Begin typing your search above and press return to search.

పొగ బెట్టి బయటకు పంపే కేసీఆర్.. వేటు వేసే వరకు వెళ్లారేం?

By:  Tupaki Desk   |   10 April 2023 10:00 PM GMT
పొగ బెట్టి బయటకు పంపే కేసీఆర్.. వేటు వేసే వరకు వెళ్లారేం?
X
అలవాటు లేని పనులు చేయరు కొందరు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రం చేయాల్సి వస్తుంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అలాంటి పనే చేశారా? అంటే అవునని చెప్పాలి. ఇప్పటి బీఆర్ఎస్.. అప్పటి టీఆర్ఎస్ పెట్టిన నాటి నుంచి ఇప్పటివరకు చూస్తే.. పార్టీలో తనకు ఇబ్బందికరంగా మారిన నేతల్ని బయటకు పంపేందుకు రోటీన్ కు భిన్నంగా వ్యవహరిస్తుంటారు. ఎవరిదాకానో ఎందుకు? అలె నరేంద్రనే తీసుకుంటే.. అంతటి పెద్ద నాయకుడు సైతం చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో నోటి నుంచి మాట లేక.. మౌనంగా గులాబీ కారు దిగిపోయారే కానీ.. ఆయనపై వేటు వేసింది లేదు.

ఒక్క అలె నరేంద్ర మాత్రమే కాదు. ఎంతో మంది తోపు నాయకులు అనే వారు సైతం గులాబీ సారు తీర్థం తీసుకున్న తర్వాత తమ తీరు మార్చుకోవాల్సిందే. లేకుంటే.. వారి పని అంతే అన్న మాట వినిపిస్తుంది. పార్టీలోని ఏ నేతతో అయినా పొసగకుంటే.. పొగ పెట్టి ఉక్కిరిబిక్కిరి చేయటం.. ఊపిరి ఆడకుండా చేయటం.. తమకు తాముగా బయటకు వెళ్లేలా చేయటం కేసీఆర్ కు అలవాటుగా చెబుతారు. అలాంటి ఆయన.. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్యనేతల విషయంలో ఆయన వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఎందుకిలా చేశారు? అన్నదిప్పుడు ఆసక్తికర ప్రశ్నగా మారింది. పార్టీకి చెందిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని.. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇద్దరిపైనా వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. నిన్నటి రోజున (ఆదివారం) తమ అనుచరులతో కలిసి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన వీరిద్దరూ కేసీఆరర్ సర్కారుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. నిజానికి దాదాపు ఏడాదిగా పొంగులేటి తన బాస్ కేసీఆర్ మీద కోపంగా ఉన్నారు. తన ఆగ్రహాన్ని ఆయన ఎప్పుడూ దాచుకున్నది లేదు. ఎప్పటికప్పుడు తన కోపాన్ని బయటపెడుతూ ఉన్నా.. అసలేం జరగన్నట్లుగా వ్యవహరించిన కేసీఆర్ అండ్ కో ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా వేటు వేశారెందుకు? అన్నది ప్రశ్న.

టీఆర్ఎస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. పొంగులేటి.. జూపల్లి విషయంలో కేసీఆర్ గుర్రుగా ఉన్నారని.. అందులో భాగంగా వారిద్దరికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండటం.. వారిని ఇగ్నోర్ చేయటం లాంటివెన్నో చేసినా.. వారు గులాబీ కారును దిగలేదంటున్నారు. గత నేతలకు భిన్నంగా వారు.. పార్టీలోనే ఉండి అధినేతను ఇరుకున పడేలా చేయటం షురూ చేయటం కేసీఆర్ కు కొత్త అనుభవాన్ని పరిచయం చేశారని చెబుతున్నారు.

అయితే.. ఈ తీరు అంతకంతకూ ఎక్కువ కావటం.. ఇదే తీరులో వదిలేస్తే.. వారిని స్ఫూర్తిగా తీసుకొని మిగిలిన వారు సైతం ఇదే బాట పడితే.. పార్టీకి జరిగే నష్టం భారీగా ఉంటుందన్న ఆలోచనతోనే ఈ తరహా నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ గతంలో మాదిరి పరిమితం కాకుండా.. పరిధి పెరుగుతున్న వేళలో క్రమశిక్షణ చాలా ముఖ్యమని.. ఆ విషయంలో చూస్తూ ఊరుకుంటే రానున్న రోజుల్లో మరింత నష్టం వాటిల్లుతుందన్న ఉద్దేశంతోనే వేటు వేసే నిర్ణయాన్ని తీసుకున్నారని చెబుతున్నారు. తనకు అలవాటు లేని ఆటకు తెర తీసిన కేసీఆర్.. వేటు ప్రకంపనల్ని ఎలా డీల్ చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.