Begin typing your search above and press return to search.

దిగ్భ్రాంతితో పాటు.. మన దగ్గర చర్యల మాటా చెబితే బాగుండేదిగా?

By:  Tupaki Desk   |   8 May 2020 12:15 PM IST
దిగ్భ్రాంతితో పాటు.. మన దగ్గర చర్యల మాటా చెబితే బాగుండేదిగా?
X
విన్నంతనే వణుకు పుట్టిస్తున్న కెమికల్ గ్యాస్ లీక్ ఉదంతం గురించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. రాష్ట్ర మంత్రి కేటీఆర్ తో పాటు పలువురు నేతలు తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఉదంతంలో మరణించిన వారికి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడితే.. మంత్రి కేటీఆర్ తనకు అలవాటైన ట్వీట్ చేసి.. తన స్పందన తెలియజేశారు.

అనుకోని రీతిలో ఒక దారుణం చోటు చేసుకున్నప్పుడు.. ప్రాంతాలకు అతీతంగా అందరూ స్పందిస్తుంటారు. దీన్ని కాదనలేం. ఇలాంటి ప్రకటన సమయంలోనే రాష్ట్ర ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చేలా కొన్ని అంశాల్ని ప్రస్తావిస్తే బాగుండేదన్న మాట వినిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో.. అందునా హైదరాబాద్ మహానగరంలో ఎన్నో రసాయనిక పరిశ్రమలు ఉన్నాయి. విశాఖ ఘటన లాంటిది చోటు చేసుకున్నంతనే.. మన దగ్గర వాటితో ఉన్న ముప్పు మాటేమిటన్న సందేహం ప్రజల్లో కలుగక మానదు.

అలాంటి దానిపై భరోసా ఇవ్వటంతో పాటు.. లాక్ డౌన్ నేపథ్యంలో బంద్ అయిన పరిశ్రమలు అన్ని.. కెమికల్స్ లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవటంతో పాటు.. పక్కా తనిఖీలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి సేఫ్టీ రిపోర్టు తమకు ఇవ్వాలని పరిశ్రమలకు నోటీసులు జారీ చేయటంతో పాటు.. కెమికల్ లీక్ కు ఉన్న అవకాశాలు ఏమిటన్న దానిపై నిపుణులతోకూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసి ఉంటే మరింత బాగుండేది.
పక్క రాష్ట్రంలో చోటు చేసుకున్న విషాదం పట్ల దిగ్భ్రాంతి ఒక్కటే సరిపోదు. అలాంటి దారుణం రాష్ట్రంలో చోటు చేసుకోకుండా ఉండేందుకు వీలుగా ప్రభుత్వం మరింత పక్కా ప్రణాళికను సిద్ధం చేస్తున్న వైనాన్ని ప్రజలకు తెలిసేలా ప్రకటన చేస్తే మరింత బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.