Begin typing your search above and press return to search.

శాంతిభధ్రతల పరిరక్షణలో తెలంగాణ దేశానికే ఆదర్శం : సీఎం కేసీఆర్

By:  Tupaki Desk   |   8 Oct 2020 8:15 AM GMT
శాంతిభధ్రతల పరిరక్షణలో తెలంగాణ దేశానికే ఆదర్శం : సీఎం కేసీఆర్
X
దేశంలో దళితుల మీద దాడులు జరుగుతున్న వార్తలు వినడం శోచనీయమని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుస్థితి నుంచి సమాజం దూరం కావాలని కోరుకున్నారు. దళితుల మీద దాడులు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా ఎప్పటికప్పుడు అప్రమత్తతతో మెలగాలని రాష్ట్ర పోలీస్ అధికారులకు తెలిపారు. ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ జిల్లాలో 19ఏళ్ల దళిత బాలిక హత్యాచారంపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతోన్న సమయంలో సీఎం కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలకి ఇప్పుడు ప్రాధాన్యత ఏర్పడింది.

ఇందులో భాగంగా ఉన్నతాధికారుల దగ్గరనుంచి కిందిస్థాయి పోలీసు వరకు సమాజంలో ఒకరిగా భాగస్వాములు కావాలని, చిన్నా పెద్ద తేడా లేకుండా పౌరులందరికీ గౌరవాన్ని ఇస్తూ ఫ్రెండ్లీ పోలీసు స్ఫూర్తిని పెంచుకోవాలని తెలిపారు. ఆ క్రమంలో తమ దగ్గరికి రక్షణకోసం వచ్చిన అభాగ్యుల పట్ల మానవీయ కోణంలో మెలగాలని సీఎం హితవు పలికారు. అభివృద్ధి పథాన ముందుకు సాగుతున్న తెలంగాణ రాష్ట్రం, శాంతిభధ్రతల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా నిలిచిందని కేసీఆర్ అన్నారు. ఆ దిశగా పోలీసుల భాగస్వామ్యాన్ని అభినందించారు. తెలంగాణ ప్రభుత్వం మహిళల భధ్రతను ప్రాధాన్యతాంశంగా తీసుకుని పనిచేస్తున్నదని, పోలీసులు మహిళా సంరక్షణ కోసం మరింతగా శ్రమించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

తెలంగాణ ఏర్పాటు అనంతరం పోలీసులు సాధించిన ఘన విజయాల్లో గుడుంబా నిర్మూలన కూడా వుందని సీఎం కేసీఆర్ అన్నారు. ఇటీవలి కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో అక్కడక్కడ గుడుంబా తయారీ జరుగుతున్నట్టు సమాచారముందని, దాన్ని కూడా తక్షణమే అంతం చేయాలనీ తెలిపారు. తెలంగాణను గుడుంబా రహిత రాష్ట్రంగా మార్చిన ఎక్సైజు, సివిల్ పోలీసులు తిరిగి అదే స్ఫూర్తితో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

రాష్ట్ర పోలీసు శాఖలో కారుణ్య నియామకాలను చేపట్టడంలో ఆలస్యం తగదని, డ్యూటీలో వుంటూ చనిపోయిన ఉద్యోగి వారసులకు, నిబంధనల ప్రకారం కారుణ్య నియామకానికి అర్హత కలిగిన వారసులకు, తక్షణమే ఉద్యోగం ఇవ్వాలని, దీనిపై తక్షణ కార్యాచరణ చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇతర శాఖల్లో ఖాళీలుంటే పరిశీలించి వెయిటింగ్ లిస్టులో వున్న అభ్యర్థులకు ఉద్యోగాలు అందేలా చూడాలని డీజీపీ మహేందర్ రెడ్డికి సూచించారు. హైదరాబాద్ నగరంలో పది లక్షల సీసీ కెమెరాల ఏర్పాటు లక్ష్యంగా కార్యాచరణ వేగవంతం చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డికి సీఎం కేసీఆర్ సూచించారు. పోలీసు వ్యవస్థలో ఐటీ పాత్రను పెంచి , నేరాలను అరికట్టడంలొ సాంకేతిక వ్యవస్థలను ఉపయోగించుకోవాలన్నారు.