Begin typing your search above and press return to search.

టీఆర్ఎస్ గెలిస్తే గొంతు కోసుకుంటానంటున్న బీజేపీ ఫైర్ బ్రాండ్

By:  Tupaki Desk   |   24 April 2022 11:00 AM IST
టీఆర్ఎస్ గెలిస్తే గొంతు కోసుకుంటానంటున్న బీజేపీ ఫైర్ బ్రాండ్
X
ఎన్నికల్లో గెలుపు మీద ధీమా ఉండటం తప్పేం కాదు. తనకు లేకున్నా.. ప్రజల్ని నమ్మించాలన్న రాజకీయ నేత ప్రయత్నాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ.. ఆ పేరుతో నోటికి వచ్చినట్లుగా మాట్లాడే తీరు మంచిది కాదు. శపధాలు చేయొచ్చు కానీ.. తన పేరు ప్రఖ్యాతుల్ని దెబ్బ తీసేలాంటి వాటి జోలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న రాజకీయం ఇవాల్టికి ఇవాల్టి మాట.. రేపటికి రేపటి మాటే. కానీ.. నోటి నుంచి వచ్చిన మాట నీళ్ల మూటగా నేతలు అనుకోవచ్చు కానీ.. ప్రజలు అలా అనుకోరన్న విషయాన్ని మర్చిపోకూడదు.

తెలంగాణ రాష్ట్ర బీజేపీలో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ తో పాటు.. ముఖ్యమంత్రి కేసీఆర్ ను.. ఆయన కుటుంబాన్ని తన మాటలతో ఏకిపారేసే ఎంపీ అర్వింద్ మిగిలిన నేతలకు కాస్త భిన్నమనే చెప్పాలి. ఆయన మాట సూటిగా తాకుతున్నట్లుగా ఉంటుంది. ఆయన ఏమైనా చెప్పాలనుకుంటే.. ఆ విషయాన్ని సుత్తి లేకుండా చెప్పేస్తుంటారు. ఆయన ఎవరినైనా టార్గెట్ చేస్తే చాటు.. వారి మాటలు ఎంత తీవ్రంగా ఉంటాయన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అలాంటి అర్వింద్ మాష్టారు.. తాజాగా చేసిన ఒక సవాలు విస్తుపోయేలా చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తే తాను గొంతు కోసుకుంటానని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అర్వింద్ ఉద్దేశంలో తెలంగాణలో టీఆర్ఎస్ ఓడే అవకాశం ఉందా? అన్న  అంశంపై ఆయన అంత నమ్మకంగా ఉన్నారా? అన్నది అసలు ప్రశ్న. టీఆర్ఎస్ నేతల దాష్టీకాలను భరించలేని రామాయంపేటకు చెందిన సంతోష్.. అతని తల్లి ఆత్మహత్య చేసుకోవటం తెలిసిందే. ఆ కుటుంబాన్ని పరామర్శించే క్రమంలో ఆయనీ ఘాటు సవాలు చేశారు.

వేధింపుల్ని భరించలేక ఉన్న ఊరును వదిలేసి.. కామారెడ్డికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నారంటే స్థానిక పోలీసులు.. అధికార పార్టీ నేతలపై వారికి అనుమానాలు ఉన్నాయన్నారు. ఇటీవల కాలంలో తెలంగాణలో బీజేపీ హవా పెరిగిందన్న మాట వినిపిస్తున్నా.. ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించే స్థాయికి ఇంకా ఎదగలేదన్న విషయాన్ని మర్చిపోకూడదు. అలాంటివేళలో.. ఇలాంటి శపథాలు అవసరమా? అన్నది అసలు ప్రశ్న. ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేయటం ద్వారా అర్వింద్ తన స్థాయిని తానే తగ్గించుకుంటున్నట్లుగా చెప్పక తప్పదు.