావడంతో రోడ్లపైకి వచ్చి పోరాటాలు చేయడానికి సుముఖంగా లేరు. దీనికి తోడు నేతల మధ్య విభేదాలు. ఫలితంగా చక్కటి అవకాశం నీరుగారి పోయిందని కాంగ్రెస్ వ‌ర్గాలే అంటున్నాయి.