Begin typing your search above and press return to search.

మరీ ఇంత అధికారమదమా కేసీఆర్..?

By:  Tupaki Desk   |   5 Sept 2015 11:48 PM IST
మరీ ఇంత అధికారమదమా కేసీఆర్..?
X
కాంగ్రెస్ ఎమ్మెల్యేపై తెలంగాణ అధికారపక్ష ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చేయి చేసుకున్న ఘటన తెలంగాణ కాంగ్రెస్ నేతల్ని రగిలిపోయేలా చేసింది. జెడ్పీ సమావేశంలో చేయి చేసుకున్న తీరుపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. గువ్వల బాలరాజు దాడిని.. రౌడీయిజంగా పోలుస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. వెనువెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని.. ముఖ్యమంత్రి కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ వ్యవహారంపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత డీకే అరుణ తీవ్రస్థాయిలో స్పందించారు. తెలంగాణలో టీఆర్ఎస్ ఆరాచక పాలన చేస్తుందని.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు అధికార దురహంకారంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ విధానాల్ని తప్పు పడితే.. కక్ష సాధింపు చర్యలకు పాల్పడటమే కాదు.. రౌడీయిజాన్ని ప్రదర్శిస్తున్నారని.. మరీ ఇంత అధికారమదమా? అని ప్రశ్నిస్తున్నారు.

తమపై జరిగిన భౌతికదాడికి నిరసనగా ఆందోళన చేస్తుంటే.. దాన్ని విఫలం చేయటానికి పోలీసులు ప్రయత్నించారని మండిపడ్డ అరుణ.. బంద్ ను ఫెయిల్ చేయటానికి చాలానే కృషి చేశారన్నారు. ఎమ్మెల్యేల దాడులు.. దౌర్జన్యాల్ని ఇదే రీతిలో ప్రోత్సహిస్తే.. తీవ్ర పరిణామాలు చూడాల్సి ఉంటుందని హెచ్చరించిన డీకే అరుణ.. ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు.