Begin typing your search above and press return to search.

అమరావతి కోసం సరిహద్దులు దాటి వచ్చారు

By:  Tupaki Desk   |   17 Oct 2015 9:13 AM GMT
అమరావతి కోసం సరిహద్దులు దాటి వచ్చారు
X
ఏపీ రాజధానిని ముఖ్యమంత్రి చంద్రబాబే కాదు కోట్లాది మంది ప్రజలూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. ప్రపంచస్థాయి నగరంగా నిర్మిస్తున్న అమరావతిని సకాలంలో పూర్తి చేసేందుకు... అనుకున్న ప్రణాళిక ప్రకారం నిర్మించేందుకు ప్రజల సహకారం అవసరమని, ప్రజలు పెద్ద ఎత్తున విరాళాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే కోరారు. అందుకు సంబంధించి ఆయన మైబ్రిక్స్ మై అమరావతి పేరుతో వెబ్ సైట్ ఏర్పాటు చేసి విరాళాలు ఆహ్వానిస్తున్నారు. దీనికి స్పందన కూడా బాగుంది.

మరోవైపు అమరావతి నిర్మాణం కోసం విరాళాల సేకరణకు కళాకారులూ నడుంబిగిస్తున్నారు. ఇందులో తెలంగాణ కళాకారులూ ఉండడం గొప్పవిషయం. ది కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ''ఆర్ట్ బియాండ్ బౌండరీస్'' పేరుతో ఆర్ట్ ఎగ్జిబిషన్ కూడా నిర్వహిస్తున్నారు. ఇది 17 నుంచి 19వ తేదీ వరకు ఏర్పాటుచేస్తున్నారు. తెలంగాణకు చెందిన చిత్రకారులూ ఇందులో భాగస్వాములవుతున్నారు.

తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రముఖ చిత్రకారులు ఏలె లక్ష్మణ్ - బైరు రఘురాం - చిప్ప సుధాకర్ - డి.కవిత - కె.కిషన్ - ఎల్.సరస్వతి - శ్రీకాంత్ తదితరులు ఇక్కడి నిర్వహించే వర్క్ షాప్ లో పాల్గొనడమే కాకుండా ఆర్ట్ ఎగ్జిబిషన్ లో తమ చిత్రాలను ప్రదర్శనకు ఉంచుతున్నారు. ఆ కళాఖండాలను విక్రయించగా వచ్చే మొత్తాన్ని అమరావతి నిర్మాణానికి విరాళంగా ఇవ్వనున్నారు.