తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికారం సాధించాలని బీజేపీ పెద్ద కలలే కన్నది. అయితే తెలంగాణ పొరుగు రాష్ట్రం కర్ణాటకలో బీజేపీ ఘోర ఓటమితో తెలంగాణలోనూ పార్టీలో నిస్తేజం నెలకొంది. మరోవైపు ముఖ్య నేతల మధ్య విభేదాలతో పార్టీ క్యాడర్ కూడా సరైన దిశానిర్దేశం లేకుండా ఉందని అంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, బీజేపీ చేరికల కమిటీ అధ్యక్షుడు ఈటెల రాజేందర్ ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోందని టాక్.
బండి సంజయ్ ఒంటెద్దు పోకడలు పోతున్నారని, పార్టీ కార్యక్రమాల గురించి నియోజకవర్గ ఇంచార్జిలకు సైతం సమాచారం ఇవ్వడం లేదని పలువురు నేతలు ఆయనపై బీజేపీ కేంద్ర పెద్దలకు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ పెద్దలు జేపీ నడ్డా, అమిత్ షా.. బండి సంజయ్ ను ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించినట్టు సమాచారం.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నిలకు ఇంకా నాలుగు నెలల సమయం మాత్రమే ఉంది. అయితే ఇప్పటివరకు చాలా నియోజకవర్గాల్లో బీజేపీకి ఇంచార్జులు లేరు. కొన్ని జిల్లాల్లో క్షేత్ర స్థాయిలో అసలు ఏమాత్రం బలం లేదని అంటున్నారు.
మరోవైపు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంతో తెలంగాణలోనూ ఆ పార్టీ నేతలు తమ విభేదాలను వీడి కలిసికట్టుగా ముందుకు సాగుతున్నారు. తెలంగాణలోనూ అధికారం సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ సమిష్టిగా ముందుకు కదులుతోంది.
ఈ నేపథ్యంలో బీజేపీ బలపడాలంటే బండి సంజయ్ ను పార్టీ అధ్యక్షుడిగా మార్చాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఆయనను అధ్యక్ష పదవి నుంచి తప్పించి అందరినీ కలుపుకుపోయే నేతకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని నేతలు కోరుతున్నారు.
మరోవైపు బీజేపీ చేరికల కమిటీ అధ్యక్షుడిగా ఉన్న ఈటెల రాజేందర్ ఢిల్లీకి పయనమవుతుండటం ఆసక్తి రేపుతోంది. ఢిల్లీకి వెళ్తున్న ఈటెల.. అక్కడ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తెలంగాణ వ్యవహారాల ఇంచార్జిలతో సమావేశమవుతారని తెలుస్తోంది. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ కు పెద్ద పదవి లభించవచ్చని రాజకీయ వర్గాల్లో, మీడియా వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
అందులోనూ ఈటెల తనంతట తానుగా కాకుండా అధిష్టానం ఢిల్లీకి రమ్మని పిలవడంతోనే ఢిల్లీకి వెళ్తున్నారు. ఈటెల రాజేందర్ ను ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ గా నియమించవచ్చని టాక్ నడుస్తోంది. అలాగే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్న డీకే అరుణకు కూడా కీలక పదవి లభించే అవకాశం ఉందని సమాచారం.
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తీరుతో రాష్ట్రంలోని బీజేపీలో రెండు వర్గాలు విడిపోయిందని అధిష్టానం గుర్తించిందని తెలుస్తోంది. త్వరలో ఎన్నికలు జరుగనున్న క్రమంలో ఇది పార్టీకి చేటు తెస్తుందని ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. దీంతో గ్రూపులను రూపుమాపి అందరు పార్టీ అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలని నిర్దేశించనుందని టాక్.