Begin typing your search above and press return to search.

మొద‌టి రోజే ర‌చ్చ అయిన తెలంగాణ అసెంబ్లీ

By:  Tupaki Desk   |   10 March 2017 10:56 AM GMT
మొద‌టి రోజే ర‌చ్చ అయిన తెలంగాణ అసెంబ్లీ
X
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజునే ఊహించ‌ని ప‌రిణామం చోటుచేసుకుంది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం అవాస్త‌వాల‌తో ఉంద‌ని పేర్కొంటూ ఆ ప్రసంగానికి నిరసనగా కాంగ్రెస్ సభ నుంచి వాకౌట్ చేసింది. అనంత‌రం ఆ పార్టీ ఎమ్మెల్యేలు జానారెడ్డి - ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం అవాస్తవాల సమాహారంగా ఉందని విమర్శించారు. ప్ర‌భుత్వం రాసి ఇచ్చిందే గ‌వ‌ర్న‌ర్ చ‌దివి వినిపించారే త‌ప్ప కొత్త అంశాలేవీ లేవ‌న్నారు. పైగా కీల‌క అంశాల‌ను ప‌క్క‌న పెట్టార‌ని ఆరోపించారు.

డ‌బుల్ బెడ్రూం ఇండ్లు - ద‌ళితుల‌కు మూడు ఎక‌రాల భూ పంపిణీ - ముస్లింలు/ గిరిజ‌నుల‌కు రిజ‌ర్వేష‌న్లు వంటి వాటి ఊసే లేద‌ని కాంగ్రెస్ నేత‌లు విమ‌ర్శించారు. అంతేకాకుండా ప్రారంభించ‌ని కేజీ టు పీజీ విద్యను సైతం త‌మ ఖాతాలో చేర్చుకున్నార‌ని ఆరోపించారు. ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జ‌రుగుతున్న‌ప్ప‌టికీ అలాంటిదేమీ లేద‌ని గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంలో పేర్కొన‌డం సిగ్గుచేట‌ని మండిప‌డ్డారు. అవినీతి తారాస్థాయిలో ఉన్నా దాన్ని ప‌క్క‌న పెట్టేలా గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం ఉంద‌ని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ రీతిలోనే తెలుగుదేశం సైతం విమ‌ర్శించింది. రాష్ట్రంలో నెలకొన్న సమస్యల ప్రస్తావన గవర్నర్ ప్రసంగంలో లేనేలేద‌ని తెలుగుదేశం పేర్కొంది. కొత్త సీసాలో పాత నీరుగా గవర్నర్ ప్రసంగం ఉందని బీజేపీ విమర్శించింది.

మ‌రోవైపు ప్ర‌తిప‌క్షాలైన టీడీపీ - కాంగ్రెస్ తీరుపై శాస‌న‌సభా వ్య‌వ‌హారాల మంత్రి హ‌రీశ్ రావు మండిప‌డ్డారు. సభ హుందాతనాన్ని దెబ్బతీసే విధంగా ఎందుకు వ్యవహరించిందో కాంగ్రెస్ ప్రజలకు చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగిలినా, నిరసన తెలిపినా చర్యలు తీసుకుందామని బీఏసీలో నిర్ణయం తీసుకున్నామ‌ని, దానికి భిన్నంగా కాంగ్రెస్ - తెలుగుదేశం పార్టీలు వ్యవహరించాయని హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సభ నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తున్నదని వ్యాఖ్యానించారు. సభలో చర్చించే సత్తా లేక, చర్చిస్తే ప్రభుత్వాన్ని అభినందించాల్సి వస్తుందన్న జంకుతో సభ నుంచి పారిపోయే ప్రయత్నం చేశార‌ని ఎద్దేవా చేశారు. సభ హుందాతనాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించి తమపై చర్య తీసుకునే పరిస్థితిని కాంగ్రెస్ స్వయంగా ఆహ్వానిస్తున్నదని అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/