Begin typing your search above and press return to search.

కైటెక్స్ : తెలంగాణకు వచ్చిన దానిని మీరెలా తీసుకెళ్తారు .. కేంద్రమంత్రి పై మాణిక్కం ఠాగూర్ ఫైర్ !

By:  Tupaki Desk   |   13 July 2021 7:58 AM GMT
కైటెక్స్  : తెలంగాణకు వచ్చిన దానిని మీరెలా తీసుకెళ్తారు .. కేంద్రమంత్రి పై మాణిక్కం ఠాగూర్ ఫైర్ !
X
కేరళ కేంద్రంగా కార్యకలపాలు కొనసాగిస్తున్న ప్రముఖ టెక్స్‌ టైల్‌ సంస్థ కైటెక్స్‌ తాజాగా కొత్త ప్రాజెక్టును లాంచ్‌ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. మొత్తం రూ. 3500 కోట్ల అంచనాతో ప్రారంభించనున్న ఈ కొత్త ప్రాజెక్టు కోసం సొంతూరు అయిన కేరళను కాదనుకుని తెలంగాణవైపు మొగ్గు చూపిస్తుంది. తెలంగాణలో పెట్టబడులు పెట్టే విషయమై చర్చించేందుకు కైటెక్స్‌ గ్రూప్‌ చైర్మన్ సాయి జాకబ్‌ శుక్రవారం హైదరాబాద్‌ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ,తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన కైటెక్స్ సంస్థను కర్నాటకకు తీసుకెళ్లేందుకు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చేస్తున్న ప్రయత్నాలపై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌ చార్జ్ మాణిక్కం ఠాగూర్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

తెలంగాణకు వచ్చిన దానిని మీరెలా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తారని ప్రశ్నించారు. మీ శక్తిని ఉపయోగించి తెలంగాణకు నష్టం చేకూర్చొద్దని కేంద్ర మంత్రిని కోరారు. బీజేపీ ప్రభుత్వం ఎప్పుడూ తెలంగాణకు వ్యతిరేకంగా ఉంటుందని, ఈ విషయంలో కైటెక్స్ విషయంలో మరోసారి నిరూపితం అయిందని మాణిక్యం ఠాగూర్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చేసిన ట్వీట్‌ను మాణిక్యం ఠాగూర్ రీట్వీట్ చేస్తూ కామెంట్ చేశారు.

కైటెక్స్ వ్యవహారంలో కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వైఖరిపై టీఆర్ ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి కూడా తీవ్రంగా స్పందించారు. కేంద్ర మంత్రి చంద్రశేఖర్ తీరును తప్పుపట్టారు. కైటెక్స్‌ ను కర్నాటకకు ఆహ్వానించడం సరికాదన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన సంస్థలను కర్నాటకకు ఆహ్వానించడం ఏంటని ప్రశ్నించారు. కేంద్ర రాజీవ్ చంద్రశేఖర్ వైఖరి సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు కేరళలో ఉన్న కైటెక్స్ సంస్థను అక్కడి నుంచి తరలించి తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది ఆ సంస్థ యాజమాన్యం. దీనికి సానూకూలంగా స్పందించిన తెలంగాణ ప్రభుత్వం అందుకు అవసరమైన అన్ని వసతులను కల్పిస్తామని హామీ ఇచ్చింది. అయితే, కైటెక్స్ వ్యవహారంపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చేసిన ట్వీట్ తీవ్ర వివాదాస్పదం అయ్యింది. ‘కైటెక్స్‌కు చెందిన సాబు జాకబ్‌తో మాట్లాడాం. కర్ణాటకలో పెట్టుబడులు పెట్టేందుకు సీఎం అన్ని వసతులు కల్పిస్తారు’ అని కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు.

ఇక కైటెక్స్‌ కంపెనీ నేపథ్యానికి వస్తే.. ఈ సంస్థను కేరళలో 1992లో కేరళలో ఏర్పాటు చేశారు. కైటెక్స్‌కు కేరళ, తమిళనాడుతో పాటు అమెరికాలోనూ పరిశ్రమలున్నాయి. ఈ సంస్థ చిన్నారుల దుస్తులను తయారు చేసే రెండో అతిపెద్ద పరిశ్రమగా పేరు సంపాదించుకుంది. ఈ సంస్థ తమ ఉత్పత్తులను ప్రపంచంలోని 15 దేశాలకు ఎగుమతి చేస్తుండడం విశేషం. ఇదిలా ఉంటే కొత్త ప్రాజెక్టును సొంతూరు కేరళ కాకుండే తెలంగాణలో ఏర్పాటు చేయడానికి కేరళ ప్రభుత్వ తీరే కారణంగా తెలుస్తోంది. నిజానికి కొచ్చిన్‌ సమీపంలో ఈ పరిశ్రమను స్థాపించాలని కైటెక్స్‌ భావించింది.

ఇందులో భాగంగానే కేరళ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కూడా కుదుర్చుకుంది. అయితే.. ఇప్పటికే కేరళలో ఉన్న కైటెక్స్‌ గ్రూప్‌ కంపెనీలపై అధికారులు అదేపనిగా తనిఖీలు చేపడుతుండడంతో కైటెక్స్‌ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా కేరళలో పెట్టుబడులకు అనువైన పరిస్థితులు ఏ మాత్రం లేవని జాకబ్‌ ఆరోపించడం గమనార్హం. ఇక కైటెక్స్‌ పరిశ్రమను తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటకతో పాటు మొత్తం తొమ్మిది రాష్ట్రాల నుంచి విజ్ఞప్తులు వచ్చాయని జాకబ్‌ తెలిపారు. కైటెక్స్‌ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి సుముఖత వ్యక్తం చేయడం పట్ల తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్‌తో జరిగిన సమావేశానికి సంబంధించిన ఫొటోలను పోస్ట్‌ చేశారు.