Begin typing your search above and press return to search.

కేసీఆర్ మీడియా సంస్థలపై కమలనాథులు కన్ను పడిందా?

By:  Tupaki Desk   |   24 April 2022 12:00 PM IST
కేసీఆర్ మీడియా సంస్థలపై కమలనాథులు కన్ను పడిందా?
X
రాజకీయ పార్టీలకు సొంత మీడియా సంస్థలు ఉండటం తెలుగు రాష్ట్రాలకు కొత్తేమో కానీ తమిళనాడులో ఆ తీరు మొదట్నించి ఉంది. ఈనాడు.. ఆంధ్రజ్యోతి సంస్థలు తెలుగుదేశం పార్టీకి మద్దుతు ఇస్తుంటాయన్న పేరుతో.. తమకంటూ మీడియా సంస్థ కావాలన్న ఉద్దేశంతో దివంగత మహానేత వైఎస్ ఆలోచనకు 'సాక్షి'గా మారింది. అయితే.. ఉభయ కమ్యునిస్టు పార్టీలకు మొదట్నించి వేర్వేరు మీడియా సంస్థలు ఉన్నప్పటికీ.. జన జీవితాల మీద పెద్దగా ప్రభావితం చేయటంలో అవేమీ పెద్దగా పని చేయలేదని చెప్పాలి.

తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన టీఆర్ఎస్.. తమకంటూ ఒక మీడియా సంస్థ ఉంటే.. తమ వాదాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లొచ్చన్న ఆలోచనతో నమస్తే తెలంగాణ దినపత్రికను.. తెలంగాణ టుడే అంటూ ఇంగ్లిషు దినపత్రికను.. టీ న్యూస్ చానల్ పేరుతో టీవీ చానల్ ను ఏర్పాటు చేయటం తెలిసిందే. అప్పటి నుంచి తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా తమ చేతిలో ఉన్న మీడియా సంస్థలను ఏ తీరులో వాడారన్న విషయం అందరికి తెలిసిందే.

ఇటీవల కాలం వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలకు చెందిన మీడియా సంస్థల తీరుపై బీజేపీ ఒక కన్నేసినట్లుగా చెబుతున్నారు. ఇంతకాలం వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకున్నది లేదు. అయితే.. ఇటీవలకాలంలో కేంద్రం వర్సెస్ రాష్ట్రం అన్నట్లుగా సాగుతున్న పోరుతో.. కేంద్రం తీరును తీవ్రస్థాయిలో తప్పు పడుతూ పెద్ద ఎత్తున వార్తా కథనాలు ప్రచురితమవుతున్నాయి. మొదట్లో వీటిని పెద్దగా పట్టించుకోకున్నా.. ఇటీవల కాలంలో బీజేపీ అధినాయకత్వం వరకు ఈ కథనాలు వెళ్లినట్లుగా చెబుతున్నారు.

మోడీ ఇమేజ్ ను దెబ్బ తీసేలా.. కేంద్రం అనుసరిస్తున్న విధానాల్ని అదే పనిగా తప్పు పడుతున్న వైఖరిపై కమలనాథులు సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయ వైరంతో చేతిలో ఉన్న మీడియా సంస్థలతో ఇష్టానుసారం వార్తల్ని.. వార్తాకథనాల్ని వండిస్తున్న తీరుపై తాజాగా బీజేపీకి చెందిన కీలక నేత ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేత కమ్ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఫైర్ అయ్యారు. ప్రధాని మోడీని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని బాధ్యతారాహిత్య వ్యాఖ్యలుగా ఆయన అభివర్ణించారు.

ఇప్పటివరకు ఓకే కానీ.. ఇకపై మాత్రం కేంద్రంపై విషం చిమ్ముతూ తప్పుడు రాతలు రాసినా.. ప్రసారం చేసినా ఉపేక్షించేది లేదని పలు పత్రికలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఇదంతా తెలంగాణ అధికారపక్షానికి చెందిన మీడియా సంస్థలను ఉద్దేశించే ఆయన హెచ్చరిక అన్న మాట వినిపిస్తోంది.

ఇంతకాలం తమను టార్గెట్ చేసిన వారి విషయంలో చూసీ చూడనట్లుగా వ్యవహరించి పెద్ద తప్పు చేశామన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చూస్తుంటే.. ఇంతకాలం నడిచినట్లుగా తమకు తోచిన విమర్శల్ని ఇష్టానుసారం అచ్చేయటానికి.. ప్రసారం చేయటం లాంటివి ఇకపై సాధ్యం కాదన్న మాట వినిపిస్తోంది.