Begin typing your search above and press return to search.

కేసీఆర్ ముందస్తు... టీకాంగ్రెస్ కసరత్తు

By:  Tupaki Desk   |   29 Aug 2018 5:44 AM GMT
కేసీఆర్ ముందస్తు... టీకాంగ్రెస్ కసరత్తు
X
తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ రెడీ అవుతున్నట్లుగా సూచనలు అందుతుండడంతో కాంగ్రెస్ పార్టీ కూడా వెంటనే అప్రమత్తమవుతోంది. పీసీసీ కార్యవర్గ సభ్యులు - కేంద్ర మాజీ మంత్రులు - ఏఐసీసీ సభ్యులు - శాసనసభ - శాసన మండలి నాయకులు - జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు భేటీ అయి ఎన్నికలు ముందుగా వస్తే ఏం చేయాలన్న అంశంపై చర్చించారు. పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు - ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలతో బుధవారం భేటీ నిర్వహించనున్నారు.

కాగా జిల్లాల అధ్యక్షులు - పీసీసీ నాయకులు చాలా మంది రాష్ట్రంలో పొత్తులు పెట్టుకోవాలని నాయకత్వానికి సూచించినట్లుగా తెలుస్తోంది. పార్టీకి ఇబ్బందిలేని సీట్లను కలిసి వచ్చే పార్టీలకు కేటాయిస్తే బాగుంటుందని వీరు స్పష్టం చేశారు. తెలంగాణలో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే మంచిదన్న అభిప్రాయాన్ని ఎక్కువ మంది నాయకులు వ్యక్తం చేశారని తెలిసింది. టీడీపీకి అన్ని జిల్లాల్లో బలమైన కార్యకర్తలు ఉన్నారని - వీరి మద్దతు ఉంటే టీఆర్ ఎస్‌ ను ఎదుర్కోవడం మరింత సులువు అవుతుందని ఈ నాయకులు సమావేశంలో అభిప్రాయపడ్డారని తెల్సింది. పొత్తు కుదిరితే కనీసం 15 సీట్ల వరకు టీడీపీకి ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.

మరోవైపు తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించిన తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాంతోనూ పొత్తుల గురించి సంప్రదించాలని పీసీసీ నిర్ణయించింది. కోదండరాం ఎన్ని సీట్లు - ఏ సీట్లు కోరుతారన్న దానిపై పొత్తు ఆధారపడి ఉంటుందని పీసీసీ వర్గాలు వెల్లడించాయి. ముందస్తు ఎన్నికలు ముంచుకు వస్తున్నందున పొత్తుల విషయాన్ని సాధ్యమైంత త్వరగా తేల్చి - క్షేత్ర స్థాయికి వెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేయాలని సమావేశంలో చాలా మంది నాయకులు పీసీసీ నాయకత్వానికి సూచించారు. సీపీఐ గతంలోనే తాము కాంగ్రెస్‌ తోనే కలిసి ఉంటామని ప్రకటించినందున సీట్ల సంఖ్య విషయంలోనే చర్చలు జరపాల్సి ఉంటుందని పీసీసీ నాయకులు చెబుతున్నారు.