Begin typing your search above and press return to search.

కింగ్ మేకర్లా.. తేలిపోతారా.? బీజేపీ ఆశావాదం..

By:  Tupaki Desk   |   25 Oct 2018 1:30 AM GMT
కింగ్ మేకర్లా.. తేలిపోతారా.? బీజేపీ ఆశావాదం..
X
మా పరుగుంతా మెజార్టీ కోసం కాదు.. కింగ్ మేకరవ్వడానికే అంటున్నారు బీజేపీ శ్రేణులు. తెలంగాణా ఎన్నికల్లో స్వతంత్రులుగానే ఎన్నికల బరిలోకి దిగారు. పార్టీ బలం అంతగా లేకపోయినా, అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలిగితే చాలు చక్రం తిప్పవచ్చని ఆలోచనలో ఉన్నారు కమలనాథులు.

గత ఎన్నికల్లో కేవలం 5 స్థానాలకే పరిమితమైంది బీజేపీ. అది కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచే. ఈ సారి కూడా అంతలా ప్రభావం చూపలేకపోతుంది. కనీసం కొన్ని చోట్ల పార్టీ జెండాలు కూడా కట్టేవారు లేరంటే అతిశయోక్తి కాదు. ఈ సంగతి రాష్ట్ర నేతలకు బోధపడినట్లు ఉంది. కనీసం 20 స్థానాల్లో గెలిస్తే తమకు అగ్రస్థానం లభిస్తుందని భావిస్తున్నారు.

తెలంగాణలో ఎన్నికల పోరు ముఖ్యంగా టీఆర్ ఎస్ - మహా కూటమి మధ్యనే సాగుతుంది. బీజేపీ ఒంటరిగానే బరిలో దిగి బలాబలాలు బేరీజు వేసుకుంటుంది. తప్పక గెలిచే స్థానాలుగా భావిస్తూ 38 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇటీవల పార్టీలో చేరిన స్వామి పరిపూర్ణానంద - టీఆర్ ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకను ఉపయోగించుకుంటూ ఓ 15 నుంచి 20 స్థానాలు గెలుపొందితే చాలు అని అంచనావేస్తోంది.

టీఆర్ ఎస్ - మహా కూటములలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవచ్చని బీజేపీ శ్రేణులు అంచనా వేస్తున్నారు. 50 నుంచి 55 వరకు వచ్చి ఆగిపోతే, తమ దగ్గరున్న ఎమ్మెల్యేలతో మద్దతు ఇచ్చి కీలకం కావాలన్నది ప్లాన్ అట. ఎక్కువగా టీఆర్ఎస్ కే మద్దతిచ్చే అవకాశాలు ఉన్నట్లు హింట్ ఇస్తున్నారు.

మరో పక్క ఎంఐఎం ఉండగా, బీజేపీకి ఎందుకు అవకాశం ఇస్తారనే ప్రశ్న టీఆర్ఎస్ నుంచి ఉదయస్తుంది. ఏది ఏమైనా తెలంగాణాలో హంగ్ రావడం తథ్యమని, మెజార్టీ లేకపోయినా ఆఫ్టర్ ఎలక్షన్ తామే కింగ్ లమని కలలుగంటున్న బీజేపీ నేతల ఆశలు నెరవేరుతాయో లేదో చూడాలి మరి...