Begin typing your search above and press return to search.

బెంగళూరులో తెలంగాణ భవన్

By:  Tupaki Desk   |   31 July 2018 12:08 PM IST
బెంగళూరులో తెలంగాణ భవన్
X
తెలంగాణ సీఎం కేసీఆర్ తో సన్నిహిత సంబంధాలను నెరుపుతున్న కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఆయనకు అనుకోని గిఫ్ట్ ను ఇచ్చాడు. కర్ణాటకలో ఉన్న తెలంగాణ స్థానికుల చిరకాల వాంఛను నెరవేర్చారు. కన్నడ రాష్ట్ర తెలంగాణ అసోసియేషన్ (కేఆర్టీఏ) బృందం చేసిన కృషి ఫలించింది. బెంగళూరులో తెలంగాణ భవన్ ఏర్పాటుకు ఎకరం స్థలం చూడటంతోపాటు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) సిద్ధం చేయాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆ నగర పరిధిలోని తహసీల్దార్లను ఆదేశించారు. ఈ నిర్ణయంపై కేఆర్టీఏ వ్యవస్థాపక అధ్యక్షుడు సందీప్ కుమార్ మక్తా హర్షం వ్యక్తం చేశారు.

కర్ణాటకలోని తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం.. ఆ రాష్ట్రంలో తెలంగాణ ఉనికిని తెలియజెప్పేందుకు కన్నడ రాష్ట్ర తెలంగాణ అసోసియేషన్(కేఆర్టీఏ) తెలంగాణ ఉద్యమ సమయం నుంచే పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ లను కలిసి తెలంగాణ భవన్ కోసం విన్నవించింది. జేడీఎస్ అధినేత దేవెగౌడ తెలంగాణ భవన్ నిర్మిస్తామని హామీ ఇచ్చి ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చారు. ఇప్పుడు కర్ణాటకలో జేడీఎస్ ప్రభుత్వం కొలువుదీరడంతో ఆ హామీని సీఎం కుమారస్వామి నెరవేర్చారు.

ఈ సందర్భంగా కన్నడ రాష్ట్ర తెలంగాణ అసోసియేషన్(కేఆర్టీఏ) అధ్యక్షుడు సందీప్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణకు, కర్ణాటకకు సంస్కృతి పరంగా 9వ శతాబ్ధం నుంచి అనేక అంశాల్లో సారూపత్య ఉంది. తెలంగాణలోని బోధన్ లో జన్మించి కన్నడ మహాకవిగా పేరొందిన పంపన ఎన్నో రచనలు చేసి పేరు ప్రఖ్యాతలు పొందాడన్నారు.. ఆయన పేరు మీదనే ‘పంపన తెలంగాణ భవన్’ పేరుతో ఈ భవనం నిర్మించనున్నామన్నారు.

ఇక నగరానికి వచ్చే తెలంగాణ వారి కోసం.. ఎలాంటి పరిచయం లేని వారి కోసం తాత్కాలిక వసతి ఏర్పాట్లు తెలంగాణ భవన్ లో చేస్తామని సందీప్ కుమార్ తెలిపారు. దీంతోపాటు లైబ్రరీ, టౌన్ హాల్ వంటివి సైతం ఏర్పాటు చేయడానికి ఆసక్తతో ఉన్నామన్నారు. బతుకమ్మ, బోనాలు , ఆవిర్భావ వేడుకలు చేసుకునేందుకు తగు రీతిలో ఈ భవనంలో ఏర్పాట్లు చేసుకుంటామని సందీప్ తెలిపారు