Begin typing your search above and press return to search.

ఏపీ, తెలంగాణలకు తలంటిన పర్యావరణ సంస్థ

By:  Tupaki Desk   |   5 Aug 2015 10:11 AM GMT
ఏపీ, తెలంగాణలకు తలంటిన పర్యావరణ సంస్థ
X
కొత్త రాష్ట్రాలుగా ప్రగతి పరుగులు తీసే క్రమంలో ఏపీ, తెలంగాణలు అనుసరిస్తున్న ధోరణి వినాశకరంగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పారిశ్రామిక పెట్టుబడులను ఆకట్టుకోవడంలో భాగంగా తెలుగు రాష్ట్రాలు పాటిస్తున్న విధానాలు ప్రమాదకరంగా ఉన్నాయని సెంటర్ ఫర్ సైన్సు అండ్ ఎన్విరాన్‌మెంట్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో వచ్చే ప్రముఖ పర్యావరణ పత్రిక డౌన్ టు ఎర్త్ లో దీనిపై ప్రత్యేక కథనం రాశారు. ఆ కథనంలో ఏపీ, తెలంగాణల విధానాలను ఏకిపడేశారు. రెండు రాష్ట్రాలూ అనుసరిస్తున్న మార్గం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని తేల్చిచెప్పింది. పర్యావరణం అంశాలను ఏమాత్రం పట్టించుకోకుండా పరిశ్రమలకు రెడ్ కార్పెట్ వేయడం వల్ల తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సివస్తుందని హెచ్చరించింది.

భారీ పెట్టుబడులతో వచ్చే వారికి సింగిల్ డెస్కు అనుమతులు పేరిట ఏమీ పట్టించుకోకుండా అనుమతులు ఇచ్చేస్తున్నారని... స్వీయ ధ్రువీకరణ.. భూమి, నీరు కేటాయింపులో నిబంధనలు పక్కకుపోతున్నాయని సెంటర్ ఫర్ సైన్సు అండ్ ఎన్విరాన్‌మెంట్ పేర్కొంది. ప్రధానంగా వ్వవసాయాధారిత ఏపీ,తెలంగాణలు ఇలా భూములు, జలాలను పరిశ్రమలకు ముందుచూపులేకుండా కట్టబెట్టడం వల్ల నష్టపోతారని హెచ్చరించింది. పారిశ్రామికరణ అవసరమే అయినా అందుకు సరైన విధానం పాటించాలని సూచించింది.