Begin typing your search above and press return to search.

ఇప్పుడు కేసీఆర్.. 'సో హ్యాపీ' అట

By:  Tupaki Desk   |   21 Oct 2016 11:50 AM IST
ఇప్పుడు కేసీఆర్.. సో హ్యాపీ అట
X
సమయం చూసుకొని తమ అధిక్యతను.. అధిపత్యాన్ని తెలివిగా ప్రదర్శించుకోవటం కొందరు నేతల్లో కనిపిస్తుంది. అలాంటి వారిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుంటారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని సహజంగానే ఆయన విధేయులు తరచూ పొగిడేస్తుంటారు. అయితే.. కేసీఆర్ లో కనిపించే కోణం ఏమిటంటే.. అవసరానికి తగ్గట్లుగా తనను తానే పొగిడేసుకుంటారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. తనను తాను పొగిడేసుకున్నా.. ఎబ్బెట్టుగా లేకుండా ఉండటం కేసీఆర్ గొప్పతనంగా చెప్పాలి.

తాజాగా క్యాంపు కార్యాలయంలో పోచమ్మ ఆలయాన్ని పున:ప్రతిష్టించిన కార్యక్రమం తర్వాత సీఎంవో అధికారులతో.. ప్రజాప్రతినిధులతో కేసీఆర్ ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వం సాధించిన విజయాల్ని ఆయన ప్రస్తావిస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తానెంతో హ్యాపీగా ఉన్నట్లుగా చెప్పిన ఆయన.. అనుకున్న సమయానికి అనుకున్నట్లుగా కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేయగలిగామని.. ప్రజల వద్దకు ప్రభుత్వాన్ని తీసుకెళ్లినట్లుగా అభివర్ణించారు. గడిచిన రెండున్నరేళ్ల కాలంలో ప్రజలకు ఎన్నికల వేళలో ఇచ్చిన హామీలనే కాదు.. ఇవ్వని హామీలను కూడా పూర్తి చేసినట్లుగా తేల్చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మొత్తంగా తీర్చేసినట్లుగా ఆయన వ్యాఖ్యానించి.. టార్గెట్ పెట్టుకొని పని చేయటం మొదలు పెడితే.. అనుకున్న పని అనుకున్న సమయానికి పూర్తి అవుతుందని.. కొత్త జిల్లాల్ని దసరా రోజు ప్రారంభించాలని అనుకోవటంతో అనుకున్న సమయానికి పని పూర్తి అయినట్లుగా ఆయన వెల్లడించారు.

మిషన్ భగీరథ మొదటిదశను విజయవంతంగా పూర్తి చేశామని.. రానున్న రోజుల్లో ఇంటింటికీ తాగునీటి అందించే కార్యక్రమాన్ని కూడా టార్గెట్ పెట్టుకొని పూర్తి చేద్దామన్న కేసీఆర్.. హుస్సేన్ సాగర్ ప్రక్షాళన.. కొత్త సెక్రటేరియట్.. కళాభారతి.. లాంటి వాటిని కూడా పూర్తి చేయనున్నట్లుగా చెప్పారు. చూస్తుంటే.. ఫుల్ హ్యాపీ మూడ్ లో ఉన్న కేసీఆర్.. ఇటీవల కాలంలో చోటుచేసుకున్న విషయాలేవీ పట్టించుకున్నట్లుగా కనిపించట్లేదులా ఉంది. కొత్తజిల్లాల్లో తమ మండలాలు ప్రజలు కోరుకున్నట్లుగా లేవంటూ ఇద్దరు ఆత్మహత్య చేసుకోవటం లాంటి విషాద ఘటనలు కేసీఆర్ దృష్టికి వెళ్లినట్లుగా లేవు. సంతోషంతో ఉన్నప్పుడు.. విషాదాల గురించి మర్చిపోవటం.. వాటిని గుర్తించకపోవటం ఎప్పుడూ జరిగేదే. ఇదే కేసీఆర్ అధికారంలో కాకుండా.. ఉద్యమనేతగా ఉండి ఉంటేనా..?