Begin typing your search above and press return to search.

ఏపీ మంత్రులను చూసి నేర్చుకోరాదా?

By:  Tupaki Desk   |   14 Sep 2015 5:30 AM GMT
ఏపీ మంత్రులను చూసి నేర్చుకోరాదా?
X
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు.. ఆంధ్రప్రదేశ్‌ అంటేనే అన్నపూర్ణ అని పేరు. ఇప్పుడు రెండు రాష్ట్రాలుగా విడిపోయినంత మాత్రాన.. ఆ వ్యవసాయిక ఇమేజి చెరగిపోయిందని అనుకోవడానికి వీల్లేదు. రెండు రాష్ట్రాలకు కూడా.. వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. పైగా రైతు మన ప్రగతికి వెన్నెముక అని చెప్పుకునే దేశంలో మనం ఉన్నాం. ఇలాంటి నేపథ్యంలో రైతు ఆత్మహత్యలు అనేవి కచ్చితంగా చాలా బాధాకరమైన దుర్ఘటనలు. అయితే ఇలాంటివి జరిగినప్పుడే.. రైతులకోసం ప్రభుత్వం ఉన్నదనే భరోసాను మిగిలిన జాతికి కల్పించాలి.

సరిగ్గా ఈ విషయంలోనే రెండు తెలుగు రాష్ట్రాలు రెండు రకాలుగా ప్రవర్తిస్తున్నాయి. తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే.. ప్రభుత్వం తరఫున మంత్రులు గానీ, ఆ స్థాయిలోని పెద్దలుగానీ స్వయంగా వెళ్లి వారిని పరామర్శించి ధైర్యం చెప్పడం అనేది జరగడం లేదు. ఎంతసేపూ ప్రెస్‌ మీట్‌ లు పెట్టడం - రైతులకోసం తమ ప్రభుత్వం చాలా చేసేస్తున్నదని వెల్లడించడం తప్ప.. రైతుజాతికి భరోసా ఇచ్చేలా తెరాస మంత్రులు తమ చేతల్లో చూపించడం లేదు. పైగా లింబయ్య వంటి వారి విషయంలో అది రైతు ఆత్మహత్యే కాదు పొమ్మంటూ దబాయించడం మరొక అంశం.

అదే అటు ఏపీలో పరిస్థితిని పరిశీలిస్తే.. అక్కడి ప్రభుత్వం రైతుల పట్ల కొంత సానుభూతితోనే వ్యవహరిస్తున్నదని అనుకోవాలి. ప్రకాశం జిల్లాలో పొగాకు రైతు ఆత్మహత్య చేసుకుంటే.. ఇద్దరు మంత్రులు స్వయంగా వెళ్లి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రభుత్వం చేయగల సాయాన్ని వివరించి.. పొగాకు తక్కువ క్వాలిటీ ఉన్నా కూడా కొనుగోలు ఏర్పాట్లు ప్రభుత్వం తరఫునే చేయబోతున్నాం.. అని.. అలాంటి పరిస్థితుల వల్ల రైతులు ఎవ్వరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పి వచ్చారు.

నిజానికి ఏపీ మంత్రులు చేసిన ఇలాంటి పని నుంచైనా తెలంగాణ మంత్రులు స్ఫూర్తి పొందితే బాగుంటుంది. ఆర్థిక సహాయం విషయంలో ఏ రాష్ట్రం నిర్ణయం వారిది కావచ్చు. ఏపీ 5 లక్షలు ఇస్తున్నంత మాత్రాన తెలంగాణ కూడా అంతే ఇవ్వాలని మనం డిమాండ్‌ చేయక్కర్లేదు. కానీ ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాల పట్ల సానుభూతితో - మానవత్వంతో స్పందించే విషయంలో - వారికి జీవితాల పట్ల భరోసా కల్పించే విషయంలో మాత్రం.. ఏపీ నుంచి టీ మంత్రులు నేర్చుకోవాలని పలువురు అంటున్నారు.