Begin typing your search above and press return to search.

తెలంగాణ కదనరంగమైంది..

By:  Tupaki Desk   |   10 Nov 2019 7:39 AM GMT
తెలంగాణ కదనరంగమైంది..
X
అప్పుడెప్పుడో తెలంగాణ ఉద్యమ వేళ కనిపించిన దృశ్యాలవీ.. తెలంగాణ కావాలని నరనరాన జీర్ణించుకున్న తెలంగాణ ప్రజలు చిన్నా పెద్దా, ముసలి ముతక అందరూ కలిసి సకల జనుల సమ్మెలో రోడ్డెక్కిన దృశ్యం ఇప్పుడు హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై మరోసారి కనిపించింది. కానీ ఇది ఒక సంస్థ భవిష్యత్ కోసం కార్మికులు చేస్తున్న పోరాటం.. దానికి విపక్షాలు, ప్రజాసంఘాలు ఇచ్చిన మద్దతు. ఆర్టీసీ కార్మికులు సమ్మెలో భాగంగా తలపెట్టిన ‘చలో ట్యాంక్ బండ్’ రక్తసిక్తమైంది.

*తెలంగాణ కదనరంగమైంది..
ఎవరు కనపడితే వారిని అరెస్ట్ చేయడమే.. రోడ్డు మీదకు వస్తే లాఠీచార్జీ.. కార్మికులు, నేతలు, ప్రజాసంఘాల అని తేడా లేదు.. పోలీసుల లాఠీలు విరిగాయి. ఆర్టీసీ కార్మికుల తలలు పగిలాయి. రోడ్డుపై వచ్చిన వారిని వచ్చినట్టు పోలీసులు తరిమికొట్టారు. మహిళలను కూడా చూడకుండా చితకబాదారు..ప్రతిగా రాళ్లతో పోలీసులపైకి నిరసనకారులు రువ్వారు. ఈ దాడి ప్రతిదాడిలో చాలా మందికి తీవ్రగాయాలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్, ట్యాంకప్ పై చేపట్టిన ‘చలో ట్యాంక్ బండ్’ రణరంగంగా మారింది. తెలంగాణ మరో కదనరంగాన్ని తలపించింది.

*ఛేధించిన కార్మికులు..
పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని నిర్బంధాలు.. అరెస్ట్ చేసినా చలో ట్యాంక్ బండ్ పైకి నిరసనకారులు చేరుకోవడం గమనార్హం. మూడంచెల భద్రతను సైతం దాడి ఉద్యమకారులు ట్యాంక్ పైకి వచ్చారు. ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ కు ట్యాంక్ బండ్ పై జెండా ఎగురవేసి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

*చీమల దండులా ఉద్యమకారుల గుంపు
తెలంగాణ ఉద్యమకారుల గుంపు ఎన్ని నిర్బంధాలు పెట్టినా హైదరాబాద్ చేరుకున్నారు. అర్ధరాత్రి నుంచే ఆధీనంలోకి తీసుకున్నా ఉద్యమకారులు తప్పించుకొని వచ్చారు. ఆర్టీసీ కార్మికులను అరెస్ట్ లు చేశారు. చీమలు పుట్టలో చీమల వలే వేలాది మంది ఆర్టీసీ కార్మికులతోపాటు సీపీఎం, సీపీఐ, బీజేపీ, టీజేఎస్, సీపీఐఎంల్ న్యూ డెమోక్రసీ నేతలు, కార్యకర్తలు ట్యాంక్ బండ్ కు వచ్చారు. ట్యాంక్ బండ్ చుట్టుపక్కల నుంచి గుంపులు గుంపులుగా పోలీసులు, ఇనుక కంచెలను ఛేధించుకొని ట్యాంక్ బండ్ కు చేరుకున్నారు. పోలీసులు లాఠీచార్జి చేశారు. లాఠీలతో దెబ్బలు తీశారు. కార్మికులు చాలా మంది తీవ్రగాయాలపాలయ్యారు. పోలీసులు వెంటనే వచ్చినవారిని వచ్చినట్టు పోలీస్ స్టేషన్ కు పంపించారు.

*నేతల అరెస్టులు... గృహ నిర్బంధాలు
చలో ట్యాంక్ బండ్ కు మద్దతిచ్చిన పలు పార్టీల ముఖ్యులు, ఇతర నేతలను పోలీసులు ముందస్తుగానే అరెస్ట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలువురిని గృహ నిర్బంధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖమైన నేతలందరినీ పోలీసులు ముందస్తు అరెస్ట్ లు, గృహ నిర్బంధాలు చేశారు. ఉస్మానియా విద్యార్థులను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి నిర్బంధించారు.

*అచ్చం మిలియన్ మార్చ్ లాగే..
తెలంగాణ ఉద్యమ సమయంలో మిలియన్ మార్చ్ లో ఉద్యమకారులు గుంపులు గుంపులుగా వచ్చినట్టే ఇక్కడా ట్యాంక్ బండ్ పైకి అదే వ్యూహంతో వచ్చారు. కట్టమైసమ్మ ఆలయంపై నుంచి ఒక్కసారిగా మహిళా కార్మికులు ట్యాంక్ బండ్ పైకి చేరుకొని నినాదాలు చేశారు. పోలీసులు వారిని విచక్షణారహితంగా చావకొట్టారు.

*రణరంగం..
మధ్యాహ్నం తర్వాత ట్యాంక్ బండ్ రణరంగంగా మారింది. పెద్ద ఎత్తున చీమల దండుగా నిరసనకారులు రావడం.. పోలీసుల లాఠీచార్జీలు, అరెస్ట్ లు, తల పగలడాలు, ఇతర గాయాలతో తెలంగాణ రాజధానిలోని ట్యాంక్ బండ్ రక్తసిక్తమైంది. తెలంగాణ వ్యాప్తంగా పోలీసుల నిర్బంధం, నిరసనకారులు ఉద్యమంతో తెలంగాణ అట్టుడుకింది.