Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు!

By:  Tupaki Desk   |   29 Jun 2018 8:33 AM GMT
కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు!
X
అవసరాలు ఎన్ని పనులు అయినా చేయిస్తాయి.. తెలంగాణ కోసం గొంగళి పురుగును అయినా ముద్దు పెట్టుకుంటానని ఉద్యమ సమయంలో కేసీఆర్ అన్నారు. స్వరాష్ట్రం కోసం కేసీఆర్ ఎంతకైనా తెగించాడు అనడానికి ఈ ఉదాహరణ చాలు. ఇక రాష్ట్రం ఏర్పడ్డాక కూడా అధికార సుస్థిరత కోసం తెలంగాణను వ్యతిరేకించిన.. తెలంగాణ కోసం కనీసం ఒక్కరోజు కూడా ఉద్యమించని నేతలను ప్రభుత్వంలో చేర్చుకొని వారికి మంత్రి పదవులు ఇచ్చారు. కేసీఆర్ చేసిన ఈ పనిని ఇప్పటికీ పలువురు విమర్శిస్తూనే ఉంటారు. కానీ తప్పదు. అన్ని వర్గాలు - అన్ని లెక్కలు వేసుకొనే కేసీఆర్ ఇలా చేశారు..

ఇప్పుడు కాంగ్రెస్ కూడా కేసీఆర్ స్ట్రాటజీని ఫాలో అవుతోంది. ప్రతిపక్షంగా మరో ఐదేళ్లు ఉంటే తెలంగాణలో అసలు ప్రతిపక్షమే లేకుండా పోయే ప్రమాదం ఉంది. కేసీఆర్ ను ఎదుర్కొని మరో ఐదేళ్లు నిలబడడం కష్టమే. అందుకే పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాస్టర్ ప్లాన్ వేశారు. వచ్చే అక్టోబర్ లోనే ముందస్తు ఎన్నికల సంకేతాలు వినిపిస్తున్న తరుణంలోనే టీఆర్ ఎస్ ను ఓడించేందుకు మహాకూటమి ప్రతిపాదనను తెరమీదకు తీసుకొచ్చారు.

తెలంగాణలో కాంగ్రెస్ తర్వాత అతిపెద్ద పార్టీ అయిన టీడీపీతో పొత్తుపెట్టుకోవాలని.. సీపీఐ - కోదండరాం ‘తెలంగాణ జనసమితి పార్టీలను కలుపుకొని ఈ విశాల కూటమిని ఏర్పాటు చేసే దిశగా తెలంగాణ కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ తో కలిసి పని చేసేందుకు తెలంగాణ ఇంటిపార్టీ ఒప్పుకుంది. కాంగ్రెస్ లో కలుపుకునేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ పార్టీ అధినేత చెరుకు సుధాకర్ ను ఒప్పించారు. కోదండరాంతోనూ చర్చలు జరుపుతున్నారు.

టీఆర్ ఎస్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు ఇ బద్ధ శత్రువు అయిన టీడీపీతో జతకట్టడానికి కాంగ్రెస్ సిద్ధమవడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ మధ్య చంద్రబాబు బీజేపీతో తెగదెంపులు చేసుకోవడం.. కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వానికి మద్దతు తెలపడం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అందుకే తెలంగాణలో ప్రస్తుతం వీక్ అయిన టీడీపీని కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చేలా నాయకులను ఒప్పిస్తున్నట్టు సమాచారం. కాంగ్రెస్ నుంచి ప్రతిపాదన రాగానే టీడీపీ-కాంగ్రెస్ కలిసి తెలంగాణలో పోటీచేసేలా బాబు ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఇక చిన్నా చితకా పార్టీలన్నింటిని కలిపేసి మహాకూటమిని ఏర్పాటు చేసి వచ్చేఎన్నికల్లో ఎలాగైనా టీఆర్ ఎస్ పార్టీని ఓడించాలనుకుంటున్న కాంగ్రెస్ ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాలి మరి.