Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు కుడివైపు ఎవరు? ఎడమ వైపు ఎవరు?

By:  Tupaki Desk   |   8 Sep 2019 11:51 AM GMT
కేసీఆర్ కు కుడివైపు ఎవరు?  ఎడమ వైపు ఎవరు?
X
కేసీఆర్ కు ఆత్మవిశ్వాసం ఎంతన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే ఉండదు. కానీ.. కాలం కలిసి రానప్పుడు ప్రతి పనిని ఆచితూచి చేయాలి. ఈ విషయం మీద కేసీఆర్ కు అవగాహన ఎక్కువే. దీనికి తగ్గట్లే.. తాజాగా జరిగిన తెలంగాణ మంత్రుల ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా వేలెత్తి చూపించే ఏ చిన్న అవకాశాన్ని ప్రత్యర్థులకు ఇవ్వలేదు కేసీఆర్. ప్రతి విషయంలోనూ ఆయన జాగ్రత్తగా ఉండటమే కాదు.. కాస్త తగ్గినట్లుగా కనిపించక మానదు.

తానేం చేయాలో అదే చేసే కేసీఆర్.. కొన్నిసార్లు మాత్రం కాలానికి విలువ ఇవ్వటం కనిపిస్తుంది. సుదీర్ఘంగా సాగిన ఉద్యమంలోనూ.. తనకు ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని సరిచేసుకోవటం కోసం అదే పనిగా మాట్లాడటానికి భిన్నంగా.. మౌనంగా ఉండేవారు. ఎక్కడున్నారో? ఏం చేస్తున్నారో? అన్నది కూడా తెలీనట్లుగా వ్యవహరించేవారు. కానీ.. తన టైం వచ్చేసిందన్న సంకేతం అందినంతనే.. అందిపుచ్చుకొని చెలరేగిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే అడవిలో సింహం వేట మాదిరి అని చెప్పొచ్చు. తనకు అనుకూలంతా పరిస్థితులు ఉండేంత వరకూ వెయిట్ చేయటం.. ఒక్కసారి రంగంలోకి దిగిన తర్వాత.. ప్రతికూల పరిస్థితుల్ని సైతం అనుకూలంగా మార్చేసుకోవటం కేసీఆర్ కు బాగా అలవాటైన పనే.

తాజాగా అలాంటి తీరునే ప్రదర్శించారు గులాబీ బాస్. కేబినెట్ విస్తరణలో భాగంగా ఆరుగురు మంత్రుల చేత ప్రమాణస్వీకారం చేయించిన కేసీఆర్.. ఆ తర్వాత గవర్నర్ తో కలిసి మంత్రివర్గమంతా కలిసి గ్రూప్ ఫోటో దిగే కార్యక్రమంలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. గడిచిన కొద్దికాలంగా హరీశ్ ను పక్కన పెట్టేశారని.. ప్రాధాన్యత ఇవ్వటం లేదన్నట్లుగా జరిగే ప్రచారానికి బ్రేకులు వేసేలా వ్యవహరించారు.

గ్రూపు ఫోటోలో తనకు కుడి వైపున మంత్రి శ్రీనివాసరెడ్డిని కూర్చొబెట్టుకున్న కేసీఆర్ కు పక్కన గవర్నర్ తమిళి సై కూర్చున్నారు. ఆమె తర్వాత ఉన్న కుర్చీలో హరీశ్ ను కూర్చోబెట్టారు. అంతే.. కేసీఆర్ కు కుడి వైపు శ్రీనివాసరెడ్డి..ఎడమవైపున హరీశ్ ను కూర్చోబెట్టారని చెప్పాలి. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. కేసీఆర్ కు కుడి వైపున మూడో స్థానంలో కేటీఆర్ కూర్చున్నారు. గులాబీ బాస్ కుడి ఎడమలలో కుడి వైపు కేటీఆర్ కు.. ఎడమ వైపు హరీశ్ ను కూర్చోబెట్టుకున్నారు. మహిళా మంత్రులు ఇద్దరిని ఎడమవైపు మధ్యలో కూర్చోబెట్టటం కనిపించింది.

గ్రూపు ఫోటో అనంతరం..తన మంత్రివర్గంలోని మంత్రులందరిని ఒక్కొక్కరిగా పరిచయం చేయటంతో పాటు.. వారి గురించి క్లుప్తంగా వివరించారు కేసీఆర్. ముఖ్యమంత్రి చెబుతున్న మాటల్ని గవర్నర్ తమిళిసై శ్రద్ధగా వింటూ.. రియాక్ట్ కావటం కనిపించింది.