Begin typing your search above and press return to search.

టీ అసెంబ్లీ ఎలా జరుగుతుందంటే...

By:  Tupaki Desk   |   22 Sep 2015 5:30 PM GMT
టీ అసెంబ్లీ ఎలా జరుగుతుందంటే...
X
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. నవ్యాంధ్ర తరహాలోనే లాంఛనంగా ఐదు రోజులపాటు అసెంబ్లీని నిర్వహించి చేతులు దులుపుకోవాలని ప్రభుత్వం భావిస్తుంటే.. కనీసం 15 రోజులు జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ వాద వివాదాల్లో ఎప్పట్లాగే ప్రభుత్వమే విజయం సాధిస్తుందని చెప్పడానికి ఎటువంటి ఆశ్చర్యం అవసరం లేదు.

బుధవారం ఉదయం ప్రారంభమైన సమావేశాలు మృతులకు నివాళి అర్పించి పది నిమిషాలకే వాయిదా పడతాయి. ఇక గురువారం మాత్రం సభ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత, శుక్రవారం బక్రీద్ వచ్చింది. శని, ఆదివారాలు సెలవులు. సోమవారం నిమజ్జనం సెలవు. సో.. మళ్లీ మంగళవారం వరకూ సభ సజావుగా సాగే అవకాశం లేదు.

ఒకవేళ సమావేశమైనా.. ప్రతిపక్షాలు వాయిదా తీర్మానాలు ఇస్తాయి. వాటిని స్పీకర్ తిరస్కరిస్తారని పలువురు శాసనసభ్యులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతిపక్షాలు రైతు ఆత్మహత్యలపై ఆందోళన చేస్తాయని, దానిపై మాట్లాడాలని పట్టుబడతాయని, చర్చకు డిమాండ్ చేస్తాయని, ప్రభుత్వం ఎప్పట్లాగే దానిని కొట్టిపారేస్తుందని, స్పీకర్ తిరస్కరిస్తారని వివరించారు. ప్రతిపక్షాలు ఆందోళన చేస్తాయని, ప్రభుత్వం చర్చకు చేపట్టినా.. తొలుత విపక్షాలు మాట్లాడడానికి ప్రయత్నిస్తాయని, వాటిలోనూ ప్రతిపక్షాల్లో ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే వ్యక్తులకే మాట్లాడడానికి అవకాశం ఇస్తారని వివరిస్తున్నాయి. ఇక ప్రభుత్వం ఆత్మహత్యల నివారణ దిశగా చర్యలు తీసుకోకుండా.. వాటిని ఎలా నిలుపు చేయాలనే అంశంపై చర్చ చేపట్టకుండా.. తెలుగుదేశం హయాంలో ఎన్ని ఆత్మహత్యలు జరిగాయి.. కాంగ్రెస్ హయాంలో ఎన్ని ఆత్మహత్యలు జరిగాయి.. ఆత్మహత్యలు ఎప్పుడు ప్రారంభం అయ్యాయి వంటి గణాంకాలను తెరపైకి తీసుకొస్తుందని, తద్వారా అసలు విషయాలను వదిలేసి ఒకరిపై మరొకరు ఎదురు దాడులు చేసుకుంటారని, ఈలోపులో అసెంబ్లీ సమావేశాలు ముగిసిపోతాయని పలువురు ఎమ్మెల్యేలు వివరిస్తున్నారు.