Begin typing your search above and press return to search.

ధనిక రాష్ట్రంలో సీఎం సహాయ నిధిపై ఆంక్షలు

By:  Tupaki Desk   |   1 Aug 2015 10:40 AM IST
ధనిక రాష్ట్రంలో సీఎం సహాయ నిధిపై ఆంక్షలు
X
పేరుకు ధనిక రాష్ట్రం అంటూ పదే పదే చెప్పుకోవటం.. అందుకు భిన్నమైన పరిస్థితులు చోటు చేసుకోవటం ఎక్కడా ఉండదేమో. ఆపదలో ఉన్నప్పుడో.. అన్నీ దారులు మూసుకుపోయినప్పుడు.. సామాన్యులకు కనిపించే ఒకే ఒక్క దారి ముఖ్యమంత్రి సహాయ నిధి. పేద.. మధ్యతరగతి వారికి ఏదైనా ఆపద ముంచుకొచ్చినప్పుడు.. చేతుల్లో డబ్బుల్లేక దిక్కు తోచని వారికి.. ముఖ్యమంత్రి సహాయ నిధి వైపు కొండంత ఆశగా చూస్తారు.

అందుకు తగ్గట్లే ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా వ్యవహరించిన వారంతా పెద్ద మనసుతో తోచినంత సాయం చేస్తూ.. అపన్నులకు అభయ హస్తాన్ని అందిస్తుండటం తెలిసిందే. మరి.. కారణాలు బయటకు రాలేదు కానీ.. తెలంగాణ రాష్ట్ర సర్కారు ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించిన తాజాగా ఆంక్షలు విధించారు.

గడిచిన నాలుగు రోజులుగా (శుక్రవారం వరకు) ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సాయం అందించటం ఆపేశారు. దీంతో.. ఆరోగ్య శ్రీ కార్డులు లేని సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఏ దిక్కు లేని వారికి సదరు ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సాయం అందేది. అందుకు భిన్నంగా గత నాలుగు రోజులుగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెల్లింపులు నిలిపివేయటం చర్చనీయాంశంగా మారింది. ధనిక రాష్ట్రంలో ఇలాంటివేమిటో..?