Begin typing your search above and press return to search.

కేసీఆర్ కామెంట్ల మ‌ర్మం ఫ్రంట్ కోస‌మేనా?

By:  Tupaki Desk   |   10 March 2018 3:57 AM GMT
కేసీఆర్ కామెంట్ల మ‌ర్మం ఫ్రంట్ కోస‌మేనా?
X
దేశ రాజ‌కీయాల్లో గుణాత్మ‌క మార్పు రావాల‌ని ప్ర‌క‌టించి..అందుకు థ‌ర్డ్ ఫ్ర్టంట్ రూపంలో తానే ఓ ముంద‌డుగు వేస్తాన‌ని ప్ర‌క‌టించిన టీఆర్ఎస్ పార్టీ అధినేత‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈ క్ర‌మంలో త‌గు చ‌ర్య‌ల‌ను ప్ర‌ణాళిక‌బ‌ద్దంగా తీసుకుంటున్నారు. త‌న ఎజెండా అయిన దేశానికి దిశానిర్దేశం అనే సిద్ధాంతంలో భాగంగా కీల‌క స‌మావేశం నిర్వ‌హించారు. ప్రగతి భవన్‌లో పలువురు ప్రముఖులు, సీనియర్ అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ, క్రియ స్వచ్ఛంద సంస్థ సీఓవో బాలాజీ ఊట్ల, విశ్రాంత అధికారులు, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ... దేశాభివృద్ధికి అవసరమైన అజెండా రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.

అనేక రాష్ట్రాలు, విభిన్న వర్గాలు కలిగివున్న భారతదేశానికి అవసరమైన అభివృద్ధి ఎజెండా రూపొందాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ఇప్పుడున్న విధానాలు, పద్ధతులు, చట్టాలను సంపూర్ణంగా అధ్యయనం చేసి, అవసరమైన మార్పులు, సంస్కరణలు తెచ్చే విషయంపై వివిధ రంగాలకు చెందిన నిపుణులు, సీనియర్ అధికారులు మార్గనిర్దేశనం చేయాలని కోరారు. ఈ ప్రయత్నంలో దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన అన్ని వర్గాల వారు పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. దేశాభివృద్ధికి కావాల్సిన అజెండా రూపకల్పనపై చర్చించాలి. ఈ చర్చలో దేశంలోని అన్ని ప్రాంతాలు, వర్గాలకు చెందిన మేదావులు భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. సంస్కరణలు తెచ్చే అంశంపై నిపుణులతో చర్చించాల్సిన అవసరం ఉంది. దేశంలో ఇంకా ప్రజల ప్రాథమిక అవసరాలు తీరడం లేదు. దేశంలో ప్రజలందరికీ తాగు, సాగు నీరు, విద్యుత్ అందడం లేదు. మౌలిక సదుపాయాల కల్పన జరగడం లేదు. రాష్ర్టాల మధ్య జలవివాదాలు ఉన్నా... అవి పరిష్కారం కావడం లేదు. కేంద్ర - రాష్ర్టాల మధ్య సమస్యల పరిష్కారానికి ఏర్పాటైన కమిషన్ల, నిపుణుల కమిటీలు సూచించిన సంస్కరణలు అమలు కావడం లేదు. సమాఖ్య వ్యవస్థ స్పూర్తి పూర్తిస్థాయిలో ప్రతిబింబించడం లేదు.` అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

“దేశంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ర్ట ప్రభుత్వాలున్నాయి. ఏ శాఖ ఎవరి వద్ద ఉండాలనేది నిర్ణయం జరగాలి. ఉమ్మడి జాబితా అమలులో ఉండడం వల్ల ఒకేశాఖకు సంబంధించి వేర్వేరు పథకాలు, కార్యక్రమాలు అమలవుతున్నాయి. దీనివల్ల క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు సామాజిక పరిస్థితులున్నాయి. వాటికి అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించుకోవాల్సి ఉంది. ఈ విషయంలో రాష్ట్రాలకు స్వేచ్ఛ, అధికారం కావాలి” అని సీఎం కేసీఆర్ స్పష్టంగా వివరించారు.

సంక్షేమ, అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనలో అనేక మైలురాళ్లను రాష్ట్రప్రభుత్వం అధిగమించిందని కేసీఆర్ తెలిపారు. `రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. దేశంలోని వివిధ రాష్ర్టాల్లో వేర్వేరు సామాజిక పరిస్థితులున్నాయి. సామాజిక పరిస్థితులకు అనుగూణంగా రిజర్వేషన్లు కల్పించాలి. రిజర్వేషన్ల కల్పనలో రాష్ర్టాలకు స్వేచ్ఛ అధికారం కావాలి` అని సీఎం డిమాండ్ చేశారు. న్యాయ వ్యవస్థలో, పాలనా వ్యవస్థలో, శాసన వ్యవస్థలోనూ మార్పులు రావాలని ఆకాంక్షించారు.