Begin typing your search above and press return to search.

కేసీఆర్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వరి మంటలు

By:  Tupaki Desk   |   15 Sep 2021 3:56 AM GMT
కేసీఆర్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వరి మంటలు
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి నుంచి వచ్చిన 'వరి' మాట ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వ్యవసాయం పండుగ కాదు దండుగ అన్న చంద్రబాబుకు ఎంత డ్యామేజీ అవుతుందో.. వరి వేస్తే ఉరి వేసుకున్నట్లే అంటూ తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగానే కాదు.. కొత్త అలజడికి తెర తీసింది. వరి మీద మొదలైన విమర్శల మంటలు.. కేసీఆర్ సర్కారును ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వరి ధాన్యాన్ని కేంద్రం కొనేందుకు ససేమిరా అంటోందని.. ఇలాంటివేళలో.. వరి పంట వేయటం సరికాదని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించటం తెలిసిందే.

దీంతో.. ఈ వ్యాఖ్యలు రాజకీయ రగడకు తెర తీశాయి. ఆఖరి గింజ వరకు ధాన్యం కొంటామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇప్పుడు వరి వద్దని ఎలా అంటున్నారు? వరి పండించని పక్షంలో లక్షల కోట్ల రూపాయిలతో నిర్మించిన ప్రాజెక్టులు ఎందుకు? అని సూటిగా ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్. ఆ మాటకు వస్తే ఆయన ఒక్కరే కాదు.. వరి సాగు మీద కేసీఆర్ మాటలపై వివిధ రాజకీయ పక్షాలు తీవ్రంగా రియాక్టు అవుతున్నాయి.

వరి వేస్తే ఉరే అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో రాష్ట్రంలో ఐదుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని.. అవన్నీ సీఎం చేసిన హత్యలే అంటూ తీవ్రంగా మండిపడుతున్నారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ సారథి బండి సంజయ్. ఈ రగడ ఇలా సాగుతుంటే.. మరోవైపు మంత్రి కేటీఆర్ తన గద్వాల పర్యటనలో వరి సాగుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఉప్పుడు బియ్యాన్ని కొనేది లేదని కేంద్రం తెగేసి చెప్పిన నేపథ్యంలో వచ్చే యాసంగి నుంచి వరి పంట వేయటం అంటే రైతులు ఉరి వేసుకోవటమే.. ప్రత్యామ్నాయ పంటలు వేస్తేనే రైతులకు లాభమని చెప్పటం తెలిసిందే. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన భేటీలో కేంద్రం దొడ్డు బియ్యాన్ని కొనమని చెబుతోందని.. ఇందుకు రైతులు నిరసన తెలుపుతూనే.. ఆయిల్ పామ్.. పత్తి.. వేరుశనగ.. చీనీ తోటల వైపు మళ్లాలని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా వరి మీద నడుస్తున్న రచ్చకు రైతుల ఆందోళన తోడు కానుంది. వరి వేసుకోవద్దంటే ఎలా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.

మొదట్నించి అలవాటున్న వరిని వదిలేసి.. కొత్త తరహా పంటల్ని వేయమంటే.. మాటలు చెప్పినంత తేలి కాదని.. ప్రాక్టికల్ గా ఉంటే సమస్యల మీద ప్రభుత్వం ఏ తరహా చేయూతను ఇస్తుంది? అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ చెబుతున్నట్లుగా వరికి బదులుగా.. శనగలు.. వేరు శనగలు.. పెసర్లు.. మినుములు.. నువ్వులు.. ఆవాలు లాంటి పంటల్ని పెద్ద ఎత్తున సాగు చేస్తే.. మద్దతు ధర లభించే అంశం పైనా స్పష్టత లేకపోవటాన్ని తప్పు పడుతున్నారు.

వరి వద్దన్నప్పుడు ప్రత్యామ్నాయ పంటలు.. వాటి మద్దతు ధర.. సాగు చేసేందుకు అనుకూల అంశాల్ని ఏర్పాటు చేయాలి. ఉదాహరణకు కేంద్రం మద్దతు ప్రకటించని పంటలకు ఏపీ లాంటి కొన్ని రాష్ట్రాల్లో సొంతంగా ఆయా ప్రభుత్వాలు మద్దతు ధర ప్రకటిస్తున్నాయి. కానీ.. తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదని.. దీంతో వీటి సాగు కోసం రైతులు మొగ్గు చూపటం లేదంటున్నారు. మొత్తానికి వరి ఇష్యూ.. తెలంగాణ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తుందని చెప్పక తప్పదు.