Begin typing your search above and press return to search.

జగన్ మీద మండిపోతున్న కేసీయార్...?

By:  Tupaki Desk   |   4 Dec 2022 1:30 AM GMT
జగన్ మీద మండిపోతున్న కేసీయార్...?
X
ఇద్దరూ రెండు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఇద్దరూ అన్న దమ్ములుగా ఉండేవారు. ఇద్దరి మధ్యన ఏజ్ గ్యాప్ ఉంది. దాంతో పాటు ఒకరు జూనియర్ ఒకరు సీనియర్. పైగా ఒకరి విజయంలో మరొకరు సహాయం అందించారు అని ప్రచారంలో ఉంది. అలాగే ఒకరు బాగు మరొకరు కోరుకుంటారు అని అంతా అంటారు. అలాంటి ఆ ఇద్దరి మధ్యనే ఇపుడు తారస్థాయిలో విభేదాలు వచ్చాయా అంటే జరుగుతున్న ప్రచారం బట్టి చూస్తే అవును అనే వస్తోంది.

కేసీయార్ జగన్ ల మధ్య ఇపుడు రాజకీయం మంట పెడుతోంది అంటున్నారు. అసలే బీజేపీతో జగన్ సన్నిహితంగా ఉంటే కేసీయార్ ఎదురు వెళ్తున్నారు. దాని ఫలితాలను ఆయన గట్టిగా ఎదుర్కొంటున్నారు. అది చాలదు అన్నట్లుగా జగన్ చెల్లెలు షర్మిల తెలంగాణాలో పార్టీ పెట్టి టీయారెస్ ని గట్టిగా ఏకి పారేస్తోంది. పోనీ ఆమె మటుకు ఆమె రాజకీయం చేసుకుంటోంది అనుకున్నా అలా కాదు, ఫైర్ బ్రాండ్ మాదిరిగా మారి కేసీయార్ ఫ్యామిలీనే టార్గెట్ చేసుకుని విరుచుకుపడుతోంది.

అది కాస్తా తారస్థాయికి చేరి ఇపుడు షర్మిల అరెస్ట్ కావడం హైదరాబాద్ లో ఆమె కారులో ఉండగా క్రేన్ల సాయంతో తీసుకెళ్ళడం అది పెద్ద సంచలనంగా మారి జాతీయ స్థాయిలోనే టీయారెస్ సర్కార్ మీద తీవ్ర విమర్శలు వచ్చి పడ్డాయి. ఎనిమిదేళ్ల కేసీయార్ పాలనలో ఈ తరహా విమర్శలు ఎప్పుడూ లేవు. పైగా జాతీయ మీడియా షర్మిల అరెస్ట్ మీద స్పెషల్ డిబేట్స్ పెట్టి మరీ ఒక మహిళా నేత విషయంలో ఇలా చేస్తారా అంటూ రచ్చ రచ్చ చేసి పారేశారు.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే షర్మిలకు మద్దతుగా బీజేపీ అగ్ర నేతలు రంగంలోకి దిగడం, ఏకంగా తెలంగాణా గవర్నర్ తమిల్ సై ఆమెకు కోరిన వెంటనే అనుమతి ఇవ్వడం, ఆమె కూడా షర్మిల అరెస్ట్ మీద టీయారెస్ సర్కార్ దే తప్పు అన్నట్లుగా మాట్లాడడం ఇవన్నీ కలసి టీయారెస్ సర్కార్ కి కేసీయార్ కి ఆతి పెద్ద తలనొప్పులు తీసుకువచ్చాయి. దాంతో ఇపుడు ఆయన జగన్ మీద మండిపోతున్నారుట.

ఉరిమి ఉరిమి మంగళం మీద పడినట్లుగా జగన్ మీద ఎందుకు అంటే అక్కడే విషయం ఉంది అంటున్నారు. తనను అన్ని రకాలుగా ఇరికించి ఇబ్బంది పెడుతున్న బీజేపీ తో జగన్ సన్నిహితంగా ఉండడాన్నే కేసీయార్ అండ్ కో తట్టుకోలేకపోతోంది. ఇపుడు చెల్లెలు పార్టీ చెలగాటం, దానికి కాషాయ దళం సపోర్ట్ ఇవ్వన్నీ కలిపి చూసిన కేసీయార్ ఇదేమి లొల్లి అనుకుంటున్నారుట. దీనికంతటికీ జగన్ కారణమని కూడా ఆయన మండిపడినట్లు ప్రచారం సాగుతోంది.

ఇందులో నిజమెంత ఉందో తెలియదు కానీ అంతంత మాత్రంగా ఉన్న కేసీయార్ జగన్ సంబంధాలను ఇపుడు షర్మిల అరెస్ట్ వ్యవహారం ఆమెకు బీజేపీ నేతల మద్దతు వ్యవహారం చెడగొట్టేసింది అని అంటున్నారు. బీజేపీకి కొమ్ము కాస్తూ అక్కడ జగన్ ఉంటే ఇక్కడ ఆయన చెల్లెలు బీజేపీ సాయంతోనే జోరు చేస్తొందని, బలమైన టీయారెస్ ని ఢీ కొడుతోందని టీయారెస్ అగ్ర నాయకత్వం అనుమానిస్తోందిట.

ఈ మొత్తం ఎపిసోడ్ ని చూసినపుడు జగన్ మీద పూర్తి స్థాయిలో టీయారెస్ పెద్దలు ఆగ్రహంగా ఉందని అంటున్నారు. మరి నెమ్మదిగా పరిణామాలు అర్ధమై పూర్వం మాదిరిగా జగన్ కేసీయార్ ల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుందా లేక ఇదే తీరున దూకుడు చేస్తారా దీని వల్ల రాజకీయంగా ఏపీలో జగన్ కి ఎంత నష్టం ఏమిటి అన్నది కూడా అంతా చర్చించిస్తున్న విషయాలు.

మరి షర్మిల ఎంత దూకుడు చేస్తే అంతలా బీజేపేఎ మీద జగన్ మీద టీయారెస్ నాయకత్వం కోపం పెంచుకుంటుందని రానున్న రోజుల్లో పరిణామాలు ఏ మలుపు తీసుకుంటాయో కూడా ఊహించలేమని అంటున్నారు. మొత్తానికి చెల్లెమ్మ పార్టీ తెలంగాణాలో ఎంతవరకూ గ్రాఫ్ పెంచుకుందో తెలియదు కానీ ఏపీలో జగన్ సర్కార్ మీద కేసీయార్ అండ్ కో మూడవ కన్ను తెరిచేలా వారి కోపానికి గురి అయ్యేలా చేయడంతో సక్సెస్ అయిందని అంటున్నారుట. మరి ఈ ప్రచారంలో ఎంతవరకూ నిజముందో చూడాలి.