Begin typing your search above and press return to search.

తెలంగాణ బీజేపీ మారాల్సిన‌ టైమొచ్చింది!

By:  Tupaki Desk   |   31 July 2021 2:30 PM GMT
తెలంగాణ బీజేపీ మారాల్సిన‌ టైమొచ్చింది!
X
బ‌ల‌మైన రాజ‌కీయ నాయ‌కుడిని ఎదుర్కోవాలంటే.. ధీటుగా త‌ల‌ప‌డాల్సిందే. ముఖ్య‌మంత్రిని ఢీకొట్టాలంటే.. దూకుడుగా వ్య‌వ‌హ‌రించాల్సిందే. మాట‌ల తూటాలు పేల్చాల్సిందే. అప్పుడే జ‌నాలు అల‌ర్ట్ అవుతారు. ఇంత వ‌ర‌కూ ఓకే దీన్ని ఎవ‌రూ కాద‌న‌లేరు. కానీ.. ఎంచుకునే టాపిక్ ఏంటీ అన్న‌దే కీల‌కం. ముఖ్య‌మంత్రిని విమ‌ర్శించ‌డానికి తీసుకుంటున్న స‌బ్జెక్ట్ ఏంటీ అన్న‌ది చూసుకోవాలి. ఈ విష‌యంలోనే బీజేపీ నేత‌లు విఫ‌ల‌మ‌వుతున్నార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

బండి సంజ‌య్ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు తీసుకున్న త‌ర్వాత ఆ పార్టీకి ఒక ఊపు వ‌చ్చింద‌న్న‌ది వాస్త‌వం. దుబ్బాక‌, జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల ఫ‌లితాలు కూడా తోడ‌య్యాయి. దీంతో.. దూకుడు పెంచిన బండి.. నేరుగా కేసీఆర్ ను ఢీకొట్ట‌డం మొద‌లు పెట్టారు. విధాన‌ప‌ర‌మైన విమ‌ర్శ‌లు దాటి, వ్య‌క్తిగ‌తంగా దాడిచేయ‌డం మొద‌లు పెట్టారు. సీఎం తాగుతాడ‌ని చెప్ప‌డం నుంచి ఇత‌ర‌త్రా వ్యాఖ్యానాలు కూడా చేశారు. మొద‌టిసారి ఈ వ్యాఖ్య‌లు చేసిన‌ప్పుడు ఒక‌విధ‌మైన రియాక్ష‌న్ జ‌నాల్లో క‌నిపించింది. కానీ.. రెండో సారి అదే మాట‌లు మాట్లాడితే? మూడోసారి కూడా అదే పాట పాడితే? ఆ విష‌యం పాత‌ప‌డిపోతుంది. పాత చింత‌కాయ తొక్కుగా మారిపోతుంది. జ‌నాలు లైట్ తీసుకుంటారు.

బండి సంజ‌య్ ఇదే విధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఆయ‌న ఎక్క‌డ మాట్లాడినా.. కేసీఆర్ వ్య‌క్తిగ‌త అంశాల‌నే, అది కూడా మాట్లాడిన మాట‌ల్నే మ‌ళ్లీ మ‌ళ్లీ వినిపిస్తున్నార‌ని అంటున్నారు జ‌నం. ‘‘రాత్రిపూట డెసిష‌న్స్ తీసుకుంటారు.. తెల్ల‌వారిన త‌ర్వాత అన్నీ మ‌రిచిపోతుంటారు’’ అనీ ఇదే త‌ర‌హా వ్యాఖ్య‌లు చేస్తున్నారు సంజ‌య్‌. గ‌డిచిన సంవ‌త్స‌ర కాలంలో.. బండి సంజ‌య్ రాజ‌కీయం కేసీఆర్ చుట్టూనే తిరుగుతోంద‌ని, విధాన‌ప‌ర‌మైన అంశాల జోలికి పెద్ద‌గా వెళ్ల‌డం లేద‌ని అంటున్నారు.

