Begin typing your search above and press return to search.

వామ్మో.. ఇన్నేసి విలువల పాఠాలు ఒకేసారి చెబితే ఎలా సారూ?

By:  Tupaki Desk   |   26 Aug 2022 10:30 AM GMT
వామ్మో.. ఇన్నేసి విలువల పాఠాలు ఒకేసారి చెబితే ఎలా సారూ?
X
తనకంటే తోపు లేదనే వేళ.. తనకు మించినోడు తగిలితే కలిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. చేతిలో చెదిరిపోని అధికారం.. సందర్భానికి అనుగుణంగా మాటల్ని తిప్పేసే నేర్పరితనం.. అవసరానికి తగిన సిద్ధాంతాల్ని వల్లె వేసే టాలెంట్.. మొత్తంగా మూర్తీభవించిన మంచితనం చెట్టుకు విస్తరించిన కొమ్మలా వ్యవహరిస్తున్న వేళ.. అంతకు మించిన పెద్ద కొమ్మ మీద పడిన వేళలో.. చిన్నకొమ్మకు చిరాకు తప్పదు. వీలైతే శక్తి మొత్తాన్ని ఒకచోటకు చేర్చి.. పెద్ద కొమ్మ పడగ నీడ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయటం తప్పేం కాదు. అయితే..ఆ క్రమంలో తాను కూడా తన స్థాయిలో చేయాల్సినవన్నీ చేసిన విషయాన్ని వదిలేసి.. అలాంటివేమీ ఎవరికి గుర్తు ఉండదన్నట్లుగా మాటలుచెప్పటంలోనే అసలు అభ్యంతరమంతా.

గడిచిన ఎనిమిదేళ్లలో ఎప్పుడూ కూడా ఎదురుకాని అనుభవాలు ఇప్పుడు ఎదురవుతున్న వేళ.. తెలంగాణ సీఎం కేసీఆర్ కోపం నశాళానికి ఎక్కుతోంది. తనకు మాత్రం గజకర్ణ గోకర్ణ విద్యలు అన్ని వచ్చినట్లుగా వ్యవహరిస్తూ.. తెలంగాణ వ్యాప్తంగా విస్తరించేసి.. అది సరిపోదన్నట్లుగా జాతీయ స్థాయిలోనూ తన సత్తా చాటాలని తపిస్తున్న గులాబీ బాస్ కు.. తన మాదిరే ఎదిగిన మోడీ తన తరహాలో కేంద్రంలో పట్టు సాధించేసి.. ఇక మిగిలింది రాష్ట్రాలే..వాటి సంగతి తేలుద్దామని డిసైడ్ అయిన వైనం నచ్చకపోవటంలో తప్పు లేదు.

తన అవసరం మోడీ సర్కారుకు ఉందన్న విషయాన్ని తెలివిగా చెబుతూ.. కేంద్రంలో స్నేహాన్ని ప్రదర్శిస్తూ.. రాష్ట్రంలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ.. ఇలాంటి డబుల్ గేమ్ లు ఆడే సత్తా ఉందనుకున్న కేసీఆర్ కు.. తనకు మించిన ఆటలు ఆడే సత్తా ఉందన్న విషయం అర్థమయ్యాక.. పెడబొబ్బలు రాక మానతాయా? కేంద్రంలో కుదురుకున్నాం.. రాష్ట్రాల్ని ఒక పట్టుపట్టేసి.. మొత్తం కాషాయ పార్టీగా మార్చేయాలన్న ఆలోచన కేసీఆర్ కు కషాయంగా మారటంలో ఆశ్చర్యం ఏముంటుంది?

ప్రధాని మోడీని తప్పు పట్టాలి? ఆయన చేతల్ని.. చేష్టల్ని ఉతికి ఆరేయాలి.. అని తపించటం తప్పేం కాదు.కానీ.. అందుకు వినిపించే వాదనలు బలంగా ఉండాలే తప్పించి.. ‘బండి’ మాటల్లా ఉండకూడదు కదా? అదేం సిత్రమో.. మామూలుగా అయితే చెలరేగిపోయే కేసీఆర్ మాటలు కత్తి మొన అంచు మాదిరి పదునుగా ఉంటాయి. తాజాగా మాత్రం ఆయన మాటలు.. ఆయన్ను వేలెత్తి చూపించేలా ఉండటం దేనికి నిదర్శనం?

చేసే తప్పులకు మూల్యం చెల్లించక తప్పదు. ఆ విషయాన్ని మర్చిపోయిన కేసీఆర్..దాన్ని గుర్తు తెచ్చుకుంటే సరి. అలాంటిదేమీ లేకుండా తన దారిన తాను చెప్పుకుంటూ పోతే.. చూసి నవ్వుకోవటమే ఉంటుందన్న విషయాన్ని ఆయన మర్చిపోకూడదు. తాజాగా కేంద్రంలోని మోడీ సర్కారు తీరుపై నిప్పులు చెరిగినట్లుగా ఫీల్ అవుతూ.. చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన్నే క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. అందుకు శాంపిల్ గా కొన్నివ్యాఖ్యల్ని చూస్తే.. విషయం ఇట్టే అర్థమైపోతుంది.

- ప్రజలు అవకాశమిస్తే గెలవాలి. ఆ విడత పని చేయాలి. లేని పక్షంలో ప్రతిపక్ష పాత్ర పోషించాలి. ప్రధానమంత్రే కుట్రలు పన్ని.. తొమ్మిది రాష్ట్రాల్లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూలగొడతామంటున్నారు. తమిళనాడులో స్టాలిన్.. బెంగాల్ లో మమతా బెనర్జీ గెలిస్తే ఆ ప్రభుత్వాలనూ కూలుస్తామంటున్నారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిస్తే రూ.25 కోట్లు ఇచ్చి ఒక్కొక్క ఎమ్మెల్యేను కొంటామంటున్నారు. ఇది ప్రజాస్వామ్యమా? అరాచకత్వమా? దీనికి సమాధానం చెప్పాలి. దీన్ని ఇలాగే భరిస్తూ మౌనం వహిస్తే.. మతపిచ్చి మంటలే వస్తాయి.
- నరేంద్ర మోడీ.. మీకు ప్రధాని పదవి చాలదా.. ఇంకా ఏం కావాలని ఆగమాగం చేస్తున్నారు. అంతకంతే పెద్ద పదవి ఏం లేదు కదా?
- ప్రజల మధ్య చీలికలు తెచ్చేవాళ్లు.. అప్రజాస్వామికంగా విపక్ష పార్టీల ప్రభుత్వాలను కూలగొట్టేవాళ్లను కచ్చితంగా దేశంలో స్తానం లేదని నిరూపించాలి. అందులో తెలంగాన సమాజం భాగస్వామ్యం కావాలి. ఇందుకు ప్రజల అండదండలతో నేనే జెండా ఎత్తుతా.
- నేను ముఖ్యమంత్రి అయినప్పుడే నరేంద్రమోడీ ప్రధానమంత్రి అయ్యారు. ఆయనంత గొప్పేడే అయితే తెలంగాణలో ఇస్తున్నట్లు దేశంలో 24 గంటలు కరెంటు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? కనీసం మంచినీళ్లు ఇచ్చే తెలివితేటలులేవా? వాళ్లు వచ్చి మనకు నీతులు చెప్పాలా? మనం విని మోసపోవాలా? ఇలాంటి ప్రధాని మనకు కావాలా?