మనతో ఎవరూ పెట్టుకోకూడదు. తొందరపడి ఎవరైనా పెట్టుకుంటే.. అతగాడి అడ్రస్ గల్లంతు చేయాలన్నట్లుగా ఉంటుంది మోడీషాల వ్యూహం. ఇటీవల చోటు చేసుకున్నమహారాష్ట్ర ఎపిసోడ్ దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. కాంగ్రెస్ వికారాల్ని దశాబ్దాల తరబడి కడిగిపారేస్తూ.. ఆ పార్టీకి అసలుసిసలు ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ చెప్పుకునేది. విలువలతో కూడిన రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా తమను తాము అభివర్ణించుకునే కమలనాథుల పగ్గాలు మోడీషాల చేతిలో చిక్కుకున్నతర్వాత ఆ పార్టీ ఎలా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.
ఉత్తరాదిన తిరుగులేని బలాన్ని.. ఈశాన్య భారతంలోనే తమ సత్తా ఏమిటో చాటిన బీజేపీకి.. దక్షిణాదిన తామేమిటో చూపించాలన్న తపన ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. దేశంలోని ఏ ప్రాంతాన్ని టార్గెట్ చేసినా.. లక్ష్యాన్ని చేరుకునే తమకు.. సౌత్ మాత్రం కొరకరాని కొయ్యిలా మారటం కమలనాథులకు అస్సలు సహించలేని పరిస్థితి. ఇందుకు కారణాలు ఏమిటన్నది చూసినప్పుడు.. మిగిలిన లోపాలతో పాటు.. ఇంతకాలం తాము సరిగా ఫోకస్ చేయకపోవటం అనే విషయాన్ని గుర్తించినట్లు చెబుతారు.
ఇలాంటి సమయంలోనే.. మిత్రుడిగా ఉంటాడని భావించిన కేసీఆర్.. అందుకు భిన్నమైన స్టాండ్ తీసుకోవటంతో వారి పని మరింత సులువుగా మారినట్లుగా చెబుతున్నారు. కేసీఆర్ మిత్రుడిగా ఉంటే.. ఆ రాష్ట్రంలో పాగా వేయలేని పరిస్థితి. అదే.. ప్రత్యర్థిగా ఉంటే లెక్కలు తేల్చుకోవటం చాలా ఈజీ. అందుకే.. కేసీఆర్ తో కటీఫ్ అయి.. ఇప్పుడు ఆ పార్టీ నేతలతో విరుచుకుపడేందుకు కమలనాథులు అస్సలు కష్టపడటం లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు వేదికగా నిలిచిన హైదరాబాద్ లో.. ఆ సదస్సు సందర్భంగా తమకు ఎదురైన ఇబ్బందికర పరిస్థితి.. తెలంగాణ ప్రభుత్వం ఎదురైన చిక్కులతో మోడీషాల అహం దెబ్బ తిన్నదని చెబుతున్నారు.
ఈ కారణంతోనే కేసీఆర్ మీద పోరుకు సై అని చెప్పటమే కాదు.. రానున్న ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో తమ సత్తా చాటాలన్న పట్టుదలతో ఉన్నట్లు చెబుతున్నారు. మిగిలిన పార్టీ అధినేతలతో పోలిస్తే.. టీఆర్ఎస్ అధినేతగా వ్యవహరించే గులాబీ బాస్ వ్యవహారశైలి భిన్నంగా ఉంటుందని బీజేపీ అధినాయకత్వం భావిస్తున్నట్లు చెబుతారు. ఈ కారణంతో.. శత్రువు శత్రువు మిత్రుడన్న నానుడికి తగ్గట్లు.. కేసీఆర్ కు అస్సలు నచ్చని చంద్రబాబును తమతో జట్టు కట్టేలా చేసేందుకు వ్యూహ రచన చేస్తున్నారు. దీంతో.. ఏపీ ప్రభుత్వంలో కీలకభూమికతో పాటు.. తెలంగాణలో కేసీఆర్ ను ఎలా దెబ్బ తీయాలన్న వ్యూహానికి అవసరమైన మందీ మార్బలం సమకూరుతుందని భావిస్తున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో తన ఓటమికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కీలకంగా వ్యవహరించినట్లుగా చంద్రబాబు భావిస్తుంటారు.
2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసిన చంద్రబాబుకు రిటర్న్ గిప్టు ఇస్తానని ప్రకటించిన గులాబీ బాస్ కేసీఆర్.. తన మాటలకు తగ్గట్లే 2019లో ఏపీలో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబును ఓడించే విషయంలో ఎంత కీలకంగా వ్యవహరించారో తెలిసిందే.అంతేకాదు.. ఎక్కడ స్విచ్ వేస్తే.. ఎక్కడ బల్బు వెలుగుతుందో.. ఎక్కడ స్విచ్ వేస్తే.. మరెక్కడ బల్బు ఆగుతుందన్న విషయాల్ని గుర్తించిన కేసీఆర్.. ఆ ఎన్నికల్లో చంద్రబాబుకు ఎలాంటి షాకులు ఇచ్చారో అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు విషయంలో కేసీఆర్ ఏ రీతిలో వ్యవహరించారో.. వచ్చే ఎన్నికల్లో గులాబీ బాస్ విషయంలో చంద్రబాబు అలానే వ్యవహరించాలన్నది బీజేపీ అధినాయకత్వం ఆలోచనగా చెబుతున్నారు. అందులో భాగంగానే చంద్రబాబును వారు అస్త్రంగా మార్చి కేసీఆర్ మీద వదలాలన్న నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.