Begin typing your search above and press return to search.

కేసీఆర్, సంజయ్ సార్లూ.. చేరికలు సరే.. ఆనక?

By:  Tupaki Desk   |   25 Oct 2022 11:05 AM GMT
కేసీఆర్, సంజయ్ సార్లూ.. చేరికలు సరే.. ఆనక?
X
మునుగోడు ఉప ఎన్నిక రాజకీయ పార్టీల్లో కాక రేపుతోంది. అందులోనూ తెలంగాణ అసెంబ్లీ సాధారణ ఎన్నికలు మరొక ఏడాది మాత్రమే ఉన్న నేపథ్యంలో వచ్చిన ఈ ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఇక గత ఎన్నికల్లో టీఆర్ఎస్ కోల్పోయిన అతి తక్కువ స్థానాల్లో ఒకటి అయిన.. కాంగ్రెస్ నుంచి గెలిచిన అభ్యర్థి రాజీనామా చేసి బీజేపీ తరఫున బరిలో దిగడంతో ఈ ఉప ఎన్నిక అన్ని పార్టీలకూ అత్యంత కీలకమైంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ, టీఆర్ఎస్ తమ శక్తివంచన లేకుండా పోరాడుతున్నాయి.

అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు

ఎక్కడో ఒకచోట అధికారంలో ఉండి.. మునుగోడులో ఓడితే ఏం జరుగుతుందో బీజేపీ, టీఆర్ఎస్ రెండింటికీ బాగా తెలుసు. అందుకే నాయకుల చేరికలపై ఈ రెండు పార్టీలూ కన్నేశాయి. మునుగోడు ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా ఉండే నేపథ్యంలో జంపింగ్ లను కూడా అదే కోణంలో చూడాలి. టీఆర్ఎస్ నుంచి గతంలో ఓసారి ఎమ్మెల్యేగా గెలిచి గత ఎన్నికల్లో టిక్కెట్ రాని నల్లాల ఓదేలును తిరిగి చేర్చుకోవడం ద్వారా గులాబీ పార్టీ జంపింగ్ ల ఖాతా తెరిచింది.

అటునుంచి చూస్తే బీజేపీ.. ఏకంగా భువనగిరి మాజీ ఎంపీ, మునుగోడు లో అత్యంత ప్రభావవంతమైన వర్గానికి చెందిన బూర నర్సయ్య గౌడ్ ను చేర్చుకుంది. ఇది టీఆర్ఎస్ కు పెద్ద దెబ్బే అనుకుంటుండగా.. శాసన మండలి మాజీ ఛైర్మన్, గతేడాది టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన స్వామిగౌడ్, ఆయనతో పాటు దాసోజు శ్రవణ్ లను టీఆర్ఎస్ మళ్లీ అక్కున చేర్చుకుంది. అటు చూస్తే కాంగ్రెస్ రెండు నెలల కిందటే తెలంగాణ ఇంటి పార్టీని విలీనం చేసుకుని.. ఆ పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ కు స్వాగతం పలికింది. ఇక బీజేపీ మరికొందరు నాయకులనూ టీఆర్ఎస్ నుంచి గుంజే ప్రయత్నం చేస్తున్నదని కథనాలు వస్తున్నక్రమంలో అనూహ్యంగా ఆ పార్టీకి టీఆర్ఎస్ షాకిచ్చింది. దీంతో కమలానికి కొంత పగ్గం వేసింది. కమలం పార్టీలో ప్రముఖులుగా ఉన్న మరికొందరూ టీఆర్ఎస్ లో చేరొచ్చనే కథనాల నేపథ్యంలో కాషాయ దళం అప్రమత్తమైంది.

వెళ్లారు సరే.. ప్రాధాన్యమేంటి?

టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి, బీజేపీలోంచి టీఆర్ఎస్ లోకి నాయకుల దూకుడు చర్చనీయాంశమైన నేపథ్యంలో.. వారికి భవిష్యత్లో దక్కే ప్రాధామ్యం ఏమిటనేది ప్రస్తావించాల్సి వస్తోంది. గతంలో పీఆర్పీ నుంచి టీఆర్ఎస్ ఆపై కాంగ్రెస్.. రెండు నెలల కిందట బీజేపీ.. ఇప్పుడు మళ్లీ టీఆర్ఎస్ లో చేరిన దాసోజు శ్రవణ్ సేవలను ఆ పార్టీ ఎలా ఉపయోగించుకుంటుందో చూడాలి. విద్యావంతుడు, వాగ్ధాటి, మేధావి అయిన శ్రవణ్ కు ప్రాంతీయ పార్టీల్లో ఒక స్థాయి వరకే ప్రాధాన్యం దక్కుతుంది. అంతకుమించి అంటే కష్టమే. నల్లా ఓదేలుకు ఆయన నియోజకవర్గం
చెన్నూరులో ఎమ్మెల్యే బాల్క సుమన్ ను కాదని టిక్కెట్ ఇవ్వడం కష్టమే. ఇక స్వామిగౌడ్ తొలినుంచి టీఆర్ఎస్, తెలంగాణ అనుకూలురై ఉండీ.. అనూహ్యంగా పార్టీ మారారు.

మళ్లీ సొంత గూటికి వచ్చిన ఆయనకు ఇప్పటికే కీలకంగా ఉన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను మించి ప్రాధాన్యం దక్కడం కష్టమే. ఇక హుజూరాబాద్ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ లో చేరిన మోత్కుపల్లి నర్సింలు పార్టీలో ఇప్పుడు ఏం బాధ్యతలు చూస్తున్నారనేది తెలియాల్సి ఉంది. మరోవైపు బీజేపీలో చూస్తే చేరికల కారణంగా ఎదుర్కొంటున్న రెండో ఎన్నిక ఇది. హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ గెలిచినప్పటికీ, ఆయన స్థాయికి తగిన పదవి పార్టీలో దక్కలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా, బీజేపీలో మరో ప్రముఖుడైన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుకూ పార్టీలో దక్కిన పదవీ బాధ్యతలు అంత చెప్పుకోదగ్గవిగా లేవనే వాదన ఉంది.

మరోవైపు బీజేపీలో తొలి నుంచీ ఉన్నవారికే ప్రాధాన్యం దక్కుతుంది. మధ్యలో వచ్చినవారిని అలానే చూస్తారు. ఏపీలో ఘనమైన చరిత్ర ఉన్న కుటుంబానికి చెందిన పురంధేశ్వరికి ఎనిమిదేళ్లలో ఒక్క పదవీ ఇవ్వలేదంటేనే బీజేపీలో ఎలాంటి పరిస్థితి ఉంటుందో తెలిసిపోతుంది. అందులోనూ తెలంగాణలో విజయశాంతి వంటి ఫైర్ బ్రాండ్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఎవరూ చెప్పలేరు. సరే, ఇటీవల పార్టీలో చేరిన భువనగిరి మాజీ ఎంపీ నర్సయ్య గౌడ్ ను వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి బరిలో దింపుతారో చూడాలి. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపు మీదనే రాష్ట్రంలో ఆ పార్టీ ప్రయాణం ఎలా ఉంటుందో తెలిసిపోనుంది.