Begin typing your search above and press return to search.

కేంద్రంపై పోరాటం... ఆవిర్భావం సంద‌ర్భంగా కేసీఆర్ కొత్త పిలుపు

By:  Tupaki Desk   |   2 Jun 2022 5:30 AM GMT
కేంద్రంపై పోరాటం... ఆవిర్భావం సంద‌ర్భంగా కేసీఆర్ కొత్త పిలుపు
X
కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్య‌మంత్రి , టీఆర్ఎస్ పార్టీ అధినేత‌ కేసీఆర్ మ‌రోమారు ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌భుత్వ ప‌రంగా ఏర్పాటు చేసిన వేడుక‌ల్లో రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించిన ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈ సంద‌ర్భంగా త‌మ ప్ర‌భుత్వ హ‌యాంలో తీసుకున్న ప‌లు నిర్ణ‌యాలు, ప్ర‌భుత్వ ప‌రంగా జ‌రిగిన అభివృద్ధి - సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను వివ‌రించారు.

ఇదే స‌మ‌యంలో కేంద్ర ప్ర‌భుత్వంపై సైతం ఆయ‌న ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల తెలంగాణ అనేక రకాలుగా నష్టపోయిందని కేసీఆర్ ఆక్షేపించారు.

కొత్త రాష్ట్రానికి అదనపు నిధులు ఇవ్వాలని అనేకసార్లు ప్రధానిని అడిగిన ఫలితం లేద‌ని తెలంగాణ సీఎం కేసీఆర్ మండిప‌డ్డారు. రాష్ట్రానికి రావాల్సిన న్యాయ పరమైన నిధులపై కేంద్రం కోత విధించిందని ఆరోపించారు. తెలంగాణ లో ఐటిఐఆర్ రాకుండా కేంద్ర అడ్డు పడింద‌ని విమ‌ర్శించారు.

బయ్యారం స్టీల్, కాజీపేట పేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలో తీరని అన్యాయం చేసింద‌ని మండిప‌డ్డారు. నియోజకవర్గాల పున‌ర్విభ‌జ‌న చేయాలని పునర్ వ్య‌వ‌స్తీకరణ చట్టంలో ఉన్నప్ప‌టికీ కావాలనే కాలయాపన చేస్తోందని మండిప‌డ్డారు. కేంద్రం వివక్ష వల్ల లోయర్ సీలేరు విద్యుత్ ప్రాజెక్టును కోల్పోయామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

విభజన చట్టం హామీలను నెరవేర్చడం లేద‌ని, నీతి ఆయోగ్ సిఫార్సులను కేంద్రం అమలు చేయడం లేద‌ని పేర్కొన్న తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త రాష్ట్రానికి అదనపు నిధులు ఇవ్వాలని కోరినా ఫలితం శూన్యం అని మండిప‌డ్డారు. రాష్ట్రాల అధికారాలను కేంద్రం హరిస్తోందని ఆరోపించారు.

రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్ లో అధికారాలను కేంద్రం పాటించడం లేదని మండిప‌డ్డారు. FRBM నిబంధనలు పాటించకుండా కేంద్రం ఇష్టానుసారంగా అప్పులు చేస్తోందని, రాష్ట్రాలపై విధిస్తున్న ఆర్థిక ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాన‌ని తెలిపారు. కరోనా సమయంలో రాష్ట్రాలను కేంద్రం ఆదుకోవడంలో వైఫల్యం చెందింద‌న్నారు.

ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం ఘోరంగా వైఫల్యం చెందింద‌ని కేసీఆర్‌ మండిప‌డ్డారు. రైతాంగ సమస్యలపై కేంద్ర మంత్రులు హేళనగా మాట్లాడారని పేర్కొన్న ఆయ‌న దేశంలో రైతులు బిక్షగాళ్ళు కాద‌ని, రైతులతో పెట్టుకోవద్దని మరోసారి కేంద్రాన్ని హెచ్చరిస్తున్నానని తెలిపారు. రాష్ట్రాలను బలహీన పరచాలని చూస్తే సహించేది లేద‌న్నారు. దేశం ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంద‌ని పేర్కొన్న కేసీఆర్ దేశంలో గుణాత్మక మార్పులు జరగాలని పేర్కొన్నారు. కులం, మతం రొంపులో కుమ్ములాడుకుంటున్నామ‌ని పేర్కొన్న కేసీఆర్ విద్వేష రాజకీయాల్లో చిక్కి దేశం విలవిలలాడుతోంద‌న్నారు. విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం మనందరి భాద్యత అని తెలిపారు.