Begin typing your search above and press return to search.

తప్పంతా తమిళనాడు, కర్ణాటకలదే!

By:  Tupaki Desk   |   9 April 2015 1:30 AM GMT
తప్పంతా తమిళనాడు, కర్ణాటకలదే!
X
శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం దోపిడీకి సంబంధించి మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌పై తమిళనాడులో పార్టీలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఎన్‌కౌంటర్‌పై విచారణ జరపాలని డిమాండ్‌ చేస్తున్నాయి. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని, పోలీసులను తప్పుబడుతున్నాయి. నిజానికి, ఈ విషయంలో అసలు తప్పు ఎవరిది!? ఈ ప్రశ్నకు జవాబు తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలది!

జవ్వాది కొండల్లోని కూలీలంతా ఒకప్పుడు వీరప్పన్‌ అనుచరులు. వీరప్పన్‌ కోసం ఎర్ర చందనం దుంగలను కొట్టి తీసుకొచ్చేవారు. ఇప్పుడు కూలీలుగా ఉన్న కుటుంబాలు కొన్నేళ్లుగా ఇవే వ్యాపకంలో ఉన్నాయి. అప్పట్లో తండ్రులు అయితే.. ఇప్పుడు వాళ్ల కొడుకులు.. మనవలు. అంతే తేడా. వీరప్పన్‌ హయాంలో కూడా వీరి హవా బాగానే నడిచేది. అయితే, కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు ఉమ్మడిగా పథకం రచించి వీరప్పన్‌ను మట్టుబెట్టిన సంగతి తెలిసిందే.ఆ తర్వాత ఈ కూలీల ఉపాధి పోతుందని, వీరి కుటుంబాలు పూట గడవడం కష్టమనే వాదన వినిపించింది. దాంతో, ఈ కూలీల ఉపాధి విషయాన్ని తాము చూసుకుంటామని కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు హామీ ఇచ్చాయి. వారికి అవసరమైతే శిక్షణ ఇచ్చి, జన జీవన స్రవంతిలోకి తీసుకొస్తామని, వారికి మెరుగైన జీవనోపాధి కల్పిస్తామని హామీ ఇచ్చాయి.

మరి, దొంగలను జన జీవన స్రవంతిలోకి తీసుకురావడంలో విఫలమైన తమిళ పార్టీలు, ప్రభుత్వాలు ఇప్పుడు మానవ హక్కుల గురించి మాట్లాడడం సమంజసమేనా!? అసాంఘిక శక్తులకు అనుకూలంగా ప్రభుత్వాలు, పార్టీలు వత్తాసు పుచ్చుకోవడం భావ్యమేనా? ఇప్పుడు 20 మంది మాతమ్రే కాదు.. కొన్నేళ్లలో కొన్ని వందల మంది ఎర్ర దొంగలు చనిపోవడానికి కారణం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమా? కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలా!? ఇందుకు ఎవరిని శిక్షించాలి? న్యాయ స్థానాలు అయినా మానవ హక్కుల సంఘాలు అయినా ముందు ఈ అంశాన్ని తేల్చాల్సి ఉంది.