Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ చెప్పింది నిజమేనా ?

By:  Tupaki Desk   |   26 Oct 2021 7:54 AM GMT
కేసీఆర్‌ చెప్పింది నిజమేనా ?
X
టీఆర్ఎస్ ప్లీనరీ లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పై జోరుగా చర్చ జరుగుతోంది. ఇంతకీ కేసీఆర్ చెప్పిందేమంటే ఆంధ్రాలో పార్టీ పెట్టండి గెలిపించుకుంటామని విజ్ఞప్తులు వస్తున్నాయట. దళిత బంధు పథకం అమలు పై ఏపీ నుంచి కూడా వేలాది విజ్ఞప్తులు తనకు అందుతున్నాయని సీఎం చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు తమకు కూడా కావాలని ఏపీ నుంచి తనను అడుగుతున్నట్లు కేసీయార్ చెప్పటమే కాస్త ఆశ్చర్యంగా ఉంది.

తెలంగాణలో అమలవుతున్న పథకాలు ఏపీలో కూడా అమలు కావాలని తనను ఎవరు అడిగారో కేసీఆర్ చెప్పలేదు. అలాగే దళిత బంధు పథకం ఏపీలో కావాలని అడిగిన వారెవరో సీఎం చెప్పుంటే బాగుండేది. దళితబంధు పథకం అమలంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాతే అని అర్ధమవుతోంది. కానీ తనను అడిగిన వారెవరో మాత్రం కేసీఆర్ చెప్పలేదు. ఇక తెలంగాణలో అమలవుతున్న పథకాలు ఏపీలో కూడా అమలు చేయాలని ఎవరు ? ఎప్పుడు అడిగారు ? ఆ మాట కూడా చెప్పుంటే బాగుండేది.

దళిత బంధు పథకం వల్ల తొందరలో జరగబోయే హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికలో టీఆర్ఎస్ కు ఎంతవరకు లాభం జరుగుతుందో తెలీదు. కానీ దళిత బంధు పథకం మాత్రం అచ్చంగా ఎన్నికల్లో గెలవడం కోసం మాత్రమే తీసుకొచ్చిన పథకమని అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని ప్రతిపక్షాల నేతలు ఆరోపించటం కాదు స్వయంగా కేసీఆర్ అంగీకరించారు. పైగా పథకం అమలు పై నియోజకవర్గంలోని లబ్దిదారులే మండిపోతున్నారు. తమ ఖాతాల్లోకి డబ్బులు పడినట్లే పడి మళ్ళీ వెనక్కు పోతున్నట్లు లబ్ధిదారుల ఆరోపణలకు కేసీఆర్ ఇంతవరకు సమాధానం చెప్పలేదు.

ఇంకా విచిత్రం ఏమిటంటే 2018 ఎన్నికల్లో దళితులకు ఇచ్చిన హామీల్లో చాలావరకు అమలు కావడం లేదు. ఆ విషయాన్ని దళితులు, ప్రతిపక్షాలు ఎన్నిసార్లు అడిగినా కేసీఆర్ అసలు సమాధానమే చెప్పడంలేదు. దళితులకు 3 ఎకరాల భూమి పథకం ఏమైందంటే కేసీఆర్ నుండి సమాధానమే లేదు. దళిత బంధు ని రాష్ట్రమంతా ఎందుకు అమలు చేయడం లేదంటే సమాధానం చెప్పరు. నాలుగు రోజల క్రితమే హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పథకం అమలు తీరుకు నిరసనగా దళితులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో దళిత బంధు ను ఏపీలో కూడా అమలు చేయమని అడిగారంటే నమ్మకం కుదరటం లేదు.