Begin typing your search above and press return to search.

కేసీయార్ అంటే అంత భయమా...ఒక్క విమర్శ కూడా లేదేం బాబూ...?

By:  Tupaki Desk   |   30 March 2023 4:00 PM GMT
కేసీయార్ అంటే అంత భయమా...ఒక్క విమర్శ కూడా లేదేం బాబూ...?
X
కేసీయార్ అసలు పేరులో చంద్రుడు ఉన్నాడు. ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుకు అచ్చమైన శిష్యుడు. బాబు వ్యూహాలకు రెట్టింపు వ్యూహాలు ఉన్న బలమైన నాయకుడు. అందుకే మంత్రి పదవి ఇవ్వని టీడీపీని ఉమ్మడి ఏపీలో శాశ్వతంగా అధికారంలోకి రాకుండా చేసిన ఘనుడిగా కీర్తికెక్కారు.

కేసీయార్ టీయారెస్ నుంచి బీయారెస్ అధినేతగా ఎదిగారు.ఆయన చూపు ఏపీ మీద పడింది. అదే సమయంలో ఆయన రెండు సార్లు తెలంగాణాలో సీఎం గా పనిచేశారు. కేసీయార్ పాలన ఏమీ గొప్పగా లేదని విమర్శలు ఉన్నాయి. తెలంగాణాలో పెద్దగా బలం లేని బీజేపీ సైతం కేసీయార్ ని ఫుల్ గా టార్గెట్ చేస్తూ ఘాటైన విమర్శలు చేస్తోంది. టీడీపీలో బాబు శిష్యుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఇపుడు తెలంగాణా కాంగ్రెస్ ప్రెసిడెంట్.

ఆయన కేసీయార్ మీదనే తెల్లారి లేస్తే బాణాలు ఎక్కు పెడతారు. ఒక్క లెక్కన బీయారెస్ సర్కార్ పని తీరుని చీల్చి చెండాడుతారు. బీజేపీ నుంచి బండి సంజయ్ అయితే కేసీయార్ పేరు చెబితే ఒంటి కాలు మీద లేస్తారు. వీరంతా బాబు కంటే జూనియర్లు. ఇక కేసీయార్ సైతం బాబు వద్ద మంత్రిగా పనిచేసి ఉన్న నాయకుడు. ఉమ్మడి ఏపీలో చూస్తే బాబు కంటే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఎవరూ లేరు

అలాంటి బాబు తెలంగాణాలో టీడీపీని మళ్లీ పట్టాలెక్కించాలని చూస్తున్నారు. దాని కోసం శుభారంభంగా ఖమ్మం గుమ్మంలో మీటింగ్ పెట్టారు. జనాలు కుమ్మేసేలా వచ్చారు. అయితే ఆనాటి బాబు స్పీచ్ సైతం చప్పగా సాగింది. కేసీయార్ ని పల్లెత్తు మాట అనకుండా బాబు ఏవేవో మాట్లాడి ముగించారు. ఇపుడు రెండవ మీటింగ్ హైదరాబాద్ నడిబొడ్డున పెట్టారు. ఈసారికి తేడా ఏంటి అంటే ఏపీలో టీడీపీ మెల్లగా పుంజుకుంటోంది.

అదే టైం లో తెలంగాణాలో బీయారెస్ కళ తగ్గింది. ఈసారి ఎన్నికల్ల్లో హ్యాట్రిక్ విజయం ఎలా అని ఆ పార్టీ మధన పడుతున్న పరిస్థితి. ఫుల్ జోష్ లో చంద్రబాబు ఉన్నారు. ఆయన నుంచి సంచలన ప్రకటనలు ఉంటాయని ఆశించిన వారికి పూర్తి నిరాశనే బాబు మిగిల్చారు. తెలంగాణా గడ్డ మీద నుంచి ఏపీ సీఎం జగన్ని పట్టుకుని చెడా మడా విమర్శించారు. సందర్భం వేరు, ఉన్న ప్రాంతం వేరు, విషయం వేరు. కానీ చంద్రబాబు ఎంతసేపూ ఆవు కధ మాదిరిగా జగన్ని విమర్శలు చేస్తే తెలంగాణాలో అధికార పార్టీ నేతలకు ఎందుకు ఖాతరు ఉంటుంది.

అంతే కాదు తెలంగాణా సమాజానికి తెలుగుదేశం పార్టీగా బాబు ఇచ్చే సందేశం ఏంటి అన్నది కూడా అర్ధం కాని పరిస్థితి. తెలంగాణాలో అన్నీ నేనే చేశాను, అంతా నా వల్లే జరిగింది అనే పడక్కుర్చీ కబుర్లకు అంతటి భారీ సభ ఎందుకు అన్న ప్రశ్న ఎవరికైనా వస్తుంది. తెలంగాణాలో బీయారెస్ పాలన మీద వ్యతిరేకత చాలా ఉంది. ప్రభుత్వ విధానాల మీద చంద్రబాబు దండెత్తి ద్వజమెత్తి గట్టిగా నోరు చేసుకుంటే వచ్చే జోష్ వేరుగా ఉండేది.

కానీ కేసీయార్ మా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారు. అందువల్ల ఆయనకు ధన్యవాదాలు అంటే అక్కడ పసుపు జెండా ఎలా ఎగురుతుందో చంద్రబాబే చెప్పాలని అంటున్నారు. తెలంగాణా టీం బాగానే పనిచేస్తోంది అని బాబు కితాబు ఇస్తున్నారు. నిజమే కాసాని జ్ఞానేశ్వర్ వచ్చాక పార్టీకి కొంత కదలిక వచ్చింది. అయితే అది ఏ మాత్రం సరిపోతుంది. బాబు లాంటి నాయకుడు ఉమ్మడి ఏపీని పాలించిన మాజీ సీఎం వచ్చి గట్టిగా నోరు చేసుకుంటే బీయారెస్ విధానాలు తూర్పారా పడితేనే కదా తెలంగాణా జనం టీడీపీ వైపు చూసేది.

కానీ తెలంగాణాలో టీడీపీ అధికారంలోకి రావాలి అంటూ చంద్రబాబు ఆశీస్స్సులు దీవెనలు ఇస్తే సరిపోతుందా అన్నదే చర్చగా ఉంది. ఏది ఏమైనా చంద్రబాబు తెలంగాణాలో టీడీపీని విస్తరించాలనుకుంటున్న వేళ అసలు ప్రత్యర్ధిని వదిలేసి జగన్ మీద పడడం, ఆ మీదట సొంత డబ్బా కొట్టుకోవడంతో సభను ముగించేశారు అన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైతే ఒక విషయం అర్ధం అవుతోందని అంటున్నారు. బాబు మోడీని పొగుడుతారు, కేసీయార్ ని అభినందిస్తారు. ఆయన గట్టిగా నోరు చేసేది మాత్రం ఒక్క జగన్ మీదనే అంటున్నారు.

ఆ మాతం సౌభాగ్యానికి తెలంగాణాలో పార్టీ అనడం ఎందుకు, పైగా జాతీయ పార్టీ అని చెప్పుకోవడం ఎందుకు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. మరో వైపు చూస్తే బీయారెస్ పెట్టిన కేసీయార్ ఏపీకి తొందరలో వస్తారు. ఆయన చంద్రబాబుని విమర్శించకుండా ఊరుకుంటారా అన్న చర్చ కూదా వస్తోంది. కేసీయార్ విమర్శించాక అయినా బాబు ఆయన మీద ప్రతి విమర్శలు చేస్తారేమో చూదాలి.

ఏది ఏమైనా 2015 వరకూ కేసీయార్ మీద నిప్పులు చేరిన పాత బాబు ఇపుడు ఎక్కడా కనిపించడంలేదు అంటున్నారు. ఎనిమిదేళ్ళ నుంచి ఆయన కేసీయార్ బీయారెస్ ని టార్గెట్ చేయడానికి ఫుల్ స్టాప్ పెట్టేసుకున్నారు అని కామెంట్స్ వస్తున్నాయి. మరి కేసీయార్ అంటే భయమా లేక ఒకనాటి శిష్యుడని వాత్సల్యమా అన్నది బాబుకే తెలియాలి అని అంటున్నారు అంతా.