Begin typing your search above and press return to search.

కేసీఆర్ పై తిట్ల వర్షం ..జగన్ పై ప్రశంసల వర్షం !

By:  Tupaki Desk   |   12 Jun 2020 11:52 AM GMT
కేసీఆర్ పై తిట్ల వర్షం ..జగన్ పై ప్రశంసల వర్షం !
X
తెలంగాణలో వైరస్ విజృంభణ రోజురోజుకి మరింతగా పెరిగిపోతుంది. దీనికి ముఖ్య కారణం రాష్ట్రంలో వైరస్ నిర్దారణ పరీక్షలు తక్కువ చేయడమే అని తెలంగాణ బీజేపీ కేసీఆర్ సర్కార్ పై విమర్శలు కురిపిస్తుంది. పొరుగు రాష్ట్రమైన ఏపీని చూసైనా నేర్చుకోండంటూ సీఎం కేసీఆర్‌ కు సూచించింది. పొరుగున ఉన్న ఏపీలో 4.87 లక్షల వైరస్ నిర్దారణ టెస్టులు చేస్తే.. తెలంగాణలో 24 వేల టెస్టులు కూడా చేయలేదని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఆంధ్రాలో ప్రతి పది లక్షల మందిలో 9256 మందికి కరోనా టెస్టులు చేయగా.. తెలంగాణలో కేవలం 628 మందికి మాత్రమే చేశారని ఆగ్రహం వ్యక్తం చేసారు.

పొరుగు రాష్ట్రంలో రికవరీ రేట్ 55 శాతం ఉంటే మన దగ్గర 44 శాతం మాత్రమేనని తెలిపింది. డెత్ రేట్ ఏపీలో 1.2 శాతం ఉంటే.. తెలంగాణలో 3.8 శాతం ఉందని బీజేపీ తెలిపింది. రాష్ట్రంలో వైరస్ టెస్టులు చేయడం కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలోని 9, ప్రయివేట్‌ కు చెందిన 16 ల్యాబులకు ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చిందని బీజేపీ తెలిపింది. ఈ 25 ల్యాబ్‌ ల్లో రోజుకు 15 వేల టెస్టులు చేసే అవకాశం ఉన్నప్పటికీ.. 500 మించి టెస్టులు చేయడం లేదని.. ఇది కేసీఆర్ సర్కారు నిర్లక్ష్యం అంటూ మండిపడింది.

జూన్ 6-8 తేదీల మధ్య మహారాష్ట్రలో 41 వేలకుపైగా టెస్టులు చేస్తే.. తమిళనాడులో 40 వేలకు పైగా టెస్టులు చేశారని.. కానీ తెలంగాణలో కేవలం 1870 టెస్టులు మాత్రమే చేశారని బీజేపీ ఆరోపించింది. వైరస్ కట్టడి విషయంలో కేసీఆర్ సర్కారు బాధ్యతారాహిత్యాన్ని ఖండిస్తున్నట్లు తెలంగాణ బీజేపీ ట్వీట్ చేసింది. రాష్ట్రంలో అంతా సవ్యంగానే ఉందని కేసీఆర్ సర్కారు బుకాయిస్తోందని.. మరి వైరస్ కేసులు, టెస్టులను కేవలం గాంధీ హాస్పిటల్‌కే ఎందుకు పరిమితం చేస్తున్నారని బీజేపీ ప్రశ్నించింది.