Begin typing your search above and press return to search.

2004 కేసుపై క‌దిలిన డొంక‌..జ‌గ్గారెడ్డి అరెస్ట్‌!

By:  Tupaki Desk   |   11 Sep 2018 5:00 AM GMT
2004 కేసుపై క‌దిలిన డొంక‌..జ‌గ్గారెడ్డి అరెస్ట్‌!
X
ఊహించ‌ని ప‌రిణామం చోటు చేసుకుంది. 2004కు సంబంధించిన కేసు డొంక క‌ద‌ల‌ట‌మే కాదు.. అందులో త‌ప్పు చేసిన‌ట్లుగా ఆధారాలు ల‌భించిన నేప‌థ్యంలోసంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే.. మాజీ విప్ గా ప‌ని చేసిన తూర్పు జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి అలియాస్ జ‌గ్గారెడ్డిని సోమ‌వారం రాత్రివేళ అరెస్ట్ చేశారు. ఈ విష‌యాన్ని ఉత్త‌ర మండ‌లం డీసీపీ బి.సుమ‌తి ధ్రువీక‌రించారు. 2004లో జ‌గ్గారెడ్డి చేసిన మోసాల‌కు సంబంధించిన స‌మాచారం సోమ‌వారం ఉద‌యం త‌మ‌కు అంద‌గా.. సాయంత్రానికి ఆయ‌న్ను అరెస్ట్ చేసిన‌ట్లుగా పోలీసులు చెబుతున్నారు.

న‌కిలీ డాక్యుమెంట్ల‌ను2004లో త‌న ఎమ్మెల్యే అధికారిక లెట‌ర్ ప్యాడ్ పై ప్రాంతీయ పాస్ పోర్టు అధికారికి ఒక లేఖ రాశారు. త‌న భార్య నిర్మ‌ల‌.. కుమార్తె జ‌య‌ల‌క్ష్మి.. కుమారుడు భ‌ర‌త్ సాయి రెడ్డిల‌కు వెంట‌నే పాస్ పోర్ట్ ఇవ్వాల‌ని ఆ లేఖ‌లో పేర్కొంటూ.. అమెరికా వీసా తీసుకునేట‌ప్పుడు న‌కిలీ డాక్యుమెంట్లు స‌మ‌ర్పించారు.

వాటితో ఇద్ద‌రు మ‌హిళ‌ల్ని.. ఒక యువ‌కుడ్ని అక్ర‌మంగా అమెరికాకు తీసుకెళ్లారు. అనంత‌రం జ‌గ్గారెడ్డి ఒక్క‌రు మాత్రం వెన‌క్కి తిరిగి వ‌చ్చిన‌ట్లుగా పోలీసులు చెబుతున్నారు. 2004 నాటికి జ‌గ్గారెడ్డి కుమారుడు వ‌య‌సు నాలుగేళ్లు కాగా.. పాస్ పోర్టు కోసం త‌ప్పుడు డాక్యుమెంట్లు చూపించి వ‌య‌సు 17 ఏళ్లుగా చూపించార‌ని.. అలాగే కుమార్తె జ‌య‌ల‌క్ష్మి 1997లో పుట్ట‌గా పాస్ట్ పోర్టులో మాత్రం 1987లో పుట్టిన‌ట్లుగా చూపించిన‌ట్లుగా చెబుతున్నారు.

ఎమ్మెల్యే హోదాలో ఆయ‌న అధికార దుర్వినియోగానికి పాల్ప‌డ్డార‌ని.. మాన‌వ అక్ర‌మ ర‌వాణా చేశార‌ని.. ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు స‌మ‌ర్పించార‌ని.. ఇందుకు సంబంధించిన ఆధారాలు ప‌క్కాగా దొరికిన త‌ర్వాతే ఆయ‌న్ను అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఈ నేరాల‌కు గాను ఆయ‌న‌పై ప‌లుసెక్ష‌న్ల కింద‌ కేసులు న‌మోదు చేశారు.

మాన‌వ అక్ర‌మ ర‌వాణాకు పాల్పడ్డార‌ని ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న జ‌గ్గారెడ్డిపై భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్లు 419 - 490 - 467 - 468 - 471 (ఇవన్నీ నకిలీ - తప్పుడు డాక్యుమెంట్లు - మోసాలకు సంబంధించిన సెక్షన్లు) - 370 (మానవ అక్రమ రవాణా) - పాస్‌ పోర్టు చట్టంలోని సెక్షన్‌ 12 - ఇమిగ్రేషన్‌ చట్టంలోని సెక్షన్‌ 24 కింద కేసులు నమోదు చేశారు. మ‌రికొన్ని సెక్ష‌న్ల‌ను కూడా ప‌రిశీలించి.. కేసులు పెట్టే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా తెలుస్తోంది.

న‌కిలీ ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు స‌మ‌ర్పించి పాస్ పోర్టులు తీసుకోవ‌ట‌మే కాక‌.. వాటితో మానవ అక్ర‌మ ర‌వాణాకు సంబంధించిన మోసాల‌కు పాల్ప‌డిన‌ట్లుగా సోమ‌వారం ఉద‌య‌మే పోలీసుల‌కు అందిన‌ట్లుగా తెలుస్తోంది. దీంతో వెంట‌నే స్పందించిన అధికారులు పాస్ పోర్టు కార్యాల‌యంలో 2004 నాటి డాక్యుమెంట్లను టాస్క్ ఫోర్స్ సిబ్బంది త‌నిఖీ చేసిన‌ట్లుగా తెలిసింది. త‌ప్పు చేసిన‌ట్లుగా ప‌క్కా ఆధారాలు ల‌భించ‌టంతో జ‌గ్గారెడ్డిని ప‌టాన్ చెర్వు స‌మీపంలోని ముత్తంగి చౌర‌స్తా వ‌ద్ద అదుపులోకి తీసుకొని ఆయ‌న్ను అరెస్ట్ చేసిన‌ట్లుగా జ‌గ్గారెడ్డికి చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. ముగ్గురు గుజ‌రాతీ వ్య‌క్తుల‌ను అమెరికాకు తీసుకెళ్లిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఈ రోజు (మంగ‌ళ‌వారం) ఉద‌యం సికింద్రాబాద్ కోర్టు ముందుకు తీసుకెళ‌తార‌ని చెబుతున్నారు. జ‌గ్గారెడ్డి నుంచి మ‌రింత సమాచారం రాబ‌ట్టేందుకు వీలుగా వారం రోజులు క‌స్ట‌డీకి తీసుకోనున్న‌ట్లుగా తెలుస్తోంది.