Begin typing your search above and press return to search.

తెలంగాణ ఫస్టు.. ఆంధ్ర సెకండ్

By:  Tupaki Desk   |   1 Aug 2016 9:51 AM GMT
తెలంగాణ ఫస్టు.. ఆంధ్ర సెకండ్
X
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈఓడీబీ) ర్యాంకులు తెలుగు రాష్ట్రాల మధ్య తీవ్ర పోటీని పెంచుతున్నాయి. ర్యాంకులు తరచూ మారుతున్నాయి. మరోవైపు రెండు రాష్ర్టాలూ దేనికవి తామే ముందుండాలని అనుకుంటూ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజా ర్యాంకుల్లో తెలంగాణ టాప్ లో నిలవగా... ఏపీ సెకండ్ ప్లేస్ లో ఉంది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖకు చెందిన వాణిజ్య విధాన విభాగం ప్రకటించిన ఈ ర్యాకుంల్లో 60.24 శాతం స్కోరుతో తెలంగాణ మొదటి స్థానంలో నిలవగా - 55.75 శాతం స్కోరుతో ఏపీ రెండో స్థానానికి పరిమితమైంది.

గత సంవత్సరం సెప్టెంబర్ లో ఏపీ రెండోస్థానంలో ఉండగా తెలంగాణకు 13వ స్థానంలో ఉండేది. కానీ... ఈ ఏడాది జూన్ లో ర్యాంకులు తారుమారయ్యాయి. తెలంగాణ రెండో స్థానంలో ఉండగా ఏపీ 19వ స్థానానికి పడిపోయింది. దాంతో ఏపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది. ఆ సమయంలో తమ వివరాలు కాపీ చేశారంటూ రెండు రాష్ట్రాలూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. అంతర్జాతీయ పెట్టుబడులు - వ్యాపార అనుకూల వాతావరణం కోసం అమలు చేస్తున్న విధానాలను ప్రామాణికంగా తీసుకుని ప్రపంచ బ్యాంక్ ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈవోడీబీ - సులభ వాణిజ్యం)’ ర్యాంకులను ప్రకటిస్తోంది. ఈ ర్యాంకుల్లో ముందు నిలిచేందుకు రెండు రాష్ట్రాలూ పోటీ పడుతున్నాయి. శాఖలవారీగా రాష్ట్రాలు సమర్పించే సమాచారం ఆధారంగా ‘స్కోరు’ను ఇస్తూ తాత్కాలిక పద్ధతిన ర్యాంకులను ప్రకటిస్తారు.

జూన్ 30 వరకు రాష్ట్రాలు ఇచ్చిన సమాచారం ఆధారంగా తాజా ర్యాంకులు ఇచ్చారు. రెండు రాష్ట్రాల మధ్య ర్యాకుంల అంతరం తక్కువగా ఉండడంతో ప్రస్తుతానికి వివాదాలు సద్దుమణుగుతాయని భావిస్తున్నారు. లేదంటే ఇంతకుముందులా రెండు రాష్ట్రాలు మళ్లీ పరస్పర ఆరోపణలతో రచ్చరచ్చ చేసుకునేవే.