Begin typing your search above and press return to search.

కేసీఆర్ కోరుకున్నట్లే చేస్తున్న టీ కాంగ్రెస్ నేతలు

By:  Tupaki Desk   |   20 May 2020 7:10 AM GMT
కేసీఆర్ కోరుకున్నట్లే చేస్తున్న టీ కాంగ్రెస్ నేతలు
X
ప్రత్యర్థుల్ని చిన్నబుచ్చేలా మాట్లాడటంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కున్న ప్రావీణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే ఉండదు. మిగిలిన వ్యవస్థల మాదిరే.. ప్రతిపక్షాలు ఎలా ఉండాలో కూడా చెప్పేయటం అలవాటే. తనను విమర్శించే విపక్ష నేతల్ని ఉద్దేశించి.. వారికి ఏ అంశాన్ని తీసుకోవాలో కూడా తెలీదు. వారంత సన్నాసులు.. ఎప్పుడే ఇష్యూను టేకప్ చేయాలో తెలీనోళ్లు మమ్మల్ని తప్పు పట్టేటోళ్లా? అని విమర్శించేస్తుంటారు.

ఇటీవల కాలంలో కేసీఆర్ నోట ఈ మాట తరచూ వస్తోంది. ఈ మాటల్నివిన్న వారికి విపక్షాలు మరీ ఇంత తెలివితక్కువగా వ్యవహరిస్తాయా? అన్న భావన కలగటం ఖాయం. గడిచిన కొద్దిరోజులుగా సెంటిమెంట్ ను రాజేసే అంశాలు తమ చేతికి చిక్కకపోవటంతో.. మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్న వారికి.. పోతిరెడ్డిపాడు మీద నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం ఇప్పుడో అవకాశంగా లభించింది. ఏపీ సర్కారు నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకంపై తెలంగాణ కాంగ్రెస్.. బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నరు. తెలంగాణ ప్రయోజనాల్ని పణంగా పెడుతున్నారంటూ తప్పు పడుతున్నారు.

కేంద్రానికి లేఖ రాసి మరీ.. ఎంపీ బండి సంజయ్ తన సత్తా చాటితే.. ఇటీవల కాలంలో మరే అంశం మీదా లేనంత బలంగా పోతిరెడ్డిపాడు అంశాన్ని ప్రస్తావిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. నీళ్లు.. నిధులు కాపాడటానికే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందన్న విషయాన్ని మర్చిపోకూడదని.. హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేదా? అని ప్రశ్నిస్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.

ఏపీ అసెంబ్లీలో పోతిరెడ్డిపాడుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ప్రకటన చేసిన తర్వాత కూడా సీఎం కేసీఆర్ స్పందించలేదన్న విషయాన్ని గుర్తు చేశారు ఉత్తమ్. కాళేశ్వరం నుంచి 2 టీఎంసీల నీటి కోసం లక్ష కోట్ల రూపాయిల్ని ఖర్చు చేస్తున్నారన్న ఉత్తమ్.. భావితరాల ప్రయోజనాల్నితాకట్టు పెట్టేలా పథకం చేపడుతున్నట్లు విమర్శించారు.

చెప్పిన పంటలు వేస్తేనే రైతుబంధు ఇస్తామని సీఎం కేసీఆర్ ఎప్పుడూ చెప్పలేదని.. దీన్ని రైతులు వ్యతిరేకిస్తారన్న ఉత్తమ్ మాటలు ఇలా ఉంటే.. కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి సైతం గళం విప్పారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపునకు 2005లోనే ఆదేశాలు వచ్చాయని.. ప్రాజెక్టుసామర్థ్యం 11 వేల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచేందుకు జీవో ఇచ్చారన్నారు. అప్పట్లో కేంద్రమంత్రిగా ఉన్న కేసీఆర్.. పోతిరెడ్డిపాడు గురించి అస్సలు మాట్లాడలేదని గుర్తు చేశారు.

ప్రగతి భవన్ లో కేసీఆర్ తో ఏపీ సీఎం జగన్ భేటీ అయ్యాకే జీవో విడుదలైందన్న ఆయన.. ఆ రోజున జరిగిన సమావేశానికి సంబంధించిన వాస్తవాల్ని బయటపెట్టాలన్నారు. ఇదిలా ఉంటే మరో కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం స్పందించారు. దక్షిణ తెలంగాణను ఎండబెట్టే కార్యక్రమం జరుగుతుందని.. తెలంగాణను ఎడారిగా మార్చే 203 జీవోను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. కాళేశ్వరంలో 90 శాతం పనులు పూర్తి చేసిన కేసీఆర్.. దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయటం లేదని ప్రశ్నించారు.

గతానికి భిన్నంగా వర్తమానంలో కేసీఆర్ కోరుకున్నట్లే..సెంటిమెంట్ ను రాజేసే అంశాలతో పాటు.. దక్షిణ తెలంగాణ పట్ల కేసీఆర్ ప్రదర్శించే చిన్నచూపును బలంగా వినిపిస్తున్నారు. ఇంతకాలం సరైన ఇష్యూల్ని టేకప్ చేయటంలో ఫెయిల్ అవుతున్నారన్న కేసీఆర్ కోరికను తీర్చేలా తెలంగాణ కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారని చెప్పక తప్పదు.