Begin typing your search above and press return to search.

కమలం లో ప్రక్షాళన తప్పదా ?

By:  Tupaki Desk   |   12 July 2023 10:30 AM GMT
కమలం లో ప్రక్షాళన తప్పదా ?
X
తెలంగాణా బీజేపీ లో తొందర లోనే ప్రక్షాళన జరగబోతోందట. ఇపుడున్న రాష్ట్ర కార్యవర్గం లో మెజారిటి మాజీ అద్యక్షుడు బండి సంజయ్ మద్దతుదారులే ఎక్కువ. బండి మద్దతుదారుల ను అలాగే పెట్టుకుని తాను పార్టీని నడపటం కష్టమని కొత్త అధ్యక్షుడు కిషన్ రెడ్డి డిసైడ్ అయ్యారట. తనకంటు కొత్త టీమును ఏర్పాటుచేసుకోవటానికి అధిష్టానం నుండి కిషన్ గ్రీన్ సిగ్నల్ కూడా అందుకున్నట్లు పార్టీవర్గాల టాక్. కాకపోతే నూటికి నూరుశాతం కొత్తవాళ్ళతో నింపటం సాధ్యంకాదు.

అందుకనే పాత-కొత్తల మేలు కలయికగా కార్యవర్గం ఉండబోతోందని సమాచారం. పనిలోపని గా రాష్ట్ర కార్యవర్గంతో పాటు జిల్లాల అధ్యక్షులతో పాటు కార్యవర్గాల ను కూడా మార్చాలని అనుకున్నారట. అమెరికా లో జరుగుతున్న తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) సభల కు వెళ్ళాలన్నది కిషన్ ఆలోచన. అమెరికా కు వెళితే వచ్చిన తర్వాత కసరత్తు పూర్తిచేసి ఒకసారి అధిష్టానంతో మాట్లాడి ఆ తర్వాత ప్రకటించే ఆలోచన లో ఉన్నారట. అమెరికా కు గనుక వెళ్ళకపోతే ప్రకటన కొంచెం ముందే ప్రకటన ఉంటుందని పార్టీవర్గాలు చెప్పాయి.

ఇక్కడ విషయం ఏమిటంటే అధ్యక్షుడిగా ఎవరున్నా, కార్యవర్గంలో ఎంతమందున్నా పెద్దగా తేడా ఉండదని అనుకుంటున్నారు. ఎందుకంటే అధికారం లోకి బీజేపీ వచ్చేయబోతోందనే మునుపటి జోష్ ఇపుడు కనబడటంలేదు. కనబడటం లేదు అనేకన్నా అవకాశాన్ని పార్టీయే జారవిడుకుంటున్నదా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. రాబోయే ఎన్నికల్లో అధికారం కోసం ఒకవైపు బీఆర్ఎస్ మరోవైపు కాంగ్రెస్ తీవ్రంగా పోటీపడుతున్నాయి. ఏ సర్వేలో చూసినా బీజేపీ మూడోస్ధానానికి పడిపోయిందనే తెలుస్తోంది.

మంచో చెడో బండి సంజయ్ పార్టీకి తెలంగాణా లో మంచి ఊపుతెచ్చారు. బండేమో దూకుడుగా వెళ్ళే వ్యక్తి. అదే కిషన్ అయితే సౌమ్యుడుగా పేరున్న నేత. ప్రత్యర్ధుల పై మరీ నాటుగానో లేకపోతే సినిమా భాషలో చెప్పినట్లుగా ఊరమాస్ గా డైలాగులు, పంచులు విసరలేరు. ప్రస్తుత రాజకీయాల్లో సౌమ్యంగా మాట్లాడితే చాలామందికి నచ్చటంలేదు. క్యాడర్ కు అసలే నచ్చదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ దెబ్బకు బీజేపీ గ్రాఫ్ బాగా పడిపోయినట్లు తెలుస్తోంది. స్కామ్ లో కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్టు చేయలేకపోవటమే బీజేపీకి పెద్ద మైనస్ అయిపోయింది. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అనే అభిప్రాయం జనాల్లోకి వెళ్ళిపోవటంతో పార్టీ మీద దెబ్బపడిపోయింది. అందుకనే అధ్యక్షుడి గా ఎవరున్నా ఒకటే.