ఇటీవ‌ల కూడా.. ‘ద‌ళిత బంధు’ పథ‌కాన్ని విమ‌ర్శించే క్ర‌మంలో.. ఆ ప‌థ‌కం తీరు తెన్నులూ, లోటుపాట్లు, సాధ్యాసాధ్యాల‌క‌న్నా ఎక్కువ‌గా కేసీఆర్ మ‌ద్య‌సేవ‌నం గురించే కేర్ తీసుకున్నారు. కేసీఆర్ 90ఎం ఎల్ సీఎం అని అన్నారు. రాత్రిపూట పెగ్గు తాగుతూ నిర్ణ‌యాలు తీసుకుంటాడ‌ని అన్నారు. ప్ర‌తీ పెగ్గుకో నిర్ణ‌యం తీసుకుంటాడ‌ని, ఓ పది పెగ్గుల లిస్టు చెప్పుకొచ్చారు. చివ‌రి పెగ్గు తీసుకున్న అనంత‌రం అస‌లు తాను ఏమీ అన‌లేద‌ని, ఎలాంటి హామీలూ ఇవ్వ‌లేద‌ని అంటాడ‌ని చెప్పుకొచ్చారు బండి.

ఈ త‌ర‌హా రాజ‌కీయం స‌రైన‌ది కాద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇలాంటి మాట‌లు స‌భికుల‌ను న‌వ్వించ‌డానికి తాత్కాలికంగా ఉప‌యోగ‌ప‌డ‌తాయేమోగానీ.. సీరియ‌స్ గా ప్ర‌భుత్వంపై ఉద్య‌మించ‌డానికి ప‌నికి రావ‌ని అంటున్నారు. ఎంత సేప‌టికీ.. ‘‘ప్ర‌గ‌తి భ‌వ‌న్ మీద దాడిచేస్తాం. కేసీఆర్ తాగి నిర్ణ‌యాలు తీసుకుంటారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు మాదే’’ అనే మాటలే మాట్లాడుతున్నారని అంటున్నారు. ఏ స‌భ‌లో ఉప‌న్య‌సించినా.. ప్ర‌ధాన మాట‌లు ఇవే ఉంటున్నాయ‌ని అభిప్రాయ ప‌డుతున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కూ విధాన‌ప‌ర‌మైన విమ‌ర్శ‌లు చేసిన దాఖ‌లాలు చాలా త‌క్కువ అని అంటున్నారు. గులాబీ పార్టీ మొత్తం అవినీతిలో కూరుకుపోయింద‌ని చెప్పే బండి సంజ‌య్‌.. వాటిని నిరూపించేలా చేసిన ప్ర‌య‌త్నాలు ఏవీ క‌నిపించ‌ట్లేద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. కేవ‌లం ముఖ్య‌మంత్రిని, ఆయ‌న కుటుంబాన్ని టార్గెట్ చేయ‌డం వ‌ల్ల రాజ‌కీయంగా ఏ మేర‌కు ఉప‌యోగం ఉంటుంద‌న్న‌ది సందేహం. ఇవే రేపు ఓట్లు రాలుస్తాయా? అన్న ప్ర‌శ్న కూడా వ్య‌క్త‌మ‌వుతోంది.

అయితే.. వాస్త‌వానికి సీఎం కేసీఆర్ వ్య‌క్తిగ‌త అల‌వాట్ల గురించి తెలంగాణ జ‌నాల‌కు చాలా వ‌ర‌కు తెలుసు. ఎప్పుడో పాతప‌డిపోయిన విష‌యాన్ని ప‌ట్టుకుని వేళాడ‌డం వ‌ల్ల ఉప‌యోగం ఏమీ ఉండ‌ద‌ని అంటున్నారు. అంశాల వారీగా.. విధాన‌ప‌రంగా ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తేనే.. జ‌నాల్లో అస‌లైన వెయిట్ పెరుగుతుంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. ఇలా చేయ‌కుండా.. పాత ప‌ద్ధ‌తిని ఫాలో అయితే.. మేలు జ‌ర‌గ‌డం క‌న్నా.. న‌ష్టం ఎక్కువ జ‌రిగే అవ‌కాశం ఉంద‌నే అభిప్రాయం కూడా వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రి, బీజేపీ నేత‌లు ఇక‌నైనా ఈ విష‌యాన్ని గుర్తిస్తారో..?