Begin typing your search above and press return to search.

బడ్జెట్ లో ఫోకస్ కాలేదు కానీ కేసీఆర్ వరాల కోసం రూ.10వేల కోట్లు

By:  Tupaki Desk   |   8 Feb 2023 10:30 AM GMT
బడ్జెట్ లో ఫోకస్ కాలేదు కానీ కేసీఆర్ వరాల కోసం రూ.10వేల కోట్లు
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే మాటలా? ఆయన తీరు మిగిలిన ముఖ్యమంత్రులకు భిన్నంగా ఉంటుంది. తనను కలిసే అవకాశం ఆయన పెద్దగా ఇవ్వరు. ఆ మాటకు వస్తే.. ఆయన ఎవరిని కలవాలో.. ఎప్పుడు కలవాలో అన్న అంశాన్ని ఆయన మాత్రమే డిసైడ్ చేసుకుంటారు. అలాంటి పెద్దమనిషి.. ప్రజలను సైతం కలిసేందుకుఎందుకు ఆసక్తి చూపుతారు చెప్పండి? అయినా.. రాజకీయ నాయకుడికి నిత్యం ప్రజలతో మమేకం కావాల్సిన అవసరమేంది? ఎన్నికలో.. మరొకటో వచ్చినప్పుడు బయటకు రావటం.. ప్రజల మధ్యకు వెళ్లటం బాగుంటుంది కానీ.. నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు ప్రజలతో మమేకం కావటం లాంటివి కేసీఆర్ కు మా చెడ్డ చిరాకుగా అభివర్ణిస్తుంటారు.

అందుకే.. ఆయన క్రమపద్దతిలో మాత్రమే బయటకు రావటానికి ఇష్టపడతారు. అయితే.. ఆయనలో ఉన్న మేజిక్ ఏమంటే.. ఎప్పుడో ఆయనకు బుద్ది పుట్టినప్పుడు బయటకు వచ్చినా.. ఒకసారి బయటకు వచ్చిన తర్వాత ఆయన ప్రజలతో వ్యవహరించే తీరు.. తన వరకు వచ్చే సమస్యల విషయంలో చేతికి ఎముక లేకుండా వరాల్ని ఇచ్చేయటం కనిపిస్తుంటుంది. మరి.. ఆయన వరాలకు అవసరమైన నిధుల లెక్క ఉండాలి కదా? తాజాగా మంత్రి హరీశ్ రావు ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో దీనికి సంబంధించిన పద్దు కాస్త పెద్దగానే ఉన్నట్లు చెప్పాలి.

దాదాపు రూ.3లక్షల కోట్లకు దగ్గరగా ఉన్న తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (కచ్ఛితంగా చెప్పాలంటే రూ.2,90,396 కోట్లు) లో రూ.10వేల కోట్లకు పైనే ఒక పద్దు పెద్దగా ఫోకస్ కాలేదు. గత బడ్జెట్ (2022-23)లో ఇదే పద్దు కింద రూ.2వేల కోట్లు కేటాయిస్తే తాజా బడ్జెట్ లో మాత్రం ఏకంగా రూ.10,348 కోట్ల మొత్తాన్ని కేటాయించారు. ఇంత భారీగా పెరిగిన ఆ పద్దు ఏమిటి? దాని లెక్కేంటి? అన్న విషయంలోకి వెళితే.. ప్రత్యేక అభివృద్ధి నిధి లేదంటే ఎస్ డీఎఫ్ గా పేర్కొంటారు.

దీని లెక్కేమిటంటే.. ముఖ్యమంత్రి ఏదైనా నియోజకవర్గం కానీ మరే ప్రాంతానికి కానీ వెళ్లినప్పుడు అక్కడి స్థానిక సమస్యల పరిష్కారం కోసం కానీ.. స్థానికులు అడిగిన వరాల్ని అప్పటికప్పుడు తీర్చేందుకు వీలుగా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇస్తుంటారు.

మరి.. ఆ ఆదేశాలకు అవసరమైన నిధులు ఎక్కడ నుంచి వస్తాయి? అన్న ప్రశ్న ఉదయిస్తుంది. అలాంటి అవసరాల్ని తీర్చటానికి వీలుగా ప్రత్యేక అభివృద్ధి నిధిని ఏర్పాటు చేసి.. అందులో నిధుల్ని కేటాయిస్తారు. ముఖ్యమంత్రి విచక్షణ అధికారంతో చేసిన ఆదేశాల అమలుకు ఈ నిధుల నుంచి ఖర్చు చేస్తారు. అలాంటి నిధులను గత ఏడాది రూ.2వేల కోట్లు కేటాయిస్తే.. ఈ ఏడాది రూ.10వేల కోట్లకు పైనే కేటాయింపులు జరగటం చూస్తే.. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల వర్షాన్ని కురిపిస్తారని చెబుతున్నారు.

ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు రానుండటంతో సభలు.. సమావేశాల్లో భారీ ఎత్తున పాల్గొనాల్సి రావటం ఖాయం. అందుకు తగ్గట్లే.. భారీగా నిధుల కేటాయింపు చూస్తే.. రానున్న రోజుల్లో తాను అడుగు పెట్టిన ప్రాంతాల్లో వెనుకా ముందు చూసుకోకుండా హామీలు ఇచ్చేందుకు వీలుగా బడ్జెట్ కేటాయింపులుఉన్నాయని చెబుతున్నారు. అయితే.. ఈ భారీ మొత్తం పెద్దగా ఫోకస్ కాలేదు. ఏమైనా.. ముఖ్యమంత్రి వరాల కోసం కేటాయించిన ఈ కేటాయింపులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతగా మనసు దోచుకుంటారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.