Begin typing your search above and press return to search.

కాలి ముల్లును నోటితో తీస్తానన్న కేసీఆర్.. జగన్ చేసిన పని చేయగలరా?

By:  Tupaki Desk   |   24 Sept 2021 4:00 PM IST
కాలి ముల్లును నోటితో తీస్తానన్న కేసీఆర్.. జగన్ చేసిన పని చేయగలరా?
X
మాటలు చెప్పటం వేరు.. చేతల్లో చూపించటం వేరు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పే మాటలకు.. చేతలకు మధ్య అంతరం ఎంత ఉందన్న విషయం అందరికి తెలిసిందే. సమయానికి తగ్గట్లుగా మనసులు దోచే మాటలు చెప్పటంలో ఆయన ఎంత దిట్టో తెలిసిందే. కొద్ది కాలం క్రితం తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారి సమస్యలకు తాను బాధ్యత తీసుకుంటానని.. వారిని సెటిలర్లు అనటాన్ని ఆయన ఆక్షేపించి అందరిని విస్మయానికి గురి చేశారు. ఆయన మాటల ప్రభావమో.. ఆయన వైపు ఉంటే.. తమకు తదుపరి ఇబ్బందులు ఉండవని ఫీల్ అయ్యారో ఏమో కానీ.. సెటిలర్ల ఓట్లు టీఆర్ఎస్ ఖాతాకు వెళ్లటం ద్వారా.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ కు చావు తప్పి కన్ను లొట్ట పోయిన పరిస్థితి. వందకు పైనే సీట్లు ఖాయమని గర్జించిన దానికి.. ఎన్ని సీట్లు వచ్చాయో తెలిసిందే.

ఇదంతా ఎందుకంటే.. ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చి తెలంగాణలో స్థిరపడిన వారికి రాజకీయ అవకాశాల్ని ఇచ్చే విషయం తర్వాత.. వారిని ప్రోత్సహించే విషయంలోనూ సీఎం కేసీఆర్ ఎప్పుడూ అడుగు ముందుకు వేయలేదని చెబుతారు. తాజాగా తెలంగాణకు చెందిన పర్వతారోహకుడు అంగోతు తుకారంను ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలిశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన తుకారంను కలిసి.. అభినందించారు.

తుకారాం ఎవరెస్టు శిఖరంతో పాటు.. ఐదు ఖండాల్లోని అత్యున్నత శిఖరాలను అధిరోహించి తన సత్తా చాటారు. తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా తక్కెల్లపల్లి తండాకు చెందినప్పటికి.. సాటి తెలుగువాడన్న కోణంలో ఆయన్ను అభినందించారని చెప్పాలి. మరి.. ఇదే పద్దతిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు ఫాలో కారన్న ప్రశ్నను కొందరు ప్రశ్నిస్తున్నారు. కాలికి ముల్లు తగిలితే.. తన నోటితో తీస్తానని చెప్పే కేసీఆర్.. అంత చేయకున్నా.. ఏపీ సీఎం జగన్ మాదిరి.. ఏపీ మూలాలు ఉన్న వారు తెలంగాణలో ఉండి.. ఏదైనా సాధిస్తే వారిని ప్రోత్సహించేలా వ్యవహరించారా? అన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు.