Begin typing your search above and press return to search.

తెలంగాణ‌లో మోగిన ఎన్నిక‌ల న‌గారా!

By:  Tupaki Desk   |   6 Oct 2018 12:15 PM GMT
తెలంగాణ‌లో మోగిన ఎన్నిక‌ల న‌గారా!
X
తెలంగాణలో ముంద‌స్తు ఎన్నిక‌ల షెడ్యూల్ పై నేడు ఎలక్షన్ కమిషన్ తీసుకోబోతున్న నిర్ణ‌యం పై స‌ర్వ‌త్రా ఉత్కంఠ ఏర్ప‌డిన సంగ‌తి తెలిసిందే. రాజస్థాన్ - మధ్యప్రదేశ్ - చత్తీస్ గఢ్ - మిజోరాం ల‌తో పాటు తెలంగాణ రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను నేడు ఈసీ వెల్లడించనున్నట్టు ఊహాగానాలు వినిపించాయి. అయితే, తెలంగాణలో ఓటర్ల జాబితా అవకతవకలపై హైకోర్టులో కేసు తీర్పు వెలువ‌డిన త‌ర్వాత తెలంగాణ షెడ్యూల్ వెల్ల‌డిస్తార‌ని పుకార్లు వచ్చాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా తెలంగాణలో ఎన్నిక‌ల‌కు కూడా ఈసీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. మొత్తం 5 రాష్ట్రాల ఎన్నిక‌ల షెడ్యూల్ ను ఈసీ వెల్ల‌డించింది. రాజస్థాన్ - మధ్యప్రదేశ్ - చత్తీస్ గఢ్ - మిజోరాం - తెలంగాణ‌ రాష్ట్రాలలో డిసెంబ‌రు 15 నాటికి ఎన్నిక‌ల ప్ర‌క్రియ పూర్త‌వుతుంద‌ని చీఫ్ ఎలక్ష‌న్ క‌మిష‌నర్ రావ‌త్ స్ప‌ష్టం చేశారు.

హైకోర్టులో తెలంగాణ ఓట‌ర్ల జాబితాపై కేసు నేప‌థ్యంలో తెలంగాణ ఎన్నిక‌ల షెడ్యూల్ విష‌యంలో కొద్దిగా గంద‌ర‌గోళం ఏర్ప‌డింది. దానికి రావత్ క్లారిటీ ఇచ్చి తెలంగాణ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల చేశారు. అయితే, తెలంగాణలో ఓటర్ల జాబితాపై కోర్టులో ఉన్న పెండింగ్ కేసుల‌పై రావ‌త్ క్లారిటీ ఇచ్చారు. ఆ కేసు ఓటర్ల జాబితాకు సంబంధించింది మాత్రమేన‌ని, ఓటర్ల జాబితాను సరిచేయడానికి తగినంత సమయం ఉందని రావ‌త్ అన్నారు. ఓటర్ల జాబితాకు సంబంధించి కోర్టుకు అన్ని వివరాలనూ నివేదిస్తామ‌ని తెలిపారు. ఈ నెల 12న ఓటర్ల జాబితాను ప్రకటించాలని తాము నిర్ణయించినట్టు రావత్ తెలిపారు.

తాజాగా రావత్ ప్రక‌ట‌న‌తో తెలంగాణలో ఎన్నిక‌ల న‌గారా అధికారికంగా మోగిన‌ట్ల‌యింది. తెలంగాణ‌ తో పాటు ఐదు రాష్ట్రాల్లో ఈసీ ఎన్నిక‌ల న‌గారా మోగించింది. రాజస్థాన్‌ - మధ్యప్రదేశ్‌ - ఛత్తీస్‌ గఢ్‌ - మిజోరాంలతో పాటే తెలంగాణలోనూ ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ ప్ర‌కారం 5 రాష్ట్రాల ఎన్నిక‌ల షెడ్యూల్ ను రావత్‌ విడుదల చేశారు. తెలంగాణలో నవంబర్‌ 12న ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు రావ‌త్ చెప్పారు. నామినేషన్ల తుది గడువు నవంబర్ 19 అని - ఉపసంహరణ గడువు నవంబర్ 22 అని వెల్ల‌డించారు. నవంబర్ 28న నామినేష‌న్ల‌ను ప‌రిశీలిస్తామ‌ని చెప్పారు. డిసెంబర్‌ 7న మొత్తం 119 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికల పోలింగ్‌ నిర్వహించనున్నట్టు రావ‌త్ వెల్లడించారు. డిసెంబర్‌ 11న ఫలితాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉందని చెప్పారు. రాజ‌స్థాన్ కు కూడా తెలంగాణ‌తో పాటు అవే తేదీల్లో ఎన్నిక‌లు నిర్వ‌హిస్తామ‌ని చెప్పారు. ఇక‌, ఛత్తీస్‌గఢ్ లో రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించ‌బోతున్నామ‌ని చెప్పారు. తొలి విడత పోలింగ్ నవంబర్ 12న, రెండో విడత పోలింగ్ న‌వంబర్ 20న జరుగుతుందని తెలిపారు. మ‌ధ్యప్రదేశ్ - మిజోరంల‌లో ఒకే విడత పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఈ రెండు రాష్ట్రాల్లో నవంబర్ 28న పోలింగ్ జరుగుతుంది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 11న ప్రకటిస్తారు.

మ‌రోవైపు, ఆంధ్రప్రదేశ్ లో ఉప ఎన్నికలు జ‌ర‌ప‌డం లేద‌ని రావత్ తేల్చిచెప్పారు. ఐదుగురు వైఎస్ ఆర్‌ సీపీ ఎంపీల రాజీనామాలపై ఆయన మాట్లాడారు. ఎంపీల రాజీనామాలను జూన్ 4న ఆమోదించార‌ని - జూన్ 3వ తేదీతో లోక్‌ సభ గడువు ముగుస్తుందని - ఎన్నికల నిర్వహణకు ఏడాది కంటే తక్కువ గడువు ఉన్నందున ఉప ఎన్నికలు ఉండవని రావత్ ప్రకటించారు.