Begin typing your search above and press return to search.

అదీ.. కేసీఆర్ మేజిక్

By:  Tupaki Desk   |   5 Sept 2015 1:41 PM IST
అదీ.. కేసీఆర్ మేజిక్
X
అత్యున్నత స్థానాల్లో ఉండి కూడా అలాంటి భేషజం ఏమీ లేనట్లుగా కనిపిస్తూ.. మనసుల్ని దోచుకోవటం మామూలు విషయం కాదు. అలాంటి కనికట్టు తెలిసిన అతికొద్ది మంది అధినేతల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకరు. విపక్ష నేతలు వచ్చి తనను కలవటానికి అపాయింట్ మెంట్ ఇచ్చేందుకు సైతం ససేమిరా అనే కేసీఆర్.. అందుకు భిన్నమైన ధోరణిని ప్రదర్శిస్తుంటారు.

మామూలుగా అయితే.. విపక్ష నేతలు కలవటానికి వస్తే.. నో చెప్పే ముఖ్యమంత్రి కనిపించరు. కానీ.. కేసీఆర్ మాత్రం అందుకు భిన్నం. పలువురు విపక్ష నేతలు విడివిడిగా ఆయన అపాయింట్ మెంట్ అడిగితే.. బిజీగా ఉన్నారన్న సమాధానం చెప్పించే ఆయన.. విపక్ష నేతలంతా గంప గుత్తగా వచ్చినా.. గంటల తరబడి వెయిట్ చేయించి.. వారు తనను కలవకుండానే వెనక్కి పంపించే స్పెషాలిటీ కేసీఆర్ కే సాధ్యం.

ఇలా వ్యవహరించే ఆయన.. చోటా నేతల్ని.. సామాన్యుల్ని మాత్రం చాలా అప్యాయంగా పలుకరిస్తుంటారు. మరీ ముఖ్యంగా చాలామందిని వారి పేర్లతోనే పిలుస్తూ.. వారికి కొండంత సంతృప్తి పరుస్తుంటారు. మరో మూడు రోజుల్లో చైనా పర్యటనకు వెళుతున్న ఆయన.. విదేశీ పర్యటనకు ముందు తన ఫాం హౌస్ కి వెళ్లిన కేసీఆర్.. అక్కడ తనను కలిసేందుకు వచ్చిన ఎర్రవలి (మెదక్ జిల్లా జగదేవ్ పూర్ మండలంలోని గ్రామం) సర్పంచ్ ని చూసిన కేసీఆర్.. ‘‘ఏం బాలరాజు.. అంతా సెట్ రైట్ అయ్యిందా? పనులు ఎలా సాగుతున్నాయి?’’ అంటూ పలుకరించారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి.. తన లాంటి సర్పంచ్ భర్తను పేరు పెట్టి పిలవటం ఆ చిన్న నేతకు కొండంత సంతోషాన్ని కలిగించింది. ఎవరి మనసు దోచుకోవాలో.. ఎవరికి షాక్ ఇవ్వాలో కేసీఆర్ కు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదేమో.