Begin typing your search above and press return to search.

ఏం చెప్పాలి? టీ-కాంగ్రెస్ నేత‌ల్లో గుబులు!

By:  Tupaki Desk   |   2 Oct 2022 5:48 PM GMT
ఏం చెప్పాలి?  టీ-కాంగ్రెస్ నేత‌ల్లో గుబులు!
X
నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) నోటీసులు అందుకున్న తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు అల్లాడి పోతున్నారు. ఈడీ అధికారులు త‌మ‌కు నోటీసులు ఇవ్వ‌డంపై తొలుత అస‌లు అవేవీ త‌మ‌కు అంద‌లేద‌ని మీడియాకు చెప్పిన నాయ‌కులు.. త‌ర్వాత‌.. నింపాదిగా లైట్ తీసుకున్న‌ట్టు చెప్పారు. అయితే.. ఈడీ విచార‌ణ‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ వారిలో ఆందోళ‌న సునామీలా త‌న్నుకువ‌స్తోంది. నేరుగా వెళ్లి సోనియాగాంధీ, రాహుల్ గాంధీల‌ను క‌లిసే అవ‌కాశం లేదు. దీనిపై ఏమాత్రం ఉప్పందినా.. అరెస్టు చేసే అవ‌కాశం ఉంది.

దీంతో ఇప్పుడు `కిం క‌ర్త‌వ్యం?` అంటూ.. నాయ‌కులు త‌ల‌లు ప‌ట్టుకున్నారు. మాజీ మంత్రులు సుదర్శన్‌ రెడ్డి, షబ్బీర్‌ అలీ, గీతా రెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌, కాంగ్రెస్‌ నేత అనిల్‌ కుమార్ స‌హా.. ఖ‌మ్మం నేత‌.. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌద‌రికి కూడా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసిన విష‌యం తెలిసిందే. వాస్త‌వానికి వీళ్లంతా.. ఫైర్ బ్రాండ్లే. అయినా.. కీల‌క‌మైన కేసు కావ‌డం.. ఇప్ప‌టికే సోనియా .. రాహుల్ గాంధీల‌ను విచారించి ఉండ‌డంతో.. ఏం చెప్పాల‌నేది వీరిని వెంటాడుతున్న ప్ర‌ధాన ప్ర‌శ్న‌. దీంతో వీరంతా ఇప్పుడు క‌ట్ట‌క‌ట్టుకుని.. ఢిల్లీ వెళ్లారు.

న్యాయసలహా కోసం పార్టీ లాయర్లతో చర్చలు జరుపుతున్నారు. ఢిల్లీలో లాయర్లు, ఆడిటర్లతో సమావేశమయ్యారు. ఈడీ ప్రశ్నలకు ఇవ్వాల్సిన సమాధానాలపై వీరు ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది. పార్టీ సంస్థాగత ఎన్నికల నేపథ్యంలో నామినేషన్‌ పత్రాలపై సంతకాలు చేయడం కోసం ఢిల్లీ వచ్చామని, ఈడీ నోటీసులపై కూడా లాయర్లతో చర్చలు జరిపామని అంజన్‌ కుమార్‌ యాదవ్ చూచాయ‌గా మీడియాకు లీకులు ఇచ్చారు. ఈడీ నోటీసులు అందుకున్న తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు దసరా తర్వాత 7-12వ తేదీల మధ్య విచారణకు హాజరుకావాల్సి ఉంది.

ఈ నేప‌థ్యంలో ఈడీ అధికారులు ఏం ప్ర‌శ్న‌లు సంధించే అవ‌కాశం ఉంద‌ని లాయ‌ర్ల‌ను అడుగుతున్న‌ట్టు తెలిసింది. అవ‌స‌ర‌మైతే.. రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి.. మ‌రికొంద‌రు లాయ‌ర్ల‌ను సంప్ర‌దించే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. నేష‌న‌ల్ హెరాల్డ్ కేసును విచారిస్తున్న లాయ‌ర్ల నుంచి వీరు స‌మాచారం సేక‌రిస్తున్నారు. అయితే..ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. అస‌లు ఆ కేసు ఏంటో కూడా త‌మ‌కు తెలియ‌ద‌ని.. వీరిలో కొంద‌రు పేర్కొంటున్నారు. మ‌రి ఈడీకి ఏం చెబుతారో చూడాలి. ఏం చెప్పినా.. అటు పార్టీ భ‌విత‌వ్యం.. అటు అగ్ర‌నేతలను కాపాడాల్సిన అవ‌స‌రం ఉంది. మ‌రి ఏంచేస్తారో చూడాలి.