Begin typing your search above and press return to search.

తెలంగాణను వరించిన మరో జాతీయ అవార్డు

By:  Tupaki Desk   |   29 Aug 2016 5:38 AM GMT
తెలంగాణను వరించిన మరో జాతీయ అవార్డు
X
దేశంలో కొత్తగా ఏర్పడిన ఒక రాష్ట్రం.. తాను ఏర్పాటైన రెండున్నరేళ్ల వ్యవధిలో జాతీయ స్థాయిలో గుర్తింపు లభించటం అంత చిన్న విషయం కాదు. అది కూడా ఒకట్రెండు సార్లు కాకుండా తరచూ కావటం ఒకవిశేషంగా చెప్పాలి. తాజాగా సీఎన్ బీసీ టీవీ 18 నిర్వహించే ఇండియా బిజినెస్ లీడర్స్ అవార్డు తాజాగా తెలంగాణ రాష్ట్రాన్ని వరించింది. ప్రతి ఏటా ఇచ్చే ఈ అవార్డు ఈసారి తెలంగాణను వరించింది.

గడిచిన పదకొండేళ్లుగా ఈ సీఎన్ ఎన్ బీసీ గ్రూపు ఇస్తున్న ఈ అవార్డును దేశ సమగ్రత.. నిబద్ధతకు అనుగుణంగా వ్యాపార దృక్పథంతో పాటు.. మార్కెటింగ్ నైపుణ్యాల్ని ప్రదర్శించిన రాష్ట్రానికి ఇస్తుంటారు. తనదైన పారిశ్రామిక పాలసీతో దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న తెలంగాణ సర్కారుకు ఈ అవార్డు లభించటం గమనార్హం.

ఈ అవార్డును ఈ నెల 30 (అంటే రేపు.. మంగళవారం)న ఢిల్లీలో అందజేయనున్నారు. ఈ అవార్డును అందుకోవటానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున రాష్ట్ర మంత్రి కేటీఆర్ హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ.. కేంద్రమంత్రులు ప్రకాశ్ జవదేకర్.. రవిశంకర్ ప్రసాద్.. స్మృతి ఇరానీ సహా పలువురు మంత్రులు హాజరు కానున్నారు. దేశంలోనే అత్యున్నత పారిశ్రామిక విధానాన్ని పాటిస్తుందన్న పేరును సొంతం చేసుకున్న తెలంగాణ రాష్ట్రానికి.. జాతీయస్థాయిలో గుర్తింపు లభించేలా పురస్కారం లభించటం కేసీఆర్ సర్కారు పనితీరుకు నిదర్శనంగా నిలుస్తుందనటంలో సందేహం లేదు.