Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ నేతల్లో 'ఐటీ దాడుల' టెన్షన్

By:  Tupaki Desk   |   20 Sep 2018 10:57 AM GMT
కాంగ్రెస్ నేతల్లో ఐటీ దాడుల టెన్షన్
X
తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద ఐటీ దాడులు తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. వాస్తవానికి ఐటీ దాడులకు - రాజకీయాలకు అస్సలు సంబంధం లేదు. కానీ పొంగులేటిపై దాడులు జరిగాక కాంగ్రెస్ నేతలు కలవరపడుతున్నారట..టీఆర్ ఎస్ ఎంపీపై ఐటీ దాడులు జరిగితే ప్రత్యర్థి కాంగ్రెస్ పండుగ చేసుకోవాలి కానీ ఇక్కడ కాంగ్రెస్ నేతలు భయపడడానికి బలమైన కారణమే ఉందట.. టీఆర్ ఎస్ ను బూచీగా చూపి బీజేపీ ప్రభుత్వం తమపైనా ఐటీ దాడులకు సిద్ధమయ్యిందనే వార్త తెలంగాణ కాంగ్రెస్ నేతలను షేక్ చేస్తోందట..

తెలంగాణ కాంగ్రెస్ ముందట ఇప్పుడు పెను సవాళ్లున్నాయి. మహాకూటమిని ఏర్పాటు చేసినా ఇంకా సీట్ల సర్ధుబాటు కాక తలబొప్పి కడుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు హఠాత్తుగా ఐటీ దాడుల టెన్షన్ మొదలైందట.. పొంగులేటి మీద డమ్మీగా ఐటీ దాడులు జరిగాయని.. దాన్ని బేస్ చేసుకొని తమపైన ఐటీ దాడులకు బీజేపీ-టీఆర్ ఎస్ ప్లాన్ చేసిందని కాంగ్రెస్ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారట.. కాంగ్రెస్ నేతల మీద ఐటీ దాడులు జరిగినా.. టీఆర్ ఎస్ ఎంపీ పొంగులేటి మీద జరగలేదా అని అటువైపు వేలు చూపించి చట్టం ముందు అంతా సమానమే అని చెప్పడానికే ముందు పొంగులేటిపై దాడులు చేశారనే చర్చ కాంగ్రెస్ నేతల్లో సాగుతోందట..

ఇప్పటికే కాంగ్రెస్ లో బలమైన నేత జగ్గారెడ్డిని జైలుకు పంపారు. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి కుంభకోణం కేసును వెలికి తీశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే రాబోయే రోజుల్లో తమపై ఐటీ దాడులు జరుగుతాయేమోనన్న భయం కాంగ్రెస్ నేతలను వెంటాడుతోందట.. అసలే ఎన్నికల సమయం. ఇప్పుడు ఏ చిన్న సమస్య ఎదురైనా దాని ప్రభావం ఎన్నికలపై ఉంటుంది. దీంతో కాంగ్రెస్ నేతలు మరింతగా కంగారు పడుతున్నారట.. పొంగులేటిపై జరిగిన దాడులు తమ మీదుగా సాగితే పరిస్థితి ఏంటని కాంగ్రెస్ నేతల్లో చర్చ జోరుగా సాగుతోందట.. ఎన్నికల సమరంలోకి సమరోత్సాహంతో దిగాలని చూస్తున్న కాంగ్రెస్ లో ఈ ప్రచారం కొత్త టెన్షన్ ను రేకెత్తిస్తోంది